అన్నీ ఒకేసారి కుదరవు..!
ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కొక్కటీ సాధించొచ్చు
♦ మొదటి నుంచీ ‘సిప్’ చేయటమే ఉత్తమం
♦ ఇదీ... రవికుమార్‌కు అనిల్‌రెగో సూచన
మీరు ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యాలు బాగున్నాయి. పెట్టుబడి సాధనాల్లో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను వృద్ధి చేసుకుంటూ మీ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. మీరిచ్చిన సమాచారం ఆధారంగా, మీ లక్ష్యాల్లో ఎప్పటికి ఎంత మొత్తం అవసరమవుతుందో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ప్రస్తుత ధరలను బట్టి, మీరు మధ్యస్థాయి రిస్క్ చేయగలరన్న నమ్మకంతో లెక్కించడం జరిగింది.
ఇలా చేద్దాం...
ప్రస్తుతం మీ ఆదాయాన్ని బట్టి లక్ష్యాలన్నింటికీ ఒకేసారి కేటాయించడం కుదిరే పని కాదు. కాబట్టి మీ ప్రాధాన్యాలను బట్టి లక్ష్యాలను నిర్దేశించుకొని దాని ప్రకారం ఒక్కొక్కటీ నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ లక్ష్యాలను పరిశీలిస్తే కారు కొనుక్కోవడం అనేది స్వల్పకాలిక లక్ష్యంగాను, సొంతిల్లు సమకూర్చుకోవడం అనేది మధ్యకాలిక లక్ష్యంగా, పదవీ విరమణ అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా విభజించొచ్చు. ఈ స్వల్పకాలిక లక్ష్యం చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. దీనికంటే ముందు ఆఫీసులో కారు లోన్ ఆప్షన్ ఉందేమో తెలుసుకోండి.
దీనివల్ల మీరు ఈఎంఐలో కారులోన్ తీర్చే అవకాశం ఉండటంతో పాటు, ఇది పెర్క్ కిందకు వస్తుంది కాబట్టి ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇక మధ్యస్థాయి, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి డెట్, ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఇంటిని రుణం మీద కొనుగోలు చేయండి. ఇంటి విలువ రూ.40 లక్షలు అనుకుంటే ఇందులో 20 శాతం డౌన్ పేమెంట్ అంటే రూ.8 లక్షలు సమకూర్చుకోవాలి. దీనికి ఇప్పుడున్న డబ్బుకు అదనంగా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మిగిలిన మొత్తం రూ. 32 లక్షలకు రుణం తీసుకుంటే 20 ఏళ్లపాటు ఈఎంఐ కింద ప్రతి నెలా రూ. 30,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మీ పొదుపుపై ప్రభావం పడుతుంది.
ప్రస్తుతం మీరు ప్రతి నెలా రూ. 20,000 పొదుపు చేయగలమన్నారు. ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కింద ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ దగ్గర సేవింగ్స్ ఖాతాలో ఉన్న రెండు లక్షల్లో రూ.60,000 అత్యవసర నిధి కింద ఉంచి, మిగిలిన మొత్తాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ కింద ఈక్విటీ ఫండ్స్‌లోకి మార్చుకోండి. ఈ విధానం అమలు చేయడం ద్వారా త్వరితగతిన మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు.
ఇవన్నీ ప్రస్తుత ధరలను బట్టి లెక్కించడం జరిగింది. ప్రస్తుత ఖర్చుల్ని బట్టి నెలకు రూ. 10,000 చొప్పున పెన్షన్ లెక్కించాను. కానీ ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే ఇంకా పెద్ద మొత్తం అవసరమవుతుంది. ఇక ఇంటి నిర్మాణానికి వస్తే ఇంటి విలువలో 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
నా పేరు రవి కుమార్(30). నెల జీతం రూ.30,000. ఇంకా పెళ్లి కాలేదు కనక కుటుంబ బాధ్యతలేవీ లేవు. ప్రతి నెలా ఖర్చులు రూ.10,000 పోగా మిగిలిన మొత్తం రూ. 20,000 దాచుకోగలను. కానీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఎలాంటి అవగాహనా లేకపోవడంతో ఈ మొత్తం సేవింగ్స్ ఖాతాలోనే ఉంటున్నాయి. ఇలా నా సేవింగ్స్ ఖాతాలో ఇపుడు రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. నా ఆర్థిక లక్ష్యాల విషయానికొస్తే 35 ఏళ్లు వచ్చే నాటికి సొంతిల్లు సమకూర్చుకోవడం... రెండేళ్లలో రూ.10 లక్షలు పెట్టి కారు కొనుక్కోవడంతో పాటు రిటైర్మెంట్‌కు తగిన నిధిని సమకూర్చుకోవడం. దీనికి ఏం చేయాలి? ఇవి సాధ్యమవుతాయా?
- రవి, హైదరాబాద్.