అద్దె ఇంట్లో ఉంటూ సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్నారా? ఇల్లు కొనడం మంచిదా లేక అద్దె ఇంట్లోనే కాలం గడపడం మంచిదా? ఈ రోజు ఈ ప్రశ్నలకు జవాబుగా మీ జాతకపరంగా పరిష్కారం చెప్పటం లేదు. ఇది ఏదో ఒక రుణ సంస్థ తరఫున ప్రకటన కాదు. ఫలానా దగ్గరే కొనమని విసిగించడమూ కాదు. ఇప్పుడు చెప్పబోతున్నది ఇల్లు, ఫ్లాటు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే. కేవలం ఆర్థికపరంగా, ఇన్‌కం ట్యాక్స్ చట్టపరంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు తెలుసుకోండి. ఈ విషయంలో సెంటిమెంటు జోలికి వెళ్లకండి.
ఎక్కడ కొందామనుకుంటున్నారు?
మీకు కానీ మీ కుటుంబసభ్యులకు అనువైన లొకేషన్‌లో కొనండి. అన్నింటికీ దగ్గరగా ఉండాలి. రవాణా సౌకర్యం ఉండాలి. వాన, వరద వస్తే ముంపునకు గురి కాకూడదు. మీరే ఉంటారా లేక కేవలం అద్దె.. అంటే ఆదాయం కొసం తీసుకుందామనుకుంటున్నారా అనేది చూసుకోవాలి. కొంత మంది పెన్షన్ లేని వాళ్లు నెలసరి ఆదాయం కోసం ఇళ్లు కొన్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.
మీ వనరుల సంగతేమిటి?
మీరు ఇంటికోసం ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇటువంటి విషయాల్లో ఎంత పక్కాగా లెక్కలు వేసినప్పటికీ అదనపు భారం అనివార్యం. టైం కూడా మీ చేతిలో ఉండదు. వ్యవహారం సాఫీగా జరగకపోవచ్చు. మొత్తం ఇన్వెస్టుమెంటు రెడీగా ఉందా? అప్పు అవసరమా? అనవసరమా? అప్పు ఎక్కడ నుంచి తీసుకోవాలి? ఏ సంస్థా పూర్తి మొత్తాన్ని అప్పుగా ఇవ్వదు. మనం కొంత మార్జిన్ మనీ చెల్లించాలి. కాబట్టి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
మీరు చేసిన ఇన్వెస్టుమెంటుకి, చెల్లించిన మార్జిన్ మనీకి ‘సోర్స్’ ఉండాలి. ‘సోర్స్’ అంటే అప్పు కావచ్చు, మీ సేవింగ్స్ కావచ్చు, పన్ను చెల్లించగా మిగిలిన మొత్తం కావచ్చు, మీ అబ్బాయి అమెరికా నుండి పంపి ఉండవచ్చు, మీకు వీలునామా ద్వారా సంక్రమించిన బ్యాంకు బ్యాలెన్సు కావచ్చు లేదా లాటరీ తలుపు తట్టి ఉండవచ్చు. ‘సోర్స్’కి రాత లు, కోతలు ఉండాలి. అలా ఉండకపోతే ఆ మొ త్తాన్ని మీ ఆదాయంగా భావిస్తారు. క్యాపిటల్ బడ్జె ట్ వేసుకున్నాకా, రెవెన్యూ బడ్జెట్ వేసుకోవాలి.
రెవెన్యూ బడ్జెట్ గురించి ఆలోచించారా?
అన్నీ సక్రమంగా ఉండి, సకాలంలో ఇల్లు పూర్తి అయ్యిందనుకోండి. మీరే ఆ ఇంట్లో ఉంటే ఇంటి రుణం చెల్లింపుల మీద, రుణం మీద వడ్డీ (పరిమితుల మేరకు) మినహాయింపు లభిస్తుంది. కానీ ప్రతి నెలా వాయిదా (ఈఎంఐ) చెల్లించగలగాలి. మీకు వచ్చే హెచ్‌ఆర్‌ఏ పన్నుకి గురి అవుతుంది. ఆర్థికపరంగా బండి సాఫీగా వెళ్లాలి. అద్దెకి ఇచ్చారనుకోండి. వచ్చిన అద్దెను తప్పకుండా ఆదాయంగా చూపించాలి. అవసరం అయితే, పన్ను చెల్లించాలి. స్వంత ఇల్లు/కొత్త ఇల్లు నిర్వహించడానికి బోలెడంత .. లేదా అనుకోని ఖర్చులు అవుతాయి. వీటన్నింటికీ సిద్ధంగా ఉండాలి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్‌కు పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment