ఇక ఇంటింటికీ గో‘దారి’ | Water Grid Project As A Role Model For The State | Sakshi
Sakshi News home page

ఇక ఇంటింటికీ గో‘దారి’

Published Sun, Jan 19 2020 10:07 AM | Last Updated on Sun, Jan 19 2020 10:08 AM

Water Grid Project As A Role Model For The State - Sakshi

గోదారమ్మ... జిల్లాలోని ప్రతి ఇంటి తలుపూ తట్టనుంది. గోదారి ఇన్నాళ్లూ పుడమి తల్లి గర్భాన్ని తడిపి సస్యశ్యామలం చేయడమే కాకుండా జనం దాహార్తిని తీరుస్తూ వచ్చింది. ఇప్పుడు మరింత ముందుకు సాగి వైఎస్సార్‌ అధినేత, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చొరవతో ఇంటింటికీ కుళాయి నీళ్లతో గొంతు తడపనుంది. స్వచ్ఛమైన నీళ్లు తాగాలంటే టిన్‌ల రూపంలో రూ.10 నుంచి రూ.20 వరకూ కొనుగోలు చేయాల్సిందే. ఆ కష్టాలకు చెక్‌ పెడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట నీటి మూట కాదంటూ అధికారం చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరూపించుకున్నారు జగన్‌. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం:  కాలువల్లో కలుషితమైన నీటిని వేడి చేసి వడగట్టి తాగాల్సిన అవసరం ఇక ఎదురుకాదు. ఆక్వా చెరువులతో తాగునీరు కాలుష్యమైపోయి గుక్కెడు శుద్ధి చేసిన నీరు దొరకడమే గగనమైపోతున్న పరిస్థితులకు ఇక చెల్లు చీటీ. ఎందుకంటే ఇక ఇంటింటికీ గోదావరి జలాలు రానున్నాయి. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి దారిపొడవునా జనం తాగు నీటి ఇబ్బందులను తీసుకువెళ్లారు. ఒక మధ్య తరగతి కుటుంబం నెలకు తాగునీటి కోసం రూ.1000 నుంచి రూ.1200 ఖర్చుపెడుతున్న పరిస్థితిని తెలుసుకుని నాడు ఆయన చలించిపోయారు. ఆ సమయంలోనే ప్రతి ఇంటికీ నేరుగా స్వచ్ఛమైన గోదావరి జలాలు అందిస్తానని మాట ఇచ్చారు.

అధికారం చేపట్టి ఏడు నెలలు తిరగకుండానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఇంటింటికీ గోదావరి జలాలు అందించే వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేలా కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో రూపొందించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును పరిశీలించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు ఆ డిజైన్‌నే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. జిల్లాలో ఈ ప్రాజెక్టు కోసం రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా రూ.3,960 కోట్లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది

ప్రస్తుతం జిల్లాలో ఉన్న 52 (సీపీడబ్ల్యూ స్కీమ్స్‌) సమగ్ర రక్షిత మంచినీటి పథకం) ద్వారా మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకాల ద్వారా జిల్లాలోని 45 శాతం మందికి మాత్రమే మంచి నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. తలసరి 40 లీటర్లు నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అంటే ఒక గ్రామంలో 75 కుటుంబాలుంటే ఒక పబ్లిక్‌ ట్యాప్‌ (వీధి కుళాయి) ఉంటుంది. ఆ కుటుంబాలన్నీ ఆ ఒక్క ట్యాప్‌ నుంచి తెచ్చుకోవాల్సిందే. అది కూడా వారానికి నాలుగైదు రోజులు మాత్రమే సరఫరా. జిల్లాలో ఏ మంచినీటి పథకమైనా పంట కాలువలే మూలాధారం.

ప్రస్తుతం చెత్తా చెదారంతో, ఆక్వా మురుగు నీరు, వ్యర్థ జలాలతో పంట కాలువలలో నీరు కాలుష్య కారకంగా మారిపోయింది. చివరకు చూస్తూ, చూస్తూ ఆ నీటిని తాగలేక మార్కెట్‌లో మంచినీటి టిన్నులను కొనుక్కునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు సహా అమలాపురం, రామచంద్రపురం, తుని తదితర పట్టణాల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం కుళాయి నీటిని తీసుకువెళుతుంటారు. ఈ పరిస్థితి మార్చేస్తామంటూ గత చంద్రబాబు ప్రభుత్వం ఊరూవాడా మంచినీటి పథకాలకు శంకుస్థాపనలతో హడావుడి చేసేసింది. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లని నమ్మించి మోసం చేసింది. 

జగన్‌ సర్కారు చిత్తశుద్ధితో...
ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయాలనే సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ సర్కారు ఓ అడుగు ముందుకు వేసి జిల్లా రక్షిత మంచినీటి పథకాల రూపురేఖలనే మార్చేసే వాటర్‌ గ్రిడ్‌కు ప్రణాళిక రూపొందించి. గత సెప్టెంబరులో ఆర్‌డబ్ల్యూ ఎస్‌ ఉభయ గోదావరి జిల్లాల అధికారులు రాజమహేంద్రవరంలో ఉభయగోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ టి.గాయత్రీ దేవి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. ఈ గ్రిడ్‌నే రోల్‌మోడల్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. తొలి విడతలో ఎంపికైన జిల్లాల్లో మన జిల్లా ఉండటంతో ఇక్కడి ప్రజలకు భారీ ప్రయోజనం కలగనుంది. ఇక ముందు తలసరి 40 లీటర్లకు బదులు 100 లీటర్లు నీటిని సరఫరా చేయనున్నారు. ఒక గ్రామంలో 2,500 మంది ఉంటే అందులో 45 శాతం అంటే వెయ్యి మందికి మాత్రమే ప్రస్తుతం పథకాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇక ముందు 2,500 మందికి పూర్తిగా నీటిని అందించనున్నారు. అదీ కూడా గోదావరి నుంచి నేరుగానే సరఫరా చేస్తారు.

‘రాష్ట్రానికే రోల్‌మోడల్‌’
వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు రాష్ట్రానికి రోల్‌ మోడల్‌గా నిలవడం చాలా అనందంగా ఉంది. మన జిల్లా అధికారులు రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అమలుచేసేలా ఉపయోగపడింది. జిల్లా ప్రజలకు ఇది చాలా ప్రయోజనం కలుగుతుంది. రూ.4000 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే రూ.3,960 కోట్లకు ఆమోదం తెలియజేయడం జిల్లా ప్రజలకు వరమే. ప్రతి ఆవాసానికి నేరుగా గోదావరి జలాలు అందించే ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం 40 లీటర్లు మాత్రమే అందివ్వగలుగుతున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 లీటర్ల్ల నీటిని సరఫరా చేయగలుగుతాం.
– డి.మురళీధర్‌ రెడ్డి,  జిల్లా కలెక్టర్‌

తలసరి 100 లీటర్లు శుద్ధిచేసిన నీరు 
రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా జిల్లాలో ప్రతి ఆవాసానికి మంచినీటి సరఫరాకు మార్గం సుగమం అవుతుంది. జిల్లాలో 2051 వరకూ పెరిగే జనాభా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశాం. పంట కాలువల ద్వారా నీటిని తీసుకుని శుద్ధిచేసి స్టోరేజీ ట్యాంకుల ద్వారా పబ్లిక్‌ కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక ముందు నేరుగా గోదావరి నీటిని తీసుకునే పాయింట్‌లోనే శుద్ధి చేసి నేరుగా స్కీమ్‌ల నుంచి పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తాం. ప్రతి ఇంటికీ కుళాయి నీటిని సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
– టి.గాయత్రీదేవి,ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement