స్మార్ట్ సిప్‌ అంటే ఏంటి? | What is Smart SIP | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిప్‌ అంటే ఏంటి?

Published Mon, Feb 19 2024 7:37 AM | Last Updated on Mon, Feb 19 2024 7:37 AM

What is Smart SIP - Sakshi

ఈక్విటీ మార్కెట్‌ ఎప్పటికప్పుడు నూతన గరిష్ట స్థాయిలను తాకుతోంది. కనుక ఈ పరిస్థితుల్లో స్మార్ట్‌ సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవడాన్ని సూచిస్తారా..? డి. వెంకట రమణ

స్మార్ట్‌ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (స్మార్ట్‌ సిప్‌) అనేది రెగ్యులర్‌ సిప్‌తో పోలిస్తే వినూత్నమైనది. ప్రతి నెలా సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేసే మొత్తం అప్పటి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా స్మార్ట్‌ గా మారిపోతుంది. కొన్ని పారామీటర్ల ఆధారంగా మార్కెట్ల విలువలు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌక గా ఉన్నాయా అన్నది ఆల్గోరిథమ్‌ నిర్ణయిస్తుంది. 

మార్కెట్లు పూర్తి విలువ మేర ట్రేడ్‌ అవుతున్నాయని ఆల్గోరిథమ్‌ (సాఫ్ట్‌వేర్‌) భావిస్తే, అప్పుడు సిప్‌లో కొంత భాగమే ఈక్విటీ పెట్టుబడిగా వెళుతుంది. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్‌కు తరలిస్తుంది. ఒకవేళ స్టాక్‌ విలువలు చౌకగా ఉన్నాయని భావిస్తే అప్పుడు పెట్టుబడిలో అధిక భాగం స్టాక్స్‌కే కేటాయిస్తుంది. లిక్విడ్‌ ఫండ్‌కు పరిమితంగానే వెళుతుంది. స్మార్ట్‌ సిప్‌ ఇదే మాదిరిగా పనిచేస్తుంది. ఈ విధానం ఇన్వెస్టర్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఈక్విటీ వ్యాల్యూషన్లు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తమే పెట్టుబడిగా వెళుతుంది. అదే ఈక్విటీ వ్యాల్యూషన్‌ చౌకగా మారినప్పుడు సిప్‌లో అధిక భాగం ఈక్విటీలకు వెళుతుంటుంది. 

మార్కెట్లో అనుకూల సమయాన్ని ఎవరూ అంచనా వేయ లేరు. ఓ పద్ధతి ప్రకారం, క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లడమే కీలకం. ఇందుకు స్మార్ట్‌సిప్‌ వీలు కల్పిస్తుంది. నిజానికి సాధారణ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ఉద్దేశం కూడా పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కను తగ్గించడమే. 

మార్కెట్లు ఎప్పుడు దిద్దుబాటుకు గురవుతాయి? ఎప్పటి వరకు ర్యాలీ చేస్తాయి? అని ఎవరూ చెప్పలేదు. అటు ర్యాలీల్లోనూ, ఇటు పతనాల్లోనూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం సిప్‌ ద్వారా సాధ్యపడుతుంది. మార్కెట్లు ఖరీదుగా మారా యా? చౌకగా ఉన్నాయా? అని చూడక్కర్లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. స్టాక్స్‌ ధరలు దిద్దుబాటుకు గురైనప్పుడు సిప్‌ పెట్టుబడితో ఎక్కువ ఫండ్‌ యూనిట్లు సమకూరుతాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కావాల్సినది క్రమశిక్షణ. అందుకు సిప్‌ వీలు కల్పిస్తుంది. కనుక మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నాయని చెప్పి స్మార్ట్‌సిప్‌ను పరిశీలించక్కర్లేదు. మీరు రెగ్యులర్‌ సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

నా పెట్టుబడుల్లో సింహ భాగం ఈక్విటీల్లోనే ఉన్నా యి. రిటైర్మెంట్‌కు మూడేళ్లు మిగిలి ఉంది. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడులను డెట్‌ ఫండ్స్‌లోకి మళ్లించుకోవచ్చా? నా లాభం రూ.లక్షకు మించే ఉంటుంది. కనుక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా డెట్‌లోకి మళ్లించిన త ర్వాత ప్రతి నెలా ఇంత చొప్పున సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ద్వారా తీసుకుందామని అనుకుంటున్నాను. డెట్‌ ఫండ్‌ నుంచి ప్రతి నెలా బ్యాంక్‌ ఖాతాకు జమ అయ్యే మొత్తంపైనా పన్ను పడుతుందా? త్యాగన్‌ నరేంద్రన్‌

అవును. రెండు సందర్భాల్లోనూ మూలధన లాభంపై పన్ను పడుతుంది. అయినప్పటికీ రెండింతల పన్ను చెల్లించినట్టు కాదు. పెట్టుబడిపై వచ్చే రాబడిపైనే పన్ను అమలవుతుంది. దీర్ఘకాల లక్ష్యానికి చేరువ అవుతున్న క్రమంలో మూడేళ్ల ముందుగానే ఈక్విటీ పెట్టుబడులను స్థిరాదాయ సాధనాల్లోకి మళ్లించుకోవడం మంచి ఆలోచనే అవుతుంది.

లక్ష్యానికి చేరువ అవుతున్నప్పుడు పెట్టుబడులు తక్కువ అస్థిరతలతో కూడిన సాధనాల్లో ఉండడం ఎంతో అవసరం. ఇలాంటప్పుడే సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) అక్కరకు వస్తుంది. ఈక్విటీ ఫండ్స్‌ నుంచి మీ పెట్టుబడులను ఎస్‌డబ్ల్యూపీ ద్వారా డెట్‌ ఫండ్స్‌లోకి మళ్లించుకోవడం వల్ల మార్కెట్‌ కనిష్టంలో ఉన్నప్పుడు వైదొలిగే రిస్క్‌ను తప్పిస్తుంది.

ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement