వాటర్‌గ్రిడ్‌తో ‘గ్రేటర్’కు జలకళ
తీరనున్న భాగ్యనగరం దాహార్తి
సీఎం సమీక్షతో చిగురిస్తున్న ఆశలు
మరో రెండు రోజుల్లో కార్యాచరణకు శ్రీకారం
సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుతో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తి తీరనుంది. మహానగరం జలకళతో కొత్త రూపు సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ బుధవారం ఈ అంశంపై నిర్వహించిన సమీక్షాసమావేశంలో హైదరాబాద్‌లో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ అంశంపై సీఎం సమక్షంలో ప్రత్యేకంగా సమావేశమవడంతోపాటు గ్రేటర్ వాటర్‌గ్రిడ్‌పై కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ గ్రిడ్ ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సుమారు 39.22 టీఎంసీల నీళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని 1.20 కోట్ల జనాభా తాగునీటి అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. అలాగే, హైదరాబాద్‌లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల దాహార్తి తీరడంతోపాటు, కొత్తగా వచ్చే ఐటీఐఆర్, అర్బన్ నోడ్స్, అర్బన్ సెంట ర్లకు తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. కృష్ణా, గోదావరి, ఎల్లంపల్లి,సిం గూరు, మంజీరా, జూరాల, నాగార్జున సాగర్ జలాశయాల(మెయిన్‌సోర్స్) నుంచి తాగునీటిని నగరం నలుమూలలా సరఫరా చేసే గ్రేటర్ వాటర్‌గ్రిడ్ పథకం ప్రతిపాదనలను జలమండలి ఇంజనీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ సీఎం కేసీఆర్‌కు నివేదించారు. దీన్ని ముఖ్యమంత్రి ఆమోదిస్తే ఈ పథకం పట్టాలెక్కనుంది.
గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఇలా...
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాకు 34.14 టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాకు 5.8 టీఎంసీలు మొత్తంగా 39.22 టీఎంసీల నీటిని గ్రిడ్ ద్వారా నిరంతరం సరఫరా చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు జూరాల నుంచి 5 టీఎంసీలు,నాగార్జున సాగర్ జలాశయం నుంచి 16.5, ప్రాణహిత, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా 8.64 టీఎంసీలు, సింగూరు నుంచి 3 టీఎంసీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి ఒక్క టీఎంసీ నీటిని సేకరించాలని నిర్ణయించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు జూరాల నుంచి 1 టీఎంసీ, నాగార్జునసాగర్ నుంచి 1.08 టీఎంసీ, ప్రాణహిత,ఎల్లంపల్లి నుంచి 1 టీఎంసీ, సింగూరు నుంచి 2 టీఎంసీల నీటిని సేకరించనున్నారు. గ్రేటర్ పరిధిలో ఒక్కొక్కరికి సుమారు 150 ఎల్‌పీసీడీ(లీటర్‌పర్ క్యాపిటా డైలీ) నీటిని సరఫరా చేయాలని ఈ గ్రిడ్ ద్వారా లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇందుకోసం ఆయా జలాశయాల నుంచి భూమ్యాకర్షణ శక్తి ద్వారా(గ్రావిటీ) నీటిని తరలించేందుకు భారీ మైల్డ్‌స్టీల్ పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ సర్కిళ్లు, డివిజన్లు, కాలనీలవారీగా నీటి సరఫరాకు పైప్‌లైన్‌న్లు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా నీటిశుద్ధి కేంద్రాలు, నీటి సరఫరాకు పలు ప్రాంతాల్లో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు,సర్వీసు రిజర్వాయర్లు,పంపుహౌజ్‌లు, విద్యుత్ పంపింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రధాన గ్రిడ్‌ల నుంచి సరఫరా ఇలా....
కృష్ణా గ్రిడ్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి(పార్ట్), నల్లగొండ, ఖమ్మం(పార్ట్), హైదరాబాద్.
గోదావరి గ్రిడ్: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి(పార్ట్), హైదరాబాద్.
గ్రేటర్‌కు పుష్కలంగా మంచినీళ్లు
హైదరాబాద్ వేగంగా విస్తరించడంతోపాటు జనాభా అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ రూపొందించాం. దీని ద్వారా శివారు ప్రాంతాల దాహార్తి తీరుతుంది. గుజరాత్ మోడల్ కంటే ఇది ఉత్తమమైంది. ఈ గ్రిడ్ ద్వారా కృష్ణా, ఎల్లంపల్లి, గోదావరి, మంజీరా, సింగూరు, జూరాల జలాశయాల నుంచి గ్రేటర్‌పరిధిలో నిరంతరం నీటిని సరఫరా చేయొచ్చు.
-ఎం.సత్యనారాయణ (జలమండలి ఇంజనీర్ ఇన్ చీఫ్)