ఇంటర్మీడియెట్.. ప్రతి విద్యార్థి జీవితంలో కీలక దశ.ఈ దశలో ఎంచుకున్న గ్రూపు ఆధారంగానే భవిష్యత్తు కెరీర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. క్రేజీ కెరీర్స్‌గా పేరొందిన ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో ప్రవేశించాలన్నా.. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా మారి ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా.. పునాది ఇంటర్మీడియెట్‌లో ఎంపిక చేసుకున్న గ్రూప్‌లే! అందుకే ఈ గ్రూప్‌ల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. పదో తరగతి ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌లో విద్యార్థులు ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి.. ఏ నైపుణ్యాలున్న విద్యార్థులకు ఏ గ్రూప్ సరిపోతుంది?! ఏ గ్రూప్ ఎంచుకుంటే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా ఎలాంటి అవకాశాలుంటాయి.. తదితర అంశాలపై నిపుణుల విశ్లేషణ..
వాట్ ఆఫ్టర్ టెన్త్?!
ఇంటర్మీడియెట్..
ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూప్..!
ఇంకేముంది..
అయితే ఎంపీసీ..
లేకపోతే బైపీసీ..
నేటి విద్యార్థి లోకంలో, వారి తల్లిదండ్రుల్లో స్థిరపడిపోయిన అభిప్రాయం. ఈ రెండు గ్రూపుల్లో చేరితే భవిష్యత్తులో సత్వర ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఇంజనీరింగ్ లేదా మెడికల్ ప్రొఫెషన్‌లో స్థిరపడొచ్చని నిశ్చితాభిప్రాయం! అయితే.. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్ ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. కేవలం కోర్సులకున్న క్రేజ్‌నే దృష్టిలో పెట్టుకుని గ్రూప్‌ల ఎంపిక సరికాదని సూచిస్తున్నారు. విద్యార్థుల సహజ ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా గ్రూప్‌ను ఎంచుకుంటే.. ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అన్ని గ్రూపులకు ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలున్నాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్‌లో ఉన్న గ్రూప్‌లు.. వాటిలో రాణించేందుకు కావాల్సిన అకడెమిక్, పర్సనల్ స్కిల్స్..
ఎంపీసీ
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లు ప్రధానాంశాలుగా ఉండే ఎంపీసీ గ్రూప్‌లో చేరే విద్యార్థుల సంఖ్య మొత్తం విద్యార్థుల్లో దాదాపు 35 నుంచి 40 శాతం మధ్యలో ఉంటోంది. ఈ గ్రూప్‌లో ఉత్తీర్ణత ఆధారంగా ఎంసెట్‌లో అర్హత సాధించి.. భవిష్యత్తులో ఇంజనీరింగ్ కోర్సులో అడుగుపెట్టొచ్చు. ఈ గ్రూప్‌లో చేరే విద్యార్థులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఎన్నో కాన్సెప్ట్‌లు, థియరీస్, ఫార్ములాలతో ఉండే ఈ గ్రూప్‌లో అకడెమిక్‌గా రాణించాలంటే.. గంటలకొద్దీ ప్రాక్టీస్ చేయగల నేర్పు, ఓర్పు ఎంతో అవసరం. అదేవిధంగా హార్డ్‌వర్క్‌తోపాటు స్మార్ట్‌వర్క్ తోడైతేనే ఇందులో రాణించడం సులువవుతుంది. వీటితోపాటు సూక్ష్మగ్రాహ్యక శక్తి, మెమొరీ స్కిల్స్ అత్యంత ప్రధానం. ప్రాక్టికల్ అప్రోచ్ బాగా ఉన్న విద్యార్థులే ఈ గ్రూప్‌లో రాణించగలరు. అప్పుడే ఎంపీసీ గ్రూప్‌తో ఆశించిన ఫలితాలు సాధ్యం. కోర్సు పూర్తయ్యాక ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌తోపాటు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ వంటి పోటీ పరీక్షలకు కూడా అర్హత లభిస్తుంది. కేవలం ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా.. డిగ్రీ స్థాయిలో బీఎస్సీలోనూ పలు వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఉన్నత విద్యనభ్యసించి మంచి కెరీర్ సొంతం చేసుకోవచ్చు.
బైపీసీ.. ఆసక్తితోనే అడుగులు
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ తర్వాత విద్యార్థులు ఎక్కువగా చేరుతున్న కోర్సు బైపీసీ. భవిష్యత్తులో మెడికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్‌లో కెరీర్‌కు ఈ కోర్సు ఎంతో దోహదపడుతుంది. అయితే, ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు సహజమైన ఆసక్తి ఉంటేనే అడుగుపెట్టడం మంచిది. ముఖ్యంగా పరిసరాల అధ్యయనం, ఆయా జీవరాసులకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత బైపీసీ గ్రూప్ విద్యార్థులకు చాలా అవసరం. అకడెమిక్‌గా.. ఎంపీసీతో పోల్చితే ప్రాక్టికల్ అప్రోచ్ కోణంలోనూ సునిశిత పరిశీలన కీలక పాత్ర పోషిస్తుంది. నిరంతర అధ్యయనం, నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించే నేర్పు కూడా కావాలి. బైపీసీలో జీవసంబంధ అంశాలపై పరిజ్ఞానం పెంచుకుంటేనే అకడెమిక్‌గా ముందుండటం వీలవుతుంది. ఈ పరిజ్ఞానానికి ముఖ్య సాధనాలు ప్రాక్టికల్స్ మాత్రమే. తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను లేబొరేటరీల్లో ప్రాక్టికల్‌గా అన్వయించడం నిరంతర ప్రక్రియ. కేవలం థియరాటికల్ అప్రోచ్‌తో ముందుకెళ్లొచ్చు అనే అభిప్రాయం ఏ మాత్రం సరికాదు. ఈ దృక్పథం మార్కులు తెచ్చిపెట్టేందుకు దోహదపడినప్పటికీ.. భవిష్యత్తులో కెరీర్‌పరంగా అవసరమైన నైపుణ్యాలు అందించలేదు. బైపీసీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. బైపీసీ పూర్తిచేస్తే కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సులే కాకుండా.. మరెన్నో కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ వంటి కొత్త కాంబినేషన్లు ఉన్నాయి. వీటిద్వారా భవిష్యత్తులో మెడికల్ అనుబంధ రంగాలైన హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో అడుగుపెట్టొచ్చు.
సీఈసీ- విశ్లేషణ నైపుణ్యాలు
సీఈసీ.. కెరీర్ పరంగా కామర్స్, మేనేజ్‌మెంట్ రంగాల్లో భవిష్యత్తుకు పునాది. ఇటీవల కాలంలో క్రమేణా విద్యార్థి లోకంలో క్రేజ్ పెరుగుతున్న కోర్సు. అంకెలు, గణాంకాలు, దత్తాంశాలు నిండి ఉండే ఈ గ్రూప్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఆయా అంశాల విశ్లేషణ, విశదీకరణ నైపుణ్యాలు ఉండాలి. నిర్దిష్ట గణాంకాల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలు రూపొందించే నైపుణ్యం.. కంప్యూటేషన్ స్కిల్స్ ఈ కోర్సు ఔత్సాహికులకు చాలా అవసరం. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అకౌంట్స్, కామర్స్ వంటి సబ్జెక్టులకు సంబంధించి అప్లికేషన్ ఓరియెంటేషన్ అప్రోచ్ కూడా ఉండాలి. సైన్స్ గ్రూప్‌లతో పోల్చితే ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్ ఉండవు. అయితే నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందేందుకు విద్యార్థులు స్వయంగా ప్రయత్నించాలి. అప్పుడే ఈ కోర్సుల్లో రాణించగలరు. సీఈసీ పూర్తి చేసిన విద్యార్థులు అటు మేనేజ్‌మెంట్, ఇటు కామర్స్ సంబంధిత రంగాల్లో కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతోనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), ఐసీడబ్ల్యుఏ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఫౌండేషన్ దశలో అడుగుపెట్టొచ్చు. సీఈసీ అర్హతగా బీకాం పూర్తిచేయొచ్చు. తర్వాత ఐసెట్, క్యాట్, ఎక్స్‌ఏటీ వంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రముఖ సంస్థలలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
హెచ్‌ఈసీ.. సామాజిక అవగాహన
సామాజిక - ఆర్థిక అంశాలపై అవగాహన, పరిశీలన నైపుణ్యాలున్న విద్యార్థులకు కచ్చితంగా సరిపడే కోర్సు హెచ్‌ఈసీ. అంతేకాకుండా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు మరింత కలిసొచ్చే కోర్సు ఇది. సమాజంలో నిత్యం ప్రతిబింబించే అంశాలైన ఆర్థిక, రాజకీయ అంశాలు, చరిత్ర సంబంధిత విషయాలతో కూడి ఉండే ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు అకడెమిక్‌గా సునిశిత పరిశీలన శక్తి అవసరమవుతుంది. విస్తృత స్థాయిలో ఉండే అంశాల నుంచి అవసరమైన మేర మాత్రమే గ్రహించగల నైపుణ్యాలు, నిర్దిష్ట అంశం నేపథ్యంపై అవగాహన, అదే అంశానికి సంబంధించి సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనలు, భవిష్యత్తు పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం కూడా ఈ కోర్సు ఔత్సాహికులకు ఎంతో అవసరం. కెరీర్ పరంగా ప్రభుత్వ విభాగంలో ఆయా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు హెచ్‌ఈసీలో పరిజ్ఞానం ఎంతో తోడ్పడుతుంది. హెచ్‌ఈసీ పూర్తి చేసి బీఏలో అడుగుపెడితే.. ఆ కోర్సు అర్హతగా సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సులువుగా సన్నద్ధం కావచ్చు. అంతేకాకుండా బీఏ స్థాయిలో ఇప్పుడు కొత్తగా ఆవిష్కృతమవుతున్న కాంబినేషన్ల ఆధారంగా ప్రైవేటు రంగంలోనూ సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ వర్క్, సోషియాలజీ, పబ్లిక్ పాలసీ తదితర గ్రూప్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో కొలువులు ఖాయమవుతున్నాయి.
ఎంపీసీ, సీఈసీ సమ్మేళనంగా ఎంఈసీ
ఇటీవల కాలంలో ఆదరణ పొందుతున్న గ్రూప్.. ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఉండే ఈ గ్రూప్.. భవిష్యత్తులో కామర్స్ విభాగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు బాగా కలిసొస్తున్న కోర్సు. ఒకే సమయంలో మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ నైపుణ్యాలు అందించే ఈ కోర్సు సీఏ, ఐసీడబ్ల్యుఏ, సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు చక్కటి పునాది. అయితే ఈ గ్రూప్ ఔత్సాహికులకు అప్లికేషన్ ఓరియెంటేషన్, ప్రాక్టికల్ అప్రోచ్ ప్రధానంగా అవసరమైన సహజ లక్షణాలు. సమయ నిబంధనలు లేకుండా కష్టించే తత్వం, నిరంతర అధ్యయనం చేయగల నేర్పు కూడా అవసరం. ఇవి ఉంటేనే ఈ కోర్సులో రాణించగలరు. భవిష్యత్తు పరంగా ఎంఈసీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులతోపాటు డిగ్రీ స్థాయిలో బీకాంలో ప్రవేశించొచ్చు. సీఈసీ విద్యార్థులకు లభించే అవకాశాలన్నీ వీరికి లభిస్తాయి.
గ్రూప్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులు.
సదరు గ్రూప్‌లో ఉండే సబ్జెక్ట్‌లు, వాటిలోని ప్రాథమిక అంశాలపై అవగాహన స్థాయి.
దీర్ఘకాలిక లక్ష్యాలు.. ఎంపిక చేసుకోనున్న గ్రూప్ ద్వారా లభించే అవకాశాల విశ్లేషణ.
సదరు గ్రూప్‌నకు సంబంధించిన రంగంలో ప్రస్తుత ఉపాధి అవకాశాలు.
వాస్తవానికి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్థాయిలో విశ్లేషణలు చేసుకునే మానసిక పరిపక్వత ఉండదు. దాంతో తల్లిదండ్రులే పిల్లల ఆసక్తుల ఆధారంగా వీటిని చేపట్టాలని నిపుణుల సలహా. ఈ ఆసక్తిని పిల్లల వ్యవహార శైలి ద్వారా గమనించొచ్చని సూచిస్తున్నారు.
నిపుణుల సలహా
సైన్స్ కోర్సుల్లో చేరే వారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం
ఇంటర్మీడియెట్‌లో సైన్స్, మ్యాథమెటిక్స్ గ్రూప్స్‌లో చేరే విద్యార్థులకు మిగతా గ్రూప్‌లతో పోల్చితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అవి.. ప్రాక్టికల్ స్కిల్స్, అప్లికేషన్ ఓరియెంటేషన్. లేబొరేటరీల్లో గడిపేందుకు ఆసక్తి, ఓర్పు వంటి సహజ లక్షణాలు అవసరం. ఇవి ఉంటేనే ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లలో రాణించి.. భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. ఎంపీసీ, బైపీసీ అంటే.. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులకు మాత్రమే పునాది అని భావించొద్దు. ఇప్పుడు అప్లైడ్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, అగ్రికల్చర్, వెటర్నరీ సెన్సైస్‌లోనూ ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ఈ రంగాల్లో పరిశోధనలు చేసి ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
- డాక్టర్॥సి.వి.ఎల్.ఎన్. మూర్తి, ప్రిన్సిపాల్, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, నాగార్జునసాగర్.
కొలువులు ఖాయం చేసే కామర్స్
ఇంటర్మీడియెట్‌లో సీఈసీ గ్రూప్ ఎంపిక ద్వారా భవిష్యత్తులో కామర్స్ విభాగంలో ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యుఏ కోర్సుల పట్ల పెరుగుతున్న క్రేజ్, పబ్లిసిటీ ఆధారంగా చాలామంది విద్యార్థులు వీటిలో అడుగుపెట్టేందుకు సీఈసీని ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సులభమే. కానీ ఈ కోర్సు అర్హతగా ప్రవేశం పొందే ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించాలంటే గంటలకొద్దీ శ్రమించగల ఓర్పు, నిరంతరం మార్పుచేర్పులు జరుగుతున్న వ్యాపార, వాణిజ్య రంగాలపై అవగాహన అవసరం. ఈ స్కిల్స్ లేక అనేకమంది విద్యార్థులు ఆయా ప్రొఫెషనల్ కోర్సుల మధ్యలోనే వెనుదిరుగుతున్నారు. అందువల్ల కేవలం క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా.. ఆసక్తి, అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తు లక్ష్యాలకు సరితూగే కోర్సులను ఎంచుకోవాలి.
- టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్, హైదరాబాద్
ప్రధానంగా ప్రాక్టికల్ అప్రోచ్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మ్యాథ్స్, సైన్స్ మాత్రమే కాకుండా.. ఆర్ట్స్, హ్యుమానిటీస్ వరకు అన్ని విభాగాల్లో ప్రాక్టికల్ అప్రోచ్, అప్లికేషన్ ఓరియెంటేషన్‌లు కీలకంగా మారుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఏ గ్రూప్‌లో చేరాలనుకున్నప్పటికీ సంబంధిత సబ్జెక్టుల్లో నేర్చుకున్న అంశాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. చదివే ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసే తులనాత్మక అవగాహన కూడా ఎంతో అవసరం. ఈ నైపుణ్యాలు ఏ అంశంలో ఎక్కువగా ఉన్నాయో స్వీయ విశ్లేషణ చేసుకుని ఆ గ్రూప్‌ను ఎంచుకోవడం భవిష్యత్తులో లాభిస్తుంది. సైన్స్ గ్రూప్‌ల విషయానికొస్తే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు కూడా ఇప్పటివరకు తమ పిల్లలు ఆసక్తి చూపిన అంశాలేంటో గమనించి దానికి అనుగుణంగా ప్రోత్సహించాలి.
- కె. శరత్ చంద్ర, కో-ఫౌండర్, బటర్‌ఫ్లై ఫీల్డ్స్
ఇన్‌స్టంట్‌గా కాదు.. ఇంట్రెస్ట్ ఆధారంగా
ఇంటర్మీడియెట్ గ్రూప్ ఎంపికలో.. ఆయా కోర్సుల ద్వారా లభించే ఉద్యోగావకాశాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. సహజ ఆసక్తికి కూడా పెద్దపీట వేయాలి. అప్పుడే కెరీర్ గమ్యం దిశగా సరైన అడుగులు పడతాయి. కెరీర్ అంటే.. కేవలం ఇంజనీరింగ్, మెడికల్ అనే అపోహను వీడాలి. నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా కెరీర్‌పరంగా బహుముఖ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటికీ పునాది ఇంటర్మీడియెట్‌లో ఎంచుకున్న గ్రూప్ మాత్రమే. కాబట్టి సుదీర్ఘ ప్రణాళిక, వ్యూహాలతో గ్రూప్‌ను ఎంచుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల దృక్పథమూ మారాలి. తమ పిల్లల సహజ ఆసక్తులు ఏంటో గుర్తించి.. అందుకు తగ్గ కోర్సులను ఎంచుకునే దిశగా ప్రోత్సహించాలి. అప్పుడు ఎలాంటి గ్రూప్ అయినా.. కోర్సు అయినా భవిష్యత్తులో చక్కటి అవకాశాలు లభిస్తాయి.
- ఎం. రామకృష్ణ, ఎండీ, జడ్‌సీఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్
ఇంటర్‌లో గ్రూప్ ఎంపిక ఇలా..
Published Sun, May 18 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement