ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల సందడి | Housing sales in top 30 Tier II cities up 11percent in FY24 | Sakshi
Sakshi News home page

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల సందడి

Published Sat, Jul 6 2024 6:25 AM | Last Updated on Sat, Jul 6 2024 7:21 AM

Housing sales in top 30 Tier II cities up 11percent in FY24

అనుకూలిస్తున్న ఆర్థిక బూమ్‌  

మౌలిక వసతుల కల్పనతో వృద్ధి  ఫలితమే ఇళ్లకు అధిక డిమాండ్‌ 

ప్రాప్‌ ఈక్విటీ సంస్థ వెల్లడి

న్యూఢిల్లీ: ఇళ్ల డిమాండ్‌ ప్రధాన నగరాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వితీయ శ్రేణి (టైర్‌–2) పట్టణాల్లోనూ ఇళ్ల మార్కెట్లో సందడి నెలకొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2023–24) టాప్‌30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 11 శాతం పెరిగి 2,07,896 యూనిట్లుగా ఉన్నట్టు రియల్‌ ఎస్టేట్‌ డేటా విశ్లేషణ సంస్థ ‘ప్రాప్‌ ఈక్విటీ’ తెలిపింది. 2022–23 సంవత్సరంలో 1,86,951 యూనిట్లు విక్రయం కావడం గమనార్హం. ఈ మేరకు ఒక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. 

మొత్తం విక్రయాల్లో 80 శాతం టాప్‌–10 టైర్‌–2 పట్టణాలైన అహ్మదాబాద్, వదోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మోహాలిలో నమోదయ్యాయి. ఈ పది పట్టణాల్లో 2023–24లో 1,68,998 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 1,51,706 యూనిట్లుగా ఉన్నాయి. ఇక మిగిలిన 20 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో భోపాల్, లక్నో, గోవా, రాయిపూర్, విజయవాడ, ఇండోర్, కోచి, త్రివేండ్రం, మంగళూరు, గుంటూరు, భివాండి, డెహ్రాడూన్, లుధియానా, చండీగఢ్, ఆగ్రా, మైసూర్, సోనేపట్, పానిపట్, అమృత్‌సర్‌ ఉన్నాయి. 

ఎన్నో సానుకూలతలు..  
‘‘టైర్‌–1 పట్టణాల కంటే టైర్‌–2 పట్టణాల్లోనే ఇళ్ల మార్కెట్‌ పరంగా మెరుగైన పనితీరు నమోదైంది. దీనికి కారణం ధరలు తక్కువగా ఉండడంతోపాటు, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండడమే. ఈ చిన్న పట్టణాల్లోని మధ్యతరగతి వాసుల సొంతింటి కలను అందుబాటు ధరలు సాకారం చేస్తున్నాయి’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్‌ జసూజ తెలిపారు. చిన్న మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ), పరిశ్రమల ఏర్పాటుతో ఈ పట్టణాలు ఆర్థిక బూమ్‌ను చూస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మద్దతునిస్తుండడం కూడా ఈ పట్టణాల్లో డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపారు.  

పశి్చమాదిన ఎక్కువ 
దేశవ్యాప్తంగా టాప్‌–30 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గత ఆర్థిక సంవత్సరం నమోదైన ఇళ్ల విక్రయాల్లో 70 శాతం వాటా.. పశి్చమాదినే ఉండడం గమనించొచ్చు. ఇక్కడి పట్టణాల్లో విక్రయాలు అంతక్రితం ఆర్థిక సంవత్సరం కంటే 11 శాతం పెరిగి 1,44,269 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లోని పట్టణాల్లో అధిక డిమాండ్‌ కనిపించింది. ఉత్తరాదిన విక్రయాలు 8 శాతం పెరిగి 26,308 యూనిట్లుగా ఉంటే, దక్షిణాదిన 8 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. తూర్పు, మధ్య భారత్‌లోని పట్టణాల్లో 18 శాతం అధికంగా 15,372 ఇళ్లు అమ్ముడయ్యాయి.  

సొంతింటి కల ఆకాంక్షల ఫలితం..
మౌలిక వసతులు, ప్రాంతాల మధ్య అనుసంధాన పెరగడంతో పెద్ద ఎత్తున మార్పును చూస్తున్నట్టు ఎల్డెకో గ్రూప్‌ సీవోవో మనీష్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. తమ కంపెనీ లుధియానా, రుద్రాపూర్, సోనిపట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. ‘‘లోక్‌సభ ఎన్నికల సమయం కావడంతో టైర్‌–1 పట్టణాల్లో 2024 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు తాత్కాలికంగా తగ్గాయి. కానీ ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం పెరిగాయి. ధరలు అందుబాటు ధరల్లో ఉండడంతో మధ్యతరగతి వాసుల సొంతింటి ఆకాంక్ష డిమాండ్‌ను నడిపిస్తోంది’’అని బెంగళూరుకు చెందిన సముద్ర గ్రూప్‌ సీఎండీ మధుసూదన్‌ జి 
తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement