ప్రతిష్టాత్మక పనులకు నిధుల కొరత రాకూడదు | Andhra Pradesh Government Mainly Focused To Complete The Projects | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మక పనులకు నిధుల కొరత రాకూడదు

Published Fri, Jul 10 2020 4:39 AM | Last Updated on Fri, Jul 10 2020 4:24 PM

Andhra Pradesh Government Mainly Focused To Complete The Projects - Sakshi

రాయలసీమ కరువు నివారణ పనులు, స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ (పోలవరం నుంచి వరద జలాల తరలింపు), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ – తాగునీటి వసతి కల్పన, కృష్ణా – కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చూసే పనులను ప్రాధాన్యతగా చేపట్టాలి.

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిధుల సమీకరణపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని, కచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకు వేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పనులకు సంబంధించి నిధుల సమీకరణ విషయమై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.

ఆగస్టు 15 నాటికి మిగిలిన నిధులివ్వాలి
► విద్యా రంగంలో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల గురించి సీఎం ఆరా తీశారు.
► మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందు కోసం దాదాపు రూ.3,600 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. 
► మిగిలిన నిధులు విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. – పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్‌.. డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7,700 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అ«ధికారులు సీఎంకు తెలిపారు. ఇందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. 

వైద్య, ఆరోగ్య రంగంలో ఖర్చు అంచనా ఇలా..
► 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, ఒక సూపర్‌ స్పెషాల్టీ, ఒక క్యాన్సర్‌ ఆస్పత్రి, ఒక మానసిక చికిత్సాసుపత్రి కోసం రూ.6,657 కోట్లు. 
► ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం మరో రూ.6,099 కోట్లు.
► ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.1,236 కోట్లు. 
► పీహెచ్‌సీల్లో కొత్త వాటి నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ కోసం రూ.671 కోట్లు.
► విలేజ్‌ క్లినిక్స్‌లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ, కొత్త వాటి నిర్మాణం కోసం రూ.1,745 కోట్లు.  
► ఇప్పటికే నిధులు సమకూరిన వాటి పనులు వేగవంతం చేయాలని, మిగతా వాటికి నిధులు అనుసంధానం చేసుకుని ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

కర్నూలు జిల్లాలోనూ వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు 
► రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాల్లో భాగంగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం రూ.19,088 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి నిధుల అనుసంధానం గురించి సీఎంకు వివరించారు. నిధుల సమీకరణ టై అప్‌ జరిగిందని తెలిపారు. 
► వీటితోపాటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్‌ నియోజకవర్గంలో కూడా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతంలో, అనంతపురం జిల్లాలోనూ వాటర్‌ గ్రిడ్‌ పనులు చేపట్టాలన్నారు. వీటికి డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
► హైబ్రీడ్‌ యాన్యుటీ (హెచ్‌ఏఎం) విధానంలో చేపడుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులకు అక్టోబర్‌లో టెండర్లు ఖరారు చేస్తామని, ఆ వెంటనే వర్క్‌ ఆర్డర్లు ఇస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
► ఈ సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్‌ అండ్‌ బీ, జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

‘సీమ’ కరువు నివారణ పనులకు త్వరలో టెండర్లు
► రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.98 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వీటిలో రూ.72 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయనున్నారు. 
► రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ఉద్దేశించిన పనులకు ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో దీనికి సంబంధించి ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. 
► ఎట్టి పరిస్థితుల్లో అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, టెండర్లు వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement