ఒడిదుడుకుల వారం!
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు
- విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు ప్రభావం చూపుతాయ్
- ఈ వారం మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ
న్యూఢిల్లీ: ఈ వారంలో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా సాగుతుందని విశ్లేషకులంటున్నారు. బక్రీద్ సందర్భంగా శుక్రవారం సెలవు అయినందున ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కావడం, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు దీనికి కారణాలని వారంటున్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్ ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ వారంలో ఎలాంటి ప్రధాన గణాంకాలు వెల్లడి కావని, ఈ గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ట్రేడర్లు తమ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్లను రోల్ ఓవర్ చేయడం, అన్‌వైండ్ చేయడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ (రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.
వర్షపాత వివరాలపై అప్‌డేట్స్, రూపాయి గమనం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతాయని, ట్రేడర్లు ఈ విషయాలను గమనంలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంట్ తదితర అంశాలపై స్టాక్ మార్కెట్ సూచీల గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. వచ్చే వారం(29న) వెలువడే ఆర్‌బీఐ పాలసీపై అంచనాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ను నిర్దేశించవచ్చని అన్నారు.
గతవారం మార్కెట్...
గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 609 పాయింట్లు లాభపడి 26,219 పాయింట్లకు చేరింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ నిర్ణయం ముగియడంతో ఇక ఇన్వెస్టర్లు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి సమస్యలపై దృష్టి సారిస్తారని నిపుణులంటున్నారు.
ఈ నెలలో రూ.4,610 కోట్ల నిధులు వెనక్కి..
వివిధ దేశీయ, అంతర్జాతీయ అంశాల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4,610 కోట్ల పెట్టుబడులను నికరంగా ఉపసంహరించుకున్నారు.