సాక్షి, ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏళ్లుగా దరఖాస్తు చేసుకుంటున్నా అవి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. అర్హత లేవన్న సాకుతో అధికారులు తిరస్కరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో లక్షకు పైగా మాత్రమే మంజూరు చేయడం గమనార్హం. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘మీకు తప్పకుండా ఇల్లు మంజూరు చేయిస్తాం’ అని.. నేతలు హామీలు గుప్పిస్తున్నారు.
ఇందిరమ్మ మూడు దశల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. ఇంకా చాలా మంది అర్హులకు అందలేదు. దీంతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రచ్చబండ, గృహ నిర్మాణ శాఖ కార్యాలయాలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌డేలలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, కేవలం 1, 24, 921 మందినే అర్హులని తేల్చారు.
ఇందులో ఇప్పటి వరకు 1,01,579 మందికి మాత్రమే ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా అర్హులైన 23,342 మందికి త్వరలో మంజూరు చేస్తామని అధికారులు చెపుతున్నప్పటికీ.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే దీనికి బ్రేక్ పడుతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. అసలు మంజూరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేవోననే అనుమానంతో పలువురు లబ్ధిదారులు మళ్లీ గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌ను కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు. కాగా, ఇప్పటికే మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు కూడా అధికారికంగా ఉత్తర్వులు అందకపోవడంతో వారిలోనూ అయోమయం నెలకొంది. దీనిపై లబ్ధిదారులు మండల కార్యాలయాల్లో సంప్రదించినా వారికి సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు.
ఉత్తుత్తి హామీలేనా..
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని రాజకీయ పార్టీల నేతలు చెపుతుండడంతో నిరుపేదలు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు కారా్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ‘ఇళ్లు ఇప్పిస్తాం.. మీ దరఖాస్తులు మా పార్టీ గ్రామ నాయకులకు ఇవ్వండి’ అని చెపుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఇళ్లు మంజూరు కావని తెలిసి కూడా.. ఓట్ల కోసమే ఇలాంటి హామీలు గుప్పిస్తుండడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో ఐదేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లకు కూడా ఇప్పుడు ఆయా ప్రజాప్రతినిధులు తమ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి బిల్లులు మంజూరు చేయిస్తున్నట్లు సమాచారం. మధిర నియోజకవర్గంలో ఈ వ్యవహారం జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లక్షల సంఖ్యలో ఆన్‌లైన్ కాని దరఖాస్తులు..
గత ఏడాది ప్రతి మండల పరిధిలో వేల సంఖ్యలో స్వీకరించిన దరఖాస్తులు మండల కార్యాలయాల్లో ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. నెలలు గడిచినా వాటిని ఆన్‌లైన్ చేయడంలో టెక్నికల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతకుముందు ఆన్‌లైన్ చేసిన వాటిలోనూ కొంతమందికే ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నేతల వద్ద కూడా మరికొన్ని దరఖాస్తులు ఉన్నాయి. ‘మాకు దరఖాస్తులు ఇస్తే వెంటనే ఇళ్లు మంజూరు చేయిస్తా’మని పేదలను వారు మభ్యపెడుతున్నారు.
ఖర్చుల పేరుతో కొంత డబ్బు తీసుకుంటున్న సదరు నాయకులు.. ఆ దరఖాస్తులను మండల కార్యాలయాల్లో అందజేయడం లేదు. ప్రతి మండలం, మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఆన్‌లైన్ కాకుండా ఉన్నా వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక ఇళ్ల మంజూరు ప్రక్రియకు మరో ఆర్నెళ్ల పాటు బ్రేక్ పడనుంది.
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?
Published Sat, Mar 1 2014 2:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement