దిష్టిబొమ్మల్లా శిలా ఫలకాలు | where Collectorate complex? | Sakshi
Sakshi News home page

దిష్టిబొమ్మల్లా శిలా ఫలకాలు

Published Tue, Jun 17 2014 2:26 AM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM

దిష్టిబొమ్మల్లా శిలా ఫలకాలు - Sakshi

దిష్టిబొమ్మల్లా శిలా ఫలకాలు

- నిర్మాణాలకు నోచుకోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలు
- నిధులు మంజూరైనా..  నిర్లక్ష్య ధోరణిలో అధికారులు

 
కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదీ?
జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించాలని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.35 కోట్ల అంచనా వ్యయం కాగల ఈ పనులకు అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కాంప్లెక్స్‌లోనే ప్రభుత్వానికి చెందిన 54 ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించడంతో, అంచనా మొత్తం రూ.100 కోట్లకు చేరింది.

పూణెకు చెదిన జీకేకే కన్‌స్ట్రక్షన్స్ సంస్థ 8 ఎకరాల విస్తీర్ణంలో యూ ఆకారంలో ఈ కాంప్లెక్స్ నిర్మించేందుకు డిజైన్ సిద్ధం చేసింది.ప్రస్తుతం కలెక్టరేట్ 6.75 ఎకరాల స్థలంతోపాటు, పక్కనే ఉన్న జేఎన్‌టీయూకి చెందిన మరో 2 ఎకరాలను స్థలాన్ని సేకరించాలని అధికారులు భావించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల  బాధ్యత ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించినా ఇప్పటికీ కనీసం పునాదికి కూడా నోచుకోలేదు.
 
ఆర్డీఓ కార్యాలయాలదీ అదే దుస్థితి
జిల్లాలో నూతనంగా ఏర్పడిన కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయ భవనాలు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. కల్యాణదుర్గం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని 17 సెంట్లు, కదిరిలోని హిందూపురం రోడ్డులో 10 సెంట్ల స్థలం  ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించడంతోపాటు, ఒక్కో భవన నిర్మాణానికి రూ.2 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అయితే, ఇప్పటికీ ఈ రెండు కార్యాలయ భవనాల పనులు ప్రారంభం కాలేదు.
 
ఏఈ కార్యాలయాల నిర్మాణాలు అంతంత మాత్రమే..
జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఒకటి చొప్పును గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో 63 మండలాలుండగా ఇప్పటి దాకా 33 కార్యాలయాల భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. కాగా, అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నా భవనాల నిర్మాణంలో జాప్యానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement