Expert Analysis
-
స్మార్ట్ సిప్ అంటే ఏంటి?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను తాకుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని సూచిస్తారా..? డి. వెంకట రమణ స్మార్ట్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (స్మార్ట్ సిప్) అనేది రెగ్యులర్ సిప్‌తో పోలిస్తే వినూత్నమైనది. ప్రతి నెలా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే మొత్తం అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్ గా మారిపోతుంది. కొన్ని పారామీటర్ల ఆధారంగా మార్కెట్ల విలువలు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌక గా ఉన్నాయా అన్నది ఆల్గోరిథమ్ నిర్ణయిస్తుంది. మార్కెట్లు పూర్తి విలువ మేర ట్రేడ్ అవుతున్నాయని ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) భావిస్తే, అప్పుడు సిప్‌లో కొంత భాగమే ఈక్విటీ పెట్టుబడిగా వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌కు తరలిస్తుంది. ఒకవేళ స్టాక్ విలువలు చౌకగా ఉన్నాయని భావిస్తే అప్పుడు పెట్టుబడిలో అధిక భాగం స్టాక్స్‌కే కేటాయిస్తుంది. లిక్విడ్ ఫండ్‌కు పరిమితంగానే వెళుతుంది. స్మార్ట్ సిప్ ఇదే మాదిరిగా పనిచేస్తుంది. ఈ విధానం ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తమే పెట్టుబడిగా వెళుతుంది. అదే ఈక్విటీ వ్యాల్యూషన్ చౌకగా మారినప్పుడు సిప్‌లో అధిక భాగం ఈక్విటీలకు వెళుతుంటుంది. మార్కెట్లో అనుకూల సమయాన్ని ఎవరూ అంచనా వేయ లేరు. ఓ పద్ధతి ప్రకారం, క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే కీలకం. ఇందుకు స్మార్ట్‌సిప్ వీలు కల్పిస్తుంది. నిజానికి సాధారణ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉద్దేశం కూడా పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కను తగ్గించడమే. మార్కెట్లు ఎప్పుడు దిద్దుబాటుకు గురవుతాయి? ఎప్పటి వరకు ర్యాలీ చేస్తాయి? అని ఎవరూ చెప్పలేదు. అటు ర్యాలీల్లోనూ, ఇటు పతనాల్లోనూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సిప్ ద్వారా సాధ్యపడుతుంది. మార్కెట్లు ఖరీదుగా మారా యా? చౌకగా ఉన్నాయా? అని చూడక్కర్లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. స్టాక్స్ ధరలు దిద్దుబాటుకు గురైనప్పుడు సిప్ పెట్టుబడితో ఎక్కువ ఫండ్ యూనిట్లు సమకూరుతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కావాల్సినది క్రమశిక్షణ. అందుకు సిప్ వీలు కల్పిస్తుంది. కనుక మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నాయని చెప్పి స్మార్ట్సిప్ను పరిశీలించక్కర్లేదు. మీరు రెగ్యులర్ సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నా పెట్టుబడుల్లో సింహ భాగం ఈక్విటీల్లోనే ఉన్నా యి. రిటైర్మెంట్కు మూడేళ్లు మిగిలి ఉంది. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడులను డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవచ్చా? నా లాభం రూ.లక్షకు మించే ఉంటుంది. కనుక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా డెట్‌లోకి మళ్లించిన త ర్వాత ప్రతి నెలా ఇంత చొప్పున సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ద్వారా తీసుకుందామని అనుకుంటున్నాను. డెట్ ఫండ్ నుంచి ప్రతి నెలా బ్యాంక్ ఖాతాకు జమ అయ్యే మొత్తంపైనా పన్ను పడుతుందా? త్యాగన్ నరేంద్రన్ అవును. రెండు సందర్భాల్లోనూ మూలధన లాభంపై పన్ను పడుతుంది. అయినప్పటికీ రెండింతల పన్ను చెల్లించినట్టు కాదు. పెట్టుబడిపై వచ్చే రాబడిపైనే పన్ను అమలవుతుంది. దీర్ఘకాల లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో మూడేళ్ల ముందుగానే ఈక్విటీ పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి మళ్లించుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు పెట్టుబడులు తక్కువ అస్థిరతలతో కూడిన సాధనాల్లో ఉండడం ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అక్కరకు వస్తుంది. ఈక్విటీ ఫండ్స్ నుంచి మీ పెట్టుబడులను ఎస్‌డబ్ల్యూపీ ద్వారా డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవడం వల్ల మార్కెట్ కనిష్టంలో ఉన్నప్పుడు వైదొలిగే రిస్క్‌ను తప్పిస్తుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫుల్‌టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. 3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు. 4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. 5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్‌గా మారవచ్చు. 6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్‌క్యాస్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్‌కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. 7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది. 8. పెట్టుబడులు: స్టాక్‌లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం. 9. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం. రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Follow the Sakshi TV channel on WhatsApp -
పెట్టుబడులు పీపీఎఫ్ నుంచి ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలంటే?
నా వయసు 40 ఏళ్లు. పీపీఎఫ్‌లో నేను 15 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. వచ్చే ఏడాదితో గడువు ముగుస్తుంది. దీంతో గడువు ముగిసిన తర్వాత చేతికి అందే మొత్తాన్ని మెరుగైన వృద్ధి అవకాశాలున్న ఎన్పీఎస్, తదితర పథకాల్లో వచ్చే 15–20 ఏళ్ల కాలానికి పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి వచ్చే మొత్తం పన్ను రహితమని తెలుసు. ఈ మొత్తాన్ని క్రమంగా ఈక్విటీ పథకాల్లోకి ఎలా మళ్లించుకోవాలి? సూచించగలరు. – సుచిత్ పూతియా మీ పెట్టుబడుల నిధిని ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవడానికి ముందు మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఎంత కాలానికి పెట్టుబడులు పెడుతున్నారనేది స్పష్టత ఉండాలి. సాధారణంగా ఏకమొత్తంలో డబ్బు ఉండి, ఈక్విటీల్లో పెట్టుబడులు పెడదామనుకుంటే.. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీ వద్ద రూ.30 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టింది. అప్పుడు ఈ మొత్తాన్ని 12 నుంచి 24 భాగాలు చేసుకోవాలి. అన్ని వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యవయం, రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కనుక మీరు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఇవ్వగలవు. ఇక మీ పెట్టుబడిని ఎన్పీఎస్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే, యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ఎన్‌పీఎస్‌లో ఉపసంహరణల పరంగా ఆంక్షలు ఉన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత ఎన్పీఎస్ మొత్తం నిధి నుంచి మీరు 60 శాతాన్నే ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే అంటే, వైద్య వ్యయాలు, పిల్లల ఉన్నత విద్య, వివాహాల కోసం పాక్షిక ఉపసంహరణకు వెసులుబాటు ఉంటుంది. మీరు క్రమశిక్షణ కలిగిన ఇన్వెస్టర్‌గా ఎన్పీఎస్ నిధిని రిటైర్మెంట్ వరకు ముట్టుకోకుండా ఉంటే, అలాంటప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ పెట్టుబడులు మొత్తం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మిడ్, స్మాల్‌క్యాప్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వైవిధ్యం పాటిస్తుంటాయి. దీనివల్ల మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇంత వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని వారు అయితే, పెట్టుబడులు మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే విషయమై ఆందోళన ఉంటే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, 35 శాతాన్ని డెట్‌లో పెడుతుంటాయి. దీనివల్ల ఈక్విటీ అస్థిరతలు తగ్గి, మరింత స్థిరమైన రాబడులకు వీలు కలుగుతుంది. నాకు ఒక అన్‌లిస్టెడ్ కంపెనీలో 20 ఏళ్ల నుంచి పెట్టుబడులు ఉన్నాయి. సదరు అన్‌లిస్టెడ్ కంపెనీ, ఒక లిస్టెడ్ కంపెనీలో విలీనం అయింది. దీంతో నేను ఈ షేర్లను విక్రయించేశాను. మూలధన లాభాల పన్నును నేను ఎలా లెక్కించాలో చెప్పగలరు? – విష్ణుప్రియ మూలధన లాభాల పన్నును నిర్ణయించే ముందు అన్‌లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి దీర్ఘకాలమా? లేక స్వల్పకాలమా? అన్నది తేల్చాలి. ఏదైనా అన్‌లిస్టెడ్ షేరులో పెట్టుబడి 24 నెలలకు మించి కొనసాగించి ఉంటే, అది దీర్ఘకాలిక మూలధన ఆస్తి అవుతుంది. 24 నెలలకు మించి కొనసాగించినప్పుడు వచ్చే మూలధన లాభంపై 20 శాతం పన్ను పడుతుంది. దీని నుంచి ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం ప్రభావం మినహాయింపు) ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన లాభం వరకు పన్ను ఉండదని తెలిసిందే. అంతకుమించిన దీర్ఘకాల మూలధన లాభంపై 10 శాతం పన్ను పడుతుంది. కానీ, కొనుగోలు, విక్రయం సమయంలోనూ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చెల్లించనట్టయితే ఈ ప్రయోజనానికి అనర్హులు. కానీ, మీ కేసులో మీరు కొనుగోలు సమయంలో కాకుండా, కేవలం విక్రయించేటప్పుడే సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను చెల్లించారు. కనుక దీర్ఘకాల మూలధన లాభం నుంచి ద్రవ్యోల్బణం మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ర్యాంకు లక్ష వచ్చినా తెలంగాణలో సీటు.. నీట్ నిపుణుల విశ్లేషణ ఇదే
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. వారంలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నీట్ ర్యాంకులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో చాలామంది జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారని, కానీ రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకులు తక్కువగానే ఉంటాయని నీట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: ‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’ వారి అంచనా ప్రకారం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అటువంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదని వివరించాయి. కొత్తగా 6 ప్రభుత్వ కాలేజీలు.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,600 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల మూడు ప్రైవేటు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిల్లోని 450 ఎంబీబీఎస్ సీట్లను తీసేస్తే 3,150 సీట్లు ఉంటాయి. అయితే ఎంఎన్ఆర్ కాలేజీకి దాదాపు అనుమతి వచ్చినట్లేనని కాళోజీ వర్గాలు అంటున్నాయి. కాబట్టి అవి 150 కలిపితే 3,300 సీట్లు అవుతాయి. మరోవైపు ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. దీంతో వాటిల్లో 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలల్లో 2,665 సీట్లు ఉండనున్నాయి. ఇక రామగుండం, మంచిర్యాల కాలేజీలకు కూడా అనుమతులు వస్తే వాటి ద్వారా మరో 300 సీట్లు పెరుగుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఆర్బీఐ పాలసీ, ఆర్థిక గణాంకాలు కీలకం
ముంబై: ద్రవ్య విధానంపై ఆర్బీఐ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ఉక్రెయిన్– రష్యా యుద్ధ పరిణమాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపే ప్రధాన అంశాలుగా ఉన్నాయిని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ వైరస్‌పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చని భావిస్తున్నారు. ‘‘ప్రస్తుతానికి ట్రెండ్ బుల్స్‌కు అనుకూలంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఎలాంటి ప్రతికూల వార్తలు అందకపోతే మార్కెట్ మరింత కన్సాలిడేషన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. వచ్చే వారంలో కార్పొరేట్ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ప్రారంభం నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొనుగోళ్లు కొనసాగితే ఈ వారంలో నిఫ్టీకి 17,725–17,800 కీలక స్థాయిలుగా ఉండనున్నాయి. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌లోకి ప్రవేశిస్తే 17,550–17,400 మద్దతు స్థాయిలుగా ఉంటాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ..., గడచిన వారంలో సూచీలు మూడుశాతం ర్యాలీ చేశాయి. ఆటో, బ్యాంక్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 1,914 పాయింట్లు, నిఫ్టీ 517 పాయింట్లు లాభపడ్డాయి. గరిష్ట స్థాయిల నుంచి క్రూడాయిల్ ధరలు దిగిరావడం, దేశీయ మార్కెట్లో ఎఫ్ఐఐల అమ్మకాల తీవ్రత తగ్గడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడం, రష్యా ఉక్రెయిన్ చర్చల్లో పురోగతి తదితర పరిణామాలు సూచీల లాభాలకు కారణమయ్యాయి. మార్కెట్‌ను ప్రభావితం అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే.... ► ఆర్బీఐ పాలసీ సమావేశం ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమావేశం బుధవారం(ఏప్రిల్ 6న) ప్రారంభమవుతుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటపట్టేందుకు వడ్డీరేట్లను పెంచమనే వ్యాఖ్యలకు కట్టుబడి రెపో రేటును యథాతథంగా ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన ద్రవ్యోల్బణ ఆందోళనలు, క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ప్రణాళికల నేపథ్యంలో ఆర్బీఐ తీసుకొనే ద్రవ్య పాలసీ నిర్ణయాల కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాగే దేశ ఆర్థిక వృద్ధి స్థితిగతులపై ఆర్బీఐ అంచనాలు మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. ► స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం నేడు తయారీ రంగ డేటా, ఎల్లుండి(ఏప్రిల్ 6న) సేవా రంగ ఉత్పత్తి గణాంకాలు విడుదల విడుదల కానున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన తయారీ, సేవా రంగ పనితీరును ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ వారాంతాన శుక్రవారం ఆర్బీఐ మార్చి 25 వ తేదీతో ముగిసిన డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలతో పాటు ఏప్రిల్ ఒకటవ వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను వెల్లడించనుంది. ఈ స్థూల ఆర్థిక గణాంకాల ప్రభా వం సూచీలపై పడొచ్చని నిపుణులు అంటున్నారు. ► క్రూడాయిల్ కదలికలపై కన్ను ఇటీవల గరిష్టాలకు(120.65 డాలర్లు) చేరిన క్రూడాయిల్ ధరలు దిగివస్తున్నాయి. అయితే ఇప్పటికీ బ్యారెల్ చమురు ధర 100 డాలర్లపైన ట్రేడ్ అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. క్రూడ్ ధర పుంజుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు కార్పొరేట్ కంపెనీ మార్జిన్లపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆరో నెలలోనూ అమ్మకాలే దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా ఆరో నెలలోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు ఈ మార్చిలో రూ.41,000 కోట్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పాటు ఈ ఏడాది చివరిలోపు ఉద్దీపనలను ఉపసంహరించుకుంటామనే సంకేతాలతో ఎఫ్ఐఐలు వర్ధమాన దేశాల్లో విక్రయాలకు పాల్పడుతున్నారు. క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణ ఆందోళనలతో స్వల్పకాలం పాటు ఎఫ్ఐఐలు కొనుగోళ్లు పరిమితంగా ఉండొచ్చు’’ అని మార్నింగ్‌స్టార్ ఇండియా డెరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఒడిదుడుకుల వారం!
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు - విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు ప్రభావం చూపుతాయ్ - ఈ వారం మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగుతుందని విశ్లేషకులంటున్నారు. బక్రీద్ సందర్భంగా శుక్రవారం సెలవు అయినందున ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కావడం, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు దీనికి కారణాలని వారంటున్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్ ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ వారంలో ఎలాంటి ప్రధాన గణాంకాలు వెల్లడి కావని, ఈ గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్లు తమ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్లను రోల్ ఓవర్ చేయడం, అన్వైండ్ చేయడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. వర్షపాత వివరాలపై అప్డేట్స్, రూపాయి గమనం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతాయని, ట్రేడర్లు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ తదితర అంశాలపై స్టాక్ మార్కెట్ సూచీల గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. వచ్చే వారం(29న) వెలువడే ఆర్బీఐ పాలసీపై అంచనాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ను నిర్దేశించవచ్చని అన్నారు. గతవారం మార్కెట్... గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 26,219 పాయింట్లకు చేరింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ నిర్ణయం ముగియడంతో ఇక ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సమస్యలపై దృష్టి సారిస్తారని నిపుణులంటున్నారు. ఈ నెలలో రూ.4,610 కోట్ల నిధులు వెనక్కి.. వివిధ దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4,610 కోట్ల పెట్టుబడులను నికరంగా ఉపసంహరించుకున్నారు. -
ఎవరి ఆశలు వారివి...
దేశ ఆర్థిక బడ్జెట్ అంటే అందరికీ ఆసక్తే. ఏయే రంగాలకు ఎంతమేరకు కేటాయింపులు ఉంటాయి? ఎవరికి ఎంత లాభం? భారమెంత? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణలు సహజం. అయితే ఈ విషయంలో సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తవరకూ ఎవరి కోర్కెలు వారివి. వారు ఆర్థికమంత్రిని ఏమి కోరుకుంటున్నారో ఒక్కసారి తెలుసుకుందామా...? నేనూ కోరుకుంటున్నాను... మీకే కాదు. నాకూ కొన్ని ఆశలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ద్రవ్యలోటును ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగనీయకూడదు. కాబట్టి సబ్సిడీల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందే. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తగ్గుదల వల్ల లభిస్తున్న ప్రయోజనం- ప్రభుత్వ ఆర్థిక పటిష్టతకు దోహదపడేలా ముందు చూసుకోవాలి. దేశానికి ఇది ఎంతో ముఖ్యాంశం. ఇక దేశంలోకి క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్(ఎఫ్‌డీఐ, ఎఫ్ఐఐ, ఈసీబీ) భారీగా పెరగాలనీ కోరుకుంటున్నా. పన్నుల సంస్కరణలు, వ్యవస్థ పటిష్టత సంకేతాల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ఆకర్షించాలన్నది నా ప్రయత్నం. ఇందులో విజయవంతం కావాలి. దీర్ఘకాలంలో ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుంది. మీ దగ్గర ఎక్కువ డబ్బుండి... మీ వినియోగ సామర్థ్యం పెరగాలనీ కోరుకుంటున్నా. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచి... సామాన్యుడి కొనుగోలు, పొదుపు శక్తి పెరగడానికి తగిన చర్యలపై ఆలోచించాం. తద్వారా బ్యాంకింగ్ వడ్డీరేటు మరింత తగ్గుదలకు ఆర్బీఐ సంకేతాల కోసమూ ఎదురుచూస్తున్నాం. ఇంకా నేనేం కోరుకుంటున్నానో తెలుసుకోవడానికి మరో 48 గంటలు వేచిచూడండి..! - అరుణ్ జైట్లీ, ఆర్థికమంత్రి మహిళా వ్యాపారవేత్త మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిం చడానికి, స్టార్టప్ కంపెనీలకు సలహాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిం చేందుకు ప్రత్యేకంగా ఇన్క్యుబేటర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు సుశిక్షణ, పరి శ్రమల ఏర్పాటు, సాంకేతిక సహకారం నుం చి బ్యాంకుల రుణ సౌలభ్యం వరకూ తగిన సాయం అందేలా పథకాలను ప్రకటించాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటూ ప్రయోజనమే. విద్యార్థులు... విద్యాభివృద్ధికి తగిన ప్రోత్సాహకాలు ఉం డాలి. ఇందుకు ప్రత్యేక పథకాలను ఆవిష్కరించాలి. అధికమొత్తంలో కేటాయింపులు జరపాలి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల విషయంలో డ్రాప్‌అవుట్స్ లేకుండా ప్రత్యేక చర్యలు ఉం డాలి. విద్యా రుణాలపై వడ్డీ మాఫీ పరిమితి పెంచాలి. సామాన్యుడు నిత్యావసర ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధరల విషయం చెప్పనక్కర్లేదు. ధరలు తగ్గడానికి తగిన చర్యలు బడ్జెట్లో వుండాలి. ముఖ్యంగా రైతు-వినియోగదారుని మధ్య దూరం తగ్గే చర్యలను కేంద్రం తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. సాధారణ ఉద్యోగి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుత రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. దీనివల్ల సాధారణ ఉద్యోగిగా నాలుగు డబ్బులూ నా చేతులో ఉంటా యి. దీనికితోడు సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచితే... నా పొదుపులు మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పారిశ్రామికవేత్త... వడ్డీరేట్లు మరింత తగ్గాలి. ఆర్బీఐ రేట్లు తగ్గించేందుకు వీలయ్యే చర్యల్ని బడ్జెట్లో చేపట్టాలి. వడ్డీరేట్లు తగ్గించడం- పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు, దేశాభివృద్ధికి దోహదపడుతుంది. దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధికి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు సొంత గూడు ఉండేలా చర్యలపైనా దృష్టి అవసరం. ప్రాజెక్టుల అమలులో జాప్యం జరక్కుండా చర్యలు తీసుకోవాలి. మౌలిక రంగానికి నిధుల కేటాయింపును భారీగా పెంచాలి. సీనియర్ సిటిజన్ వడ్డీరేట్లు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ డిపాజిట్ రేట్లూ తగ్గుతాయన్నదే దీని సంకేతం. కేవలం బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఆధారపడి జీవిస్తున్న నా బోటి వృద్ధులకు ఇది కష్టకాలమే. ఈ స్థితిలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడగలిగే పథకాలను బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. ఆదాయపు పన్నుల్లో రిబేట్లు ఇవ్వాలి. వడ్డీల విషయంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న అర శాతం అధిక ప్రీమియంను మరో అర శాతానికి పెంచితే మంచిది. వైద్య ఖర్చులు తగ్గే చర్య లూ తీసుకోండి. -
ఇంటర్లో గ్రూప్ ఎంపిక ఇలా..
ఇంటర్మీడియెట్.. ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ.ఈ దశలో ఎంచుకున్న గ్రూపు ఆధారంగానే భవిష్యత్తు కెరీర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. క్రేజీ కెరీర్స్‌గా పేరొందిన ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ప్రవేశించాలన్నా.. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా మారి ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా.. పునాది ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకున్న గ్రూప్‌లే! అందుకే ఈ గ్రూప్‌ల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. పదో తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌లో విద్యార్థులు ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి.. ఏ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఏ గ్రూప్ సరిపోతుంది?! ఏ గ్రూప్ ఎంచుకుంటే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి.. తదితర అంశాలపై నిపుణుల విశ్లేషణ.. వాట్ ఆఫ్టర్ టెన్త్?! ఇంటర్మీడియెట్.. ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్..! ఇంకేముంది.. అయితే ఎంపీసీ.. లేకపోతే బైపీసీ.. నేటి విద్యార్థి లోకంలో, వారి తల్లిదండ్రుల్లో స్థిరపడిపోయిన అభిప్రాయం. ఈ రెండు గ్రూపుల్లో చేరితే భవిష్యత్తులో సత్వర ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఇంజనీరింగ్ లేదా మెడికల్ ప్రొఫెషన్లో స్థిరపడొచ్చని నిశ్చితాభిప్రాయం! అయితే.. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. కేవలం కోర్సులకున్న క్రేజ్‌నే దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌ల ఎంపిక సరికాదని సూచిస్తున్నారు. విద్యార్థుల సహజ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా గ్రూప్‌ను ఎంచుకుంటే.. ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అన్ని గ్రూపులకు ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్‌లో ఉన్న గ్రూప్‌లు.. వాటిలో రాణించేందుకు కావాల్సిన అకడెమిక్, పర్సనల్ స్కిల్స్.. ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ప్రధానాంశాలుగా ఉండే ఎంపీసీ గ్రూప్‌లో చేరే విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల్లో దాదాపు 35 నుంచి 40 శాతం మధ్యలో ఉంటోంది. ఈ గ్రూప్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఎంసెట్‌లో అర్హత సాధించి.. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ గ్రూప్‌లో చేరే విద్యార్థులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఎన్నో కాన్సెప్ట్‌లు, థియరీస్, ఫార్ములాలతో ఉండే ఈ గ్రూప్‌లో అకడెమిక్‌గా రాణించాలంటే.. గంటలకొద్దీ ప్రాక్టీస్ చేయగల నేర్పు, ఓర్పు ఎంతో అవసరం. అదేవిధంగా హార్డ్‌వర్క్‌తోపాటు స్మార్ట్‌వర్క్ తోడైతేనే ఇందులో రాణించడం సులువవుతుంది. వీటితోపాటు సూక్ష్మగ్రాహ్యక శక్తి, మెమొరీ స్కిల్స్ అత్యంత ప్రధానం. ప్రాక్టికల్ అప్రోచ్ బాగా ఉన్న విద్యార్థులే ఈ గ్రూప్‌లో రాణించగలరు. అప్పుడే ఎంపీసీ గ్రూప్‌తో ఆశించిన ఫలితాలు సాధ్యం. కోర్సు పూర్తయ్యాక ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌తోపాటు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ వంటి పోటీ పరీక్షలకు కూడా అర్హత లభిస్తుంది. కేవలం ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా.. డిగ్రీ స్థాయిలో బీఎస్సీలోనూ పలు వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఉన్నత విద్యనభ్యసించి మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు. బైపీసీ.. ఆసక్తితోనే అడుగులు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ తర్వాత విద్యార్థులు ఎక్కువగా చేరుతున్న కోర్సు బైపీసీ. భవిష్యత్తులో మెడికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌లో కెరీర్‌కు ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. అయితే, ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సహజమైన ఆసక్తి ఉంటేనే అడుగుపెట్టడం మంచిది. ముఖ్యంగా పరిసరాల అధ్యయనం, ఆయా జీవరాసులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత బైపీసీ గ్రూప్ విద్యార్థులకు చాలా అవసరం. అకడెమిక్‌గా.. ఎంపీసీతో పోల్చితే ప్రాక్టికల్ అప్రోచ్ కోణంలోనూ సునిశిత పరిశీలన కీలక పాత్ర పోషిస్తుంది. నిరంతర అధ్యయనం, నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే నేర్పు కూడా కావాలి. బైపీసీలో జీవసంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచుకుంటేనే అకడెమిక్‌గా ముందుండటం వీలవుతుంది. ఈ పరిజ్ఞానానికి ముఖ్య సాధనాలు ప్రాక్టికల్స్ మాత్రమే. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను లేబొరేటరీల్లో ప్రాక్టికల్‌గా అన్వయించడం నిరంతర ప్రక్రియ. కేవలం థియరాటికల్ అప్రోచ్‌తో ముందుకెళ్లొచ్చు అనే అభిప్రాయం ఏ మాత్రం సరికాదు. ఈ దృక్పథం మార్కులు తెచ్చిపెట్టేందుకు దోహదపడినప్పటికీ.. భవిష్యత్తులో కెరీర్‌పరంగా అవసరమైన నైపుణ్యాలు అందించలేదు. బైపీసీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ పూర్తిచేస్తే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సులే కాకుండా.. మరెన్నో కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ వంటి కొత్త కాంబినేషన్లు ఉన్నాయి. వీటిద్వారా భవిష్యత్తులో మెడికల్ అనుబంధ రంగాలైన హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో అడుగుపెట్టొచ్చు. సీఈసీ- విశ్లేషణ నైపుణ్యాలు సీఈసీ.. కెరీర్ పరంగా కామర్స్, మేనేజ్మెంట్ రంగాల్లో భవిష్యత్తుకు పునాది. ఇటీవల కాలంలో క్రమేణా విద్యార్థి లోకంలో క్రేజ్ పెరుగుతున్న కోర్సు. అంకెలు, గణాంకాలు, దత్తాంశాలు నిండి ఉండే ఈ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఆయా అంశాల విశ్లేషణ, విశదీకరణ నైపుణ్యాలు ఉండాలి. నిర్దిష్ట గణాంకాల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలు రూపొందించే నైపుణ్యం.. కంప్యూటేషన్ స్కిల్స్ ఈ కోర్సు ఔత్సాహికులకు చాలా అవసరం. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అకౌంట్స్, కామర్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించి అప్లికేషన్ ఓరియెంటేషన్ అప్రోచ్ కూడా ఉండాలి. సైన్స్ గ్రూప్‌లతో పోల్చితే ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్ ఉండవు. అయితే నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేందుకు విద్యార్థులు స్వయంగా ప్రయత్నించాలి. అప్పుడే ఈ కోర్సుల్లో రాణించగలరు. సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు అటు మేనేజ్మెంట్, ఇటు కామర్స్ సంబంధిత రంగాల్లో కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతోనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), ఐసీడబ్ల్యుఏ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫౌండేషన్ దశలో అడుగుపెట్టొచ్చు. సీఈసీ అర్హతగా బీకాం పూర్తిచేయొచ్చు. తర్వాత ఐసెట్, క్యాట్, ఎక్స్‌ఏటీ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రముఖ సంస్థలలో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. హెచ్ఈసీ.. సామాజిక అవగాహన సామాజిక - ఆర్థిక అంశాలపై అవగాహన, పరిశీలన నైపుణ్యాలున్న విద్యార్థులకు కచ్చితంగా సరిపడే కోర్సు హెచ్ఈసీ. అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మరింత కలిసొచ్చే కోర్సు ఇది. సమాజంలో నిత్యం ప్రతిబింబించే అంశాలైన ఆర్థిక, రాజకీయ అంశాలు, చరిత్ర సంబంధిత విషయాలతో కూడి ఉండే ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు అకడెమిక్‌గా సునిశిత పరిశీలన శక్తి అవసరమవుతుంది. విస్తృత స్థాయిలో ఉండే అంశాల నుంచి అవసరమైన మేర మాత్రమే గ్రహించగల నైపుణ్యాలు, నిర్దిష్ట అంశం నేపథ్యంపై అవగాహన, అదే అంశానికి సంబంధించి సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు ఎంతో అవసరం. కెరీర్ పరంగా ప్రభుత్వ విభాగంలో ఆయా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు హెచ్ఈసీలో పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. హెచ్ఈసీ పూర్తి చేసి బీఏలో అడుగుపెడితే.. ఆ కోర్సు అర్హతగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సులువుగా సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా బీఏ స్థాయిలో ఇప్పుడు కొత్తగా ఆవిష్కృతమవుతున్న కాంబినేషన్ల ఆధారంగా ప్రైవేటు రంగంలోనూ సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ తదితర గ్రూప్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో కొలువులు ఖాయమవుతున్నాయి. ఎంపీసీ, సీఈసీ సమ్మేళనంగా ఎంఈసీ ఇటీవల కాలంలో ఆదరణ పొందుతున్న గ్రూప్.. ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండే ఈ గ్రూప్.. భవిష్యత్తులో కామర్స్ విభాగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు బాగా కలిసొస్తున్న కోర్సు. ఒకే సమయంలో మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు అందించే ఈ కోర్సు సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు చక్కటి పునాది. అయితే ఈ గ్రూప్ ఔత్సాహికులకు అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్ ప్రధానంగా అవసరమైన సహజ లక్షణాలు. సమయ నిబంధనలు లేకుండా కష్టించే తత్వం, నిరంతర అధ్యయనం చేయగల నేర్పు కూడా అవసరం. ఇవి ఉంటేనే ఈ కోర్సులో రాణించగలరు. భవిష్యత్తు పరంగా ఎంఈసీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులతోపాటు డిగ్రీ స్థాయిలో బీకాంలో ప్రవేశించొచ్చు. సీఈసీ విద్యార్థులకు లభించే అవకాశాలన్నీ వీరికి లభిస్తాయి. గ్రూప్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులు. సదరు గ్రూప్‌లో ఉండే సబ్జెక్ట్‌లు, వాటిలోని ప్రాథమిక అంశాలపై అవగాహన స్థాయి. దీర్ఘకాలిక లక్ష్యాలు.. ఎంపిక చేసుకోనున్న గ్రూప్ ద్వారా లభించే అవకాశాల విశ్లేషణ. సదరు గ్రూప్‌నకు సంబంధించిన రంగంలో ప్రస్తుత ఉపాధి అవకాశాలు. వాస్తవానికి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్థాయిలో విశ్లేషణలు చేసుకునే మానసిక పరిపక్వత ఉండదు. దాంతో తల్లిదండ్రులే పిల్లల ఆసక్తుల ఆధారంగా వీటిని చేపట్టాలని నిపుణుల సలహా. ఈ ఆసక్తిని పిల్లల వ్యవహార శైలి ద్వారా గమనించొచ్చని సూచిస్తున్నారు. నిపుణుల సలహా సైన్స్ కోర్సుల్లో చేరే వారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం ఇంటర్మీడియెట్‌లో సైన్స్, మ్యాథమెటిక్స్ గ్రూప్స్‌లో చేరే విద్యార్థులకు మిగతా గ్రూప్‌లతో పోల్చితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అవి.. ప్రాక్టికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్. లేబొరేటరీల్లో గడిపేందుకు ఆసక్తి, ఓర్పు వంటి సహజ లక్షణాలు అవసరం. ఇవి ఉంటేనే ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో రాణించి.. భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. ఎంపీసీ, బైపీసీ అంటే.. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు మాత్రమే పునాది అని భావించొద్దు. ఇప్పుడు అప్లైడ్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, అగ్రికల్చర్, వెటర్నరీ సెన్సైస్‌లోనూ ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ రంగాల్లో పరిశోధనలు చేసి ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్॥సి.వి.ఎల్.ఎన్. మూర్తి, ప్రిన్సిపాల్, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, నాగార్జునసాగర్. కొలువులు ఖాయం చేసే కామర్స్ ఇంటర్మీడియెట్‌లో సీఈసీ గ్రూప్ ఎంపిక ద్వారా భవిష్యత్తులో కామర్స్ విభాగంలో ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ కోర్సుల పట్ల పెరుగుతున్న క్రేజ్, పబ్లిసిటీ ఆధారంగా చాలామంది విద్యార్థులు వీటిలో అడుగుపెట్టేందుకు సీఈసీని ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సులభమే. కానీ ఈ కోర్సు అర్హతగా ప్రవేశం పొందే ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించాలంటే గంటలకొద్దీ శ్రమించగల ఓర్పు, నిరంతరం మార్పుచేర్పులు జరుగుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలపై అవగాహన అవసరం. ఈ స్కిల్స్ లేక అనేకమంది విద్యార్థులు ఆయా ప్రొఫెషనల్ కోర్సుల మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. అందువల్ల కేవలం క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా.. ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తు లక్ష్యాలకు సరితూగే కోర్సులను ఎంచుకోవాలి. - టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్, హైదరాబాద్ ప్రధానంగా ప్రాక్టికల్ అప్రోచ్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే కాకుండా.. ఆర్ట్స్, హ్యుమానిటీస్ వరకు అన్ని విభాగాల్లో ప్రాక్టికల్ అప్రోచ్, అప్లికేషన్ ఓరియెంటేషన్లు కీలకంగా మారుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఏ గ్రూప్‌లో చేరాలనుకున్నప్పటికీ సంబంధిత సబ్జెక్టుల్లో నేర్చుకున్న అంశాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. చదివే ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసే తులనాత్మక అవగాహన కూడా ఎంతో అవసరం. ఈ నైపుణ్యాలు ఏ అంశంలో ఎక్కువగా ఉన్నాయో స్వీయ విశ్లేషణ చేసుకుని ఆ గ్రూప్‌ను ఎంచుకోవడం భవిష్యత్తులో లాభిస్తుంది. సైన్స్ గ్రూప్‌ల విషయానికొస్తే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు తమ పిల్లలు ఆసక్తి చూపిన అంశాలేంటో గమనించి దానికి అనుగుణంగా ప్రోత్సహించాలి. - కె. శరత్ చంద్ర, కో-ఫౌండర్, బటర్‌ఫ్లై ఫీల్డ్స్ ఇన్‌స్టంట్‌గా కాదు.. ఇంట్రెస్ట్ ఆధారంగా ఇంటర్మీడియెట్ గ్రూప్ ఎంపికలో.. ఆయా కోర్సుల ద్వారా లభించే ఉద్యోగావకాశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. సహజ ఆసక్తికి కూడా పెద్దపీట వేయాలి. అప్పుడే కెరీర్ గమ్యం దిశగా సరైన అడుగులు పడతాయి. కెరీర్ అంటే.. కేవలం ఇంజనీరింగ్, మెడికల్ అనే అపోహను వీడాలి. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా కెరీర్‌పరంగా బహుముఖ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటికీ పునాది ఇంటర్మీడియెట్‌లో ఎంచుకున్న గ్రూప్ మాత్రమే. కాబట్టి సుదీర్ఘ ప్రణాళిక, వ్యూహాలతో గ్రూప్‌ను ఎంచుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి. తమ పిల్లల సహజ ఆసక్తులు ఏంటో గుర్తించి.. అందుకు తగ్గ కోర్సులను ఎంచుకునే దిశగా ప్రోత్సహించాలి. అప్పుడు ఎలాంటి గ్రూప్ అయినా.. కోర్సు అయినా భవిష్యత్తులో చక్కటి అవకాశాలు లభిస్తాయి. - ఎం. రామకృష్ణ, ఎండీ, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్