నా వయసు 40 ఏళ్లు. పీపీఎఫ్‌లో నేను 15 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే ఏడాదితో గడువు ముగుస్తుంది. దీంతో గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తాన్ని మెరుగైన వృద్ధి అవకాశాలున్న ఎన్‌పీఎస్, తదితర పథకాల్లో వచ్చే 15–20 ఏళ్ల కాలానికి పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి వచ్చే మొత్తం పన్ను రహితమని తెలుసు. ఈ మొత్తాన్ని క్రమంగా ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలి? సూచించగలరు. – సుచిత్ పూతియా
మీ పెట్టుబడుల నిధిని ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవడానికి ముందు మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఎంత కాలానికి పెట్టుబడులు పెడుతున్నారనేది స్పష్టత ఉండాలి. సాధారణంగా ఏకమొత్తంలో డబ్బు ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులు పెడదామనుకుంటే.. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేసుకోవాలి.
ఉదాహరణకు మీ వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టింది. అప్పుడు ఈ మొత్తాన్ని 12 నుంచి 24 భాగాలు చేసుకోవాలి. అన్ని వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యవయం, రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కనుక మీరు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఇవ్వగలవు.
ఇక మీ పెట్టుబడిని ఎన్‌పీఎస్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఎన్‌పీఎస్‌లో ఉపసంహరణల పరంగా ఆంక్షలు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత ఎన్‌పీఎస్ మొత్తం నిధి నుంచి మీరు 60 శాతాన్నే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే అంటే, వైద్య వ్యయాలు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు ఉంటుంది.
మీరు క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్‌గా ఎన్‌పీఎస్ నిధిని రిటైర్మెంట్ వరకు ముట్టుకోకుండా ఉంటే, అలాంటప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడులు మొత్తం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మిడ్, స్మాల్‌క్యాప్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వైవిధ్యం పాటిస్తుంటాయి. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది.
అయితే మీరు ఇంత వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని వారు అయితే, పెట్టుబడులు మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఆందోళన ఉంటే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, 35 శాతాన్ని డెట్‌లో పెడుతుంటాయి. దీనివల్ల ఈక్విటీ అస్థిరతలు తగ్గి, మరింత స్థిరమైన రాబడులకు వీలు కలుగుతుంది.
నాకు ఒక అన్‌లిస్టెడ్ కంపెనీలో 20 ఏళ్ల నుంచి పెట్టుబడులు ఉన్నాయి. సదరు అన్‌లిస్టెడ్ కంపెనీ, ఒక లిస్టెడ్ కంపెనీలో విలీనం అయింది. దీంతో నేను ఈ షేర్లను విక్రయించేశాను. మూలధన లాభాల పన్నును నేను ఎలా లెక్కించాలో చెప్పగలరు? – విష్ణుప్రియ
మూలధన లాభాల పన్నును నిర్ణయించే ముందు అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి దీర్ఘకాలమా? లేక స్వల్పకాలమా? అన్నది తేల్చాలి. ఏదైనా అన్‌లిస్టెడ్ షేరులో పెట్టుబడి 24 నెలలకు మించి కొనసాగించి ఉంటే, అది దీర్ఘకాలిక మూలధన ఆస్తి అవుతుంది. 24 నెలలకు మించి కొనసాగించినప్పుడు వచ్చే మూలధన లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. దీని నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం ప్రభావం మినహాయింపు) ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం వరకు పన్ను ఉండదని తెలిసిందే. అంతకుమించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. కానీ, కొనుగోలు, విక్రయం సమయంలోనూ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చెల్లించనట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. కానీ, మీ కేసులో మీరు కొనుగోలు సమయంలో కాకుండా, కేవలం విక్రయించేటప్పుడే సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను చెల్లించారు. కనుక దీర్ఘకాల మూలధన లాభం నుంచి ద్రవ్యోల్బణం మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment