సర్వం సిద్ధం | Prepare everything | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Fri, Sep 12 2014 12:59 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

సర్వం సిద్ధం - Sakshi

సర్వం సిద్ధం

  • 200 పోలింగ్ బూత్‌లు
  •   రెండువేల మంది పోలీసులు
  •   ముగిసిన ఎన్నికల ప్రచారం
  •   1.84 లక్షల ఓటర్లు
  •   13న పోలింగ్, 16న ఫలితం
  • సాక్షి ప్రతినిధి, విజయవాడ : నందిగామ ఉపపోరుకు సర్వం సిద్ధమయింది. తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం మొదలుకొని పోలీసు బందోబస్తు వరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు గంటలకే ప్రచార పర్వానికి తెర దించారు. అలాగే మద్యం దుకాణాలు మూసి వేయించారు. శుక్రవారం సాయంత్రానికే ఎన్నికల సిబ్బంది విధులకు హాజరు కానున్నారు. 200  పోలింగ్ బూత్‌లు, రెండు వేల మంది పోలీసు సిబ్బంది, 1400 మంది ఇతర విభాగాల ఉద్యోగులు ఎన్నికల విధుల కోసం సిద్ధమయ్యారు. 13వ తేదీన పోలింగ్, 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.
     
    ఎన్నికల బరిలో...

    ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్రందాయానికి కట్టుబడి ఈ పర్యాయం ఎన్నికలకు దూరంగా ఉంది. నందిగామ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది.   కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పి బరిలోకి దిగింది.  

    అధికార టీడీపీ తంగిరాల కుమార్తె  సౌమ్యకు టికెట్ కేటాయించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి బోడపాటి బాబూరావు బరిలో నిలిచారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కఠారపు పుల్లయ్య, మాతంగి పుల్లారావు బరిలో నిలిచారు. వీరిలో పుల్లారావుకు సీపీఎం పార్టీ మద్దతు ప్రకటించింది.  అధికార పార్టీ తరఫున జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, మరో మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు విస్తృత ప్రచారం నిర్వహించారు.

    కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు జేడీ శీలం, కోండ్రు మరళీ, కిల్లి కృపారాణి, బొత్స సత్యనారాయణ, దేవినేని రాజశేఖర్ నెహ్రూ, మల్లాది విష్ణు తదితరులు ప్రచారం నిర్వహించారు.  గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగించి ప్రలోభాల వ్యవహరంపై దృష్టి సారించారు. నిన్నమొన్నటి వరకు భారీ మెజార్టీ ఆశించిన టీడీపీ... కాంగ్రెస్ పార్టీ చాపకింద నీరులా చేసిన ప్రచారంతో కొంత ఆందోళనకు గురవుతోంది. అధికార, ధన బలాన్ని ఉపయోగించేందుకు  రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎక్సైజ్ అధికారులు నియోజకవర్గంలోని మద్యం షాపులన్నింటికీ సీలు వేశారు.  48 గంటలపాటు షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
     
    ఖర్చు ఎంతైనా టీడీపీ ముందుకు...
     
    ఈ ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసేందుకు టీడీపీ రెడీగా ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఓటుకు రూ. 300లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
     
    కాంగ్రెస్ బూత్‌కు రూ. 10వేలు ఖర్చు...  

     
    కాంగ్రెస్ పార్టీ బూత్‌కు పది వేలు ఖర్చు పెట్టేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులకు రాష్ట్ర పార్టీ అధిష్టానం నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. పదివేలతో ఓటర్లను బూత్‌ల వద్దకు తరలించడం, పోలింగ్ ఏజెంట్లకు అయ్యే ఖర్చులు భరించడం వంటి కార్యకలాపాలకు ఖర్చు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి వారికి సూచనలు అందాయి.
     
    మొదటి నుంచీ టీడీపీకే అనుకూలం...
     
    నందిగామ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడి ఓటర్లు టీడీపీకే పట్టం కడుతూ వచ్చారు. పలు మార్లు ఇక్కడి నుంచి ప్రస్తుత రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, ఆయన అన్న, దివంగత మాజీ మంత్రి దేవినేని రమణ గెలిచారు. గత ఎన్నికల్లో ఎస్సీకి రిజర్వు కావడంతో టీడీపీ ప్రభాకర్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో దేవినేని ఉమామహేశ్వరావు మైలవరం నియోజకవర్గానికి మారారు. ఇదిలా ఉండగా  వైఎస్సార్‌సీపీ ఓటర్లు చాలా మంది ఓటువేసేందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓటింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది.
     
    1.84 లక్షల ఓటర్లు..
     
    నియోజకవర్గంలో 1,84, 064 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 90,309 కాగా, మహిళా ఓటర్లు అధికంగా 93,309 మంది ఉన్నారు.  200 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో 129 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక బూత్‌లుగా నిర్ధారించి అక్కడ పోలింగ్ సరళిని నేరుగా ఎన్నికల కమిషన్ పర్యవేక్షించేలా వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌లలో విధుల నిర్వహణకు 1400 మంది సిబ్బందిని కేటాయించారు.  
     
    భారీ బందోబస్తు...

    గతంలో ఫ్యాక్షన్ వివాదాలు చోటుచేసుకున్న క్రమంలో 755 మంది సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు, రెండు ప్లటూన్ల బలగాలు (225 మంది పోలీసులు), 5గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 100 మంది ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలు, 100 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 400 మంది కానిస్టేబుళ్లు, 300 మంది హోంగార్డులతో బందోబస్తు ర్పాట్లు చేశారు. ఇప్పటికే 40 శాతం మంది సిబ్బంది విధుల్లో ఉండగా శుక్రవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో సిబ్బంది విధుల్లోకి రానున్నారని జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement