నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్‌పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్‌క్యాప్ లేదంటే ఎడెల్‌వీజ్ స్మాల్‌క్యాప్, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి
మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్‌లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్‌లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్‌లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది.
అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి.
గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్‌ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్‌లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు.
ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్‌లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment