భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు | Works on the basis of geographical conditions | Sakshi
Sakshi News home page

భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు

Published Thu, Dec 4 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు

భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పనులు

  • వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • సాక్షి, హైదరాబాద్: శాస్త్రీయమైన అవగాహన, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటర్‌గ్రిడ్ పనులను చేపట్టాలని సీఎం కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజె క్టు పనులను జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు. వాటర్‌గ్రిడ్ పనులపై బుధవారం సచివాలయంలో మంత్రి కె.తారకరామారావు, ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రామకృష్ణారావు తదితరులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా మ్యాప్‌లు తెప్పించుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, గుట్ట లు, ఎత్తై ప్రదేశాలను పరిశీలించాలన్నారు. కృష్ణా, గోదావరి, ఇతర నదుల నీటిని గ్రామాలకు తరలించేందుకు లిఫ్ట్ కమ్ గ్రావిటీ మేరకు వాటర్‌గ్రిడ్ పైపులైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నందున, మండలాల వారీగా కాంటూర్లను గుర్తించే ప్రక్రియపై దృష్టి సారించాలని అన్నారు. కాంటూర్ల వివరాలను తెలుపుతూ ఒక పుస్తకాన్ని ముద్రించాలని, ఈ పుస్తకం ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న అధికారులందరికీ అం దుబాటులో ఉంచాలని కేసీఆర్ సూచించారు.
     
    ఇంటెక్ వెల్స్‌కు వెంటనే ప్రతిపాదనలు..

    వాటర్‌గ్రిడ్‌లో భాగమైన ఇంటెక్ వెల్స్ నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది కనుక, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన ఇంటెక్ వెల్స్, మోటార్లు.. తదితర అంశాలపై అంచనాలు రూపొందించాలని చెప్పారు. అవాంతరాలు ఎదురైనా నీటిని తోడేందుకు ఇబ్బంది రాకుండా అదనపు మోటార్లను ఇంటెక్ వెల్స్ వద్ద సిద్ధంగా ఉంచాలని సూచించారు.  

    ట్రీట్‌మెంట్ ప్లాంట్లు కూడా పెద్దసంఖ్యలో ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్లాంట్లు, వాటి నిర్మాణానికి పట్టే సమయం.. తదితర అంశాలను అధ్యయనం చేసి ముందుకు సాగాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులు, ట్రంక్, డిస్ట్రి బ్యూటరీ పైపులైన్లు కూడా నిర్మించాల్సి ఉన్నందున అధికారులు వేగంగా స్పందించాలని కోరారు. ఎంత సమయంలో వాటిని నిర్మించగలరో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
     
    వాటర్‌గ్రిడ్‌లో 709 తాత్కాలిక ఉద్యోగాలకు అనుమతి

    వాటర్‌గ్రిడ్ పనులను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇం దులో భాగంగానే 709 తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. నిబంధనల మేరకు ఉద్యోగుల నియామకానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వం మంజూరు చేసిన 709 పోస్టుల్లో 47 సీనియర్ అసిస్టెంట్లు కాగా, 662 వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టులున్నాయి. అలాగే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ నిమిత్తం ఇంజనీరింగ్ అధికారుల(ఎస్‌ఈ)కు 26 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసేం దుకు ప్రభుత్వం అనుమతించింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement