అప్పుల్లో గూడు! | TDP government six months to pay a dime | Sakshi
Sakshi News home page

అప్పుల్లో గూడు!

Published Sun, Oct 12 2014 3:00 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

అప్పుల్లో గూడు! - Sakshi

అప్పుల్లో గూడు!

  • ఆరు నెలలుగా పైసా చెల్లించని టీడీపీ ప్రభుత్వం
  •  ఇంటికి లక్షన్నర దేవుడెరుగు.. కట్టుకొన్న ఇళ్లకు బిల్లులెప్పుడో
  •  వడ్డీలకు తెచ్చి ఇళ్లు నిర్మించుకొంటున్న లబ్ధిదారులు
  •  మార్చినాటికి బకాయిరూ.16.53 కోట్లు
  • బి.కొత్తకోట: పేదల గూడు అప్పుల్లో కూరుకుపోతోంది. కొత్త ప్రభుత్వంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇంటికి లక్షన్నర ఇస్తామని హామీఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేదల నడ్డి విరుస్తున్నారు. వారిని మరింత అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ఆరు నెలలైనా ఒక్కపైసా చెల్లించకపోవడంతో లబోదిబోమంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 23తో ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.16.53 కోట్ల చెల్లింపులు ఆగాయి.
     
    నమోదు కాని నిర్మాణాలు

    మార్చి నెలాఖరుతోనే జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల నమోదు ఆగిపోయింది. మండల స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికారులు నిర్మాణాలను వదిలేశారు. జిల్లాలోని పేదలకు 4,43,009 గృహాలను మంజూరు చేశారు. వీటిలో 2,95,134 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. 31,900 పునాదుల స్థాయి, 2,130 గోడల స్థాయి, 13,170 రూఫ్‌లెవల్లో ఉన్నాయి. 1,00671 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టనేలేదని తేల్చారు. మే 24 వరకు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు రూ.1,236.2కోట్లను ఖర్చు చేశారు. అప్పటి నుంచి రికార్డు పరంగా ఈ లెక్కలో మార్పులేదు. ఎందుకంటే  క్షేత్రస్థాయిలో నిర్మాణాలను నమోదు చేయడం మానేశారు.
     
    బకాయిలు రూ.60 కోట్లు

    జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.60కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. వివిధ దశల్లోని నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. లబ్ధిదారులు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకొస్తున్నారు. మార్చి నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం ప్రారంభిస్తే రూ.60 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఇదిగాక మార్చిలోపున్న బకాయిలు కలుపుకుంటే రూ.75 కోట్లకుపైనే చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు.
     
    లక్షన్నర ఎప్పుడో

    టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటికి రూ.లక్షన్నర ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో కనీసం కట్టుకుంటున్న ఇళ్లకైనా బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి ఎస్టీలకు రూ.1.05 లక్షలు, ఎస్సీలకు రూ.లక్ష, బీసీ, ఓసీలకు రూ.70వేలు ఇస్తున్నారు.
     
     వడ్డీలకు తెచ్చి కడుతున్నాం
     నా భార్య నాగరత్నమ్మకు ఇందిరమ్మ గృహం మం జూరైంది. పునాది దశలో రూ.14 వేలు, గోడల దశలో 34 వేల బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా పైకప్పుకు మోల్డింగ్ వేస్తేనే బిల్లులు వస్తాయి లేకుంటే రావని అధికారులు చెప్పడంతో రూ.20 వేలు అప్పుతెచ్చి పైకప్పు నిర్మాణం పూర్తి చేశాం. ఇంతవరకు బిల్లులు చేతికందలేదు.
      -డీ.వెంకట్రమణ, పెద్దతిప్పసముద్రం
     
     అప్పులెలా తీర్చాలి
     ఇందిరమ్మ పథకంలో ఇల్లిచ్చారు. బిల్లులివ్వకుంటే చేసిన ఎలా కట్టుకోవాలి. గతంలో రెండు దఫాలుగా రూ.39 వేలు ఇచ్చారు. సుమారు లక్ష మేరకు అప్పుచేశాం. మిగిలిన బిల్లు కోసం అధికారులను అడిగితే ఎవరూ సమాధానం ఇవ్వరు. ఇంటి పనులు ఆపేశాం, అప్పులు మిగిలిపోయాయి.
     -బి.వల్లెమ్మ, పెద్దకొండామర్రి

     మోల్డింగ్ పనులతో ఆపేశాం..
     ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఆనందమేసింది. పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయండి బిల్లులు ఇస్తామని అధికారులు చెప్పారు. పూర్తిచేసినా ఇప్పటివరకూ రూ.16 వేలు ఇచ్చారు. మిగిలిన బిల్లు ఇస్తే పనులు పూర్తి చేస్తామని అధికారులకు తెలిపినా పట్టించుకునేవారు లేరు.
     -టీ.అలివేలమ్మ, పెద్దకొండమర్రి
     
     పట్టించుకునేదెవరు
     ఇందిరమ్మ ఇంటికి పునాది, గోడల దశ వరకు మాత్రమే బిల్లులిచ్చారు. మూడు నెలల క్రితం ఇంటి పైకప్పు కోసం రూ.30 వేలు అప్పుచేసి నిర్మాణం పూర్తి చేయించాం. ఇంతవరకు బిల్లు మంజూరు చేయలేదు. నిర్మాణం పూర్తిచేస్తే బిల్లులు తొందరగా మంజూరు చేస్తామని చెప్పిన అధికారులు పత్తాలేరు. అప్పులకు వడ్డీలు కడుతున్నాం.    
     -కే. రెడ్డెమ్మ, పెద్దతిప్పసముద్రం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement