న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లకు దేశీ నిధుల మద్దతు దండిగా ఉంది. ఇందుకు నిదర్శనంగా మే నెలలోనూ ఈక్విటీ ఫండ్స్ రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.15,890 కోట్ల కంటే మరింత అధికంగా వచ్చాయి. మే నెలకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2021 మార్చి నెల నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలల కాలంలో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి.
అన్ని విభాగాల్లోకి..
► మే నెలలో ఈక్విటీలోని అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,939 కోట్లు వచ్చాయి.
► లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, సెక్టోరల్ ఫండ్స్‌లోకి రూ.2,200 కోట్లు, అంతకుమించి పెట్టుబడులు వచ్చాయి.
► ఇండెక్స్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు రూ.11,779 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి.
► గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.203 కోట్లను ఆకర్షించాయి.
► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు నెల ఏప్రిల్‌లో రూ.69,883 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
► అన్ని విభాగాలు కలిపితే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,532 కోట్లను నికరంగా వెనక్కి తీసేసుకున్నారు. ఏప్రిల్‌లో నికర పెట్టుబడుల రాక రూ.72,846 కోట్లుగా ఉంది.
► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్ చివరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.37.37 లక్షల కోట్లకు క్షీణించింది.
సిప్ కళ..: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.11,863 కోట్లు కాగా>, మే నెలలో రూ.12,286 కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లోనూ ఈక్విటీల పట్ల నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.10వేల కోట్లకు పైన రావడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడాన్ని గమనించాలి.
ఈక్విటీలకు దేశీ ఇన్వెస్టర్ల మద్దతు
Published Fri, Jun 10 2022 5:46 AM | Last Updated on Fri, Jun 10 2022 5:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment