అధికారులకు బదిలీల జ్వరం | Transfers to the fever | Sakshi
Sakshi News home page

అధికారులకు బదిలీల జ్వరం

Published Tue, Jun 3 2014 12:51 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

అధికారులకు బదిలీల జ్వరం - Sakshi

అధికారులకు బదిలీల జ్వరం

  • ఎదురుచూపులు
  •   అనుకూల పోస్టింగ్‌ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు
  •   కమిషనరేట్‌లో స్థానం కోసం సీఐల రాజకీయ పైరవీలు
  •   తహశీల్దార్, ఎంపీడీవోలదీ అదే పరిస్థితి
  •   ఏ బదిలీ అయినా పది రోజుల తర్వాతే
  •  ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది.. దీంతో పాటు రాష్ట్ర విభజన కూడా జరిగింది.. ఈ నేపథ్యంలో బదిలీలకు అవకాశముండటంతో అధికారులు ఇప్పటినుంచే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు అనుకూలమైన స్థానాల కోసం పైరవీలు చేస్తున్నారు.
     
    సాక్షి, విజయవాడ : అధికారులకు బదిలీల జ్వరం పట్టుకుంది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఏ ఇద్దరు అధికారులు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పొరుగు జిల్లాలకు బదిలీ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు దాటింది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సహజంగా అన్ని కీలక విభాగాల్లో బదిలీలు జరుగుతాయి.

    కలెక్టర్ స్థాయి నుంచి ఎస్‌ఐల వరకు అన్ని కేటగిరీల్లో ఉంటాయి. సొంత ప్రాంతంలో పోస్టింగ్ కోసం కొందరు, ఆదాయ వనరులు బాగా ఉండే ప్రాంతంలో మరికొందరు పోస్టింగ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ పలువురు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
     
    రాష్ట్రపతి పాలన ముగిశాకే...

    జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి సుమారు 30 వేల మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. గత ఫిబ్రవరిలో 47 మంది ఎంపీడీవోలు, 42 మంది తహశీల్దార్లు, విజయవాడ కమిషనరేట్ పరిధిలో 19 మంది సీఐలు, 30 మందికి పైగా ఎస్‌ఐలు, జిల్లా పోలీసు శాఖ పరిధిలో 10 మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలు బదిలీపై పొరుగున ఉన్న గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలకు వెళ్లారు. వారంతా తిరిగి జిల్లాకు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఇంకా  రాష్ట్రపతి పాలన అమలులో ఉండడం బదిలీలకు అడ్డంకిగా మారింది.
     
    ఎవరి ప్రయత్నాలు వారివి...
     
    రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారాక కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారుల బదిలీలు సాధారణంగా జరుగుతుంటాయి. వీరితోపాటు కిందిస్థాయి అధికారులకు కూడా బదిలీలు జరుగుతాయి. ఎన్నికల నేపథ్యంలో ఇతరప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా బదిలీల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వపరమైన కార్యక్రమాలు, ఫైళ్లు పెండింగ్ పడిపోతున్నాయి. తాత్కాలికంగా బదిలీపై వచ్చిన అధికారులెవరూ ముఖ్యమైన ఫైళ్లు క్లియర్ చేయకపోవడంతో ప్రభుత్వ శాఖలతో ముడిపడిన వ్యవహారాలు నిలిచిపోతున్నాయి. విధానపరమైన అంశాల విషయంలోనూ కొందరు అధికారులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచేస్తున్నారు.  
     
    ఆదాయం వచ్చే స్టేషన్లపై పోలీసుల గురి...
     
    పోలీసు అధికారులు బదిలీల కోసం రాజకీయ పైరవీలు సాగిస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో పనిచేస్తున్న సీఐ, ఎస్‌ఐలు అనేకమంది జిల్లాకు చెందిన వారున్నారు. ఎన్నికల సమయంలో జిల్లా నుంచి సుమారు 70 మంది వరకు సీఐ, ఎస్‌ఐలు ఇతర జిల్లాలకు వెళ్లారు. మరో పది రోజుల తర్వాత బదిలీలు జరిగే అవకాశం ఉండటంతో కొందరు సెలవు పెట్టి మరీ పైరవీలు సాగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలిసి తమ అభ్యర్థనలను తెలిపి సహకరించాలని కోరుతున్నారు.

    మరికొందరు నేరుగా హైదరాబాద్ వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలను కలవడం గమనార్హం. కమిషనరేట్‌కు సంబంధించి విజయవాడ నగరంలో ఎక్కడ పోస్టింగ్ దక్కినా అది ఆదాయం ఎక్కువగా వచ్చే (ఫోకల్) స్థానమే అవుతుంది. దీంతో ఆర్థిక, సామాజిక అంశాలతో కొందరు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక జిల్లా పోలీసు శాఖలో మున్సిపాలిటీల్లో ఆదాయం బాగుంటుంది. దీంతో పట్టణాల్లో పోస్టింగ్ కోసం కొందరు సీఐలు ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు.
     
    మీ ఇష్టమే.. మా ఇష్టం
     
    ఇక తహశీల్దార్, ఎంపీడీవోలు కూడా ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లా నుంచి 47 మంది ఎంపీడీవోలు, 42 మంది తహశీల్దార్లు బదిలీ యత్నాల్లో ఉన్నారు. పలువురు అధికారులు ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించి ఫలానాచోట పోస్టింగ్ ఇప్పించాలని కోరుతున్నారు. కుదరని పక్షంలో మీ నియోజకవర్గంలో ఎక్కడ పోస్టింగ్ ఇప్పించినా ఫర్వాలేదు.. మీ ఇష్టమే మా ఇష్టం.. మీకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పి ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూనియన్ కార్యకలాపాల్లో నిమగ్నమైన నేతలు టీడీపీ ముఖ్యనేతల నుంచి సిఫార్సులతో ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. దీంతో నేతల నివాసాలు సందడిగా మారిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement