నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని
నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి.
తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్‌లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు.
ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్‌లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment