వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. శుభకార్యాల వేళ ధర పెరగడంతో ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ధరలతోపాటు వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు ఏమాత్రం తగ్గటం లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం చికెన్ కిలో ధర రూ.200 పలికింది.
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 పెరిగిపోయింది. విజయవాడలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఉన్న చేపల మార్కెట్ వంటి పెద్ద ప్రాంగణాల్లో స్కిన్ రూ.290 స్కిన్‌లెస్ రూ.300 చొప్పున విక్రయిస్తుండగా.. సాధారణ మార్కెట్లలో మాత్రం రూ.300లకు తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు.
వేసవి.. ఆపై శుభకార్యాలు
వేసవి సీజన్‌లో సాధారణంగా చికెన్ ధర పెరగటం సహజం. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే అధికంగా పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆ నష్టాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూర్తాలు ఉండటం వల్ల డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవటం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు.
గుడ్డు ధరలూ పెరిగాయ్
కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోడిగుడ్లు అమ్మే దుకాణాల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గత నెలలో పాతిక గుడ్లు సుమారు రూ.100 నుంచి రూ.110 వరకూ విక్రయించారు. ఇప్పుడు 25 కోడిగుడ్లు రూ.135కు హోల్‌సేల్ వ్యాపారులు విక్రయిస్తుండగా.. రిటైల్‌గా ఒక్కొక్కటి రూ.6, రూ.6.50 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్‌లో ఆదివారం 25 గుడ్లు రూ.127 ధర పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment