సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు కాళోజీ విశ్వవిద్యాలయం తెలిపింది. నీట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అందులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాల డేటా రాగానే అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. వారంలో నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల ప్రకటన వెలువడుతుందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కాగా నీట్ ర్యాంకులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో చాలామంది జాతీయ స్థాయిలో తమ ర్యాంకులను చూసి ఆందోళన చెందుతున్నారని, కానీ రాష్ట్ర స్థాయిలో చూస్తే ర్యాంకులు తక్కువగానే ఉంటాయని నీట్ నిపుణులు చెబుతున్నారు.
చదవండి: ‘నిమ్స్ డైరెక్టర్‌కు అపోలోలో చికిత్సా?’
వారి అంచనా ప్రకారం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు, రాష్ట్ర స్థాయిలో 1500 నుంచి 2 వేల లోపు ర్యాంకులే వచ్చే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అటువంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే జాతీయ స్థాయిలో లక్ష వరకు ర్యాంకులు వచ్చిన వారికి మన దగ్గర ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్ సీటు వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకటన అనంతరం త్వరలో మొదటి విడత కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీచేస్తామని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదని వివరించాయి.
కొత్తగా 6 ప్రభుత్వ కాలేజీలు..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో మొత్తం 5,965 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,765 సీట్లు ఉండగా, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లో 3,600 సీట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల మూడు ప్రైవేటు కాలేజీలకు సంబంధించి అడ్మిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో వాటిల్లోని 450 ఎంబీబీఎస్ సీట్లను తీసేస్తే 3,150 సీట్లు ఉంటాయి. అయితే ఎంఎన్‌ఆర్ కాలేజీకి దాదాపు అనుమతి వచ్చినట్లేనని కాళోజీ వర్గాలు అంటున్నాయి.
కాబట్టి అవి 150 కలిపితే 3,300 సీట్లు అవుతాయి. మరోవైపు ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో జగిత్యాల, సంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి మెడికల్ కాలేజీలకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. దీంతో వాటిల్లో 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఇలా మొత్తం 16 ప్రభుత్వ కళాశాలల్లో 2,665 సీట్లు ఉండనున్నాయి. ఇక రామగుండం, మంచిర్యాల కాలేజీలకు కూడా అనుమతులు వస్తే వాటి ద్వారా మరో 300 సీట్లు పెరుగుతాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి.
నీట్ యూజీ-2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment