- మొత్తం 33,37,071 మంది ఓటర్లు
- 3,547పోలింగ్ కేంద్రాలు
- జిల్లాకు 34పారామిలటరీ దళాలు
- బందోబస్తుకు 5,590మంది పోలీసులు
- కలెక్టర్ రఘునందనరావు, ఎస్పీ ప్రభాకరరావు వెల్లడి
సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.రఘునృదన్‌రావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఈ నెల 7న జరిగే ఎన్నికల ఏర్పాట్లను వివరించారు.
జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. గత నెల 23న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 33,37,071 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
గత ఏడాది నవంబర్‌తో పోల్చితే సుమారు 3,02,814 మంది కొత్త ఓటర్లు పెరిగినట్టు చెప్పారు. మొత్తం ఓటర్లలో పురుషులు 16,58,639 మంది, మహిళలు 16,78,118 మంది, ఇతరులు 314 మంది ఉన్నారని వివరించారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గానికి 22 మంది, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి 11 మంది. ఏలూరు లోక్‌సభ నియోజకవర్గానికి 15 మంది పోటీ చేస్తున్నట్టు చెప్పారు. 16 అసెంబ్లీ స్థానాలకు 227 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు.
విజయవాడ లోక్‌సభ, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22 మంది చొప్పున అభ్యర్థులు, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 20 మంది, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 17మంది చొప్పున పోటీ చేస్తున్నారని వివరించారు. ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నందున రెండు ఈవీఎంల చొప్పున ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు.
మొత్తం 3,547 పోలింగ్ కేంద్రాలు...
జిల్లాలో మొత్తం 3,547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, విజయవాడ అర్బన్‌లో 1,142, రూరల్ 2,405 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే అదనంగా మరొక సిబ్బందిని ఇస్తామన్నారు. జిల్లాలో 12,915 ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ప్రతిచోటా అదనంగా కొన్ని ఈవీఎంలను రిజర్వ్ చేసి ఉంచుతున్నామని అన్నారు.
ఈ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 25,677 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నట్టు చెప్పారు. నూరుశాతం ఓటరు స్లిప్‌ల పంపిణీ మంగళవారం నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 70 శాతం పూర్తి చేసినట్టు వివరించారు. ఓటరు స్లిప్‌లు అందకపోయినా ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎలక్షన్ కమిషన్ సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని తీసుకుని వెళితే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు.
జిల్లాలో 25,677 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కు ధరఖాస్తు చేశారని, 23,354మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన అన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న 2,892 చోట్ల వెబ్‌కాస్టింగ్ పద్ధతిని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకోసం నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన 3,065 మంది విద్యార్థులను వినియోగిస్తున్నామన్నారు.
లెక్కలు సక్రమంగా చూపాల్సిందే..
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన లెక్కలను ఖచ్చితంగా ఎన్నికల అధికారులకు సమర్పించాలని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ రోజు కోసం ఎంపీ అభ్యర్థి తొమ్మిది వాహనాలకు, ఎమ్మెల్యే అభ్యర్థికి మూడు వాహనాలకు అనుమతులు తీసుకోవాల్సి ఉందని కలెక్టర్ చెప్పారు.
ప్రశాంత ఎన్నికలకు మేము సిద్ధం : ఎస్పీ
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు చెప్పారు. ఎన్నికలకు 34 కంపెనీల పారామిలటరీ దళాలు వచ్చాయన్నారు. జిల్లాలో 5,590 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల బందో బస్తు నిర్వహిస్తారని చెప్పారు.