
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మండు వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, అనిల్‌కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పెరిగే జనాభాను అంచనా వేసి, 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ డిజైన్‌ను అధికారులు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 46,982 నివాసిత ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని 110 పట్టణ, నగర పాలక ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని, మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.2,500 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు.
భూగర్భ జలాల వినియోగం నిలిపివేత!
వాటర్ గ్రిడ్ పథకంలో.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైప్‌లైన్ల ద్వారా నీటిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి ఇకలేదని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. గిరిజన ప్రాంతాల్లో నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కోసం జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వినియోగించుకోవాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రాంతాల వారీగా ఎంత నీరు అవసరం? జలాశయాలు, నదులు, ఇతర వనరుల్లో ఉన్న నీటి లభ్యత ఎంత? అనేదానిపై సమగ్ర సమాచారం సేకరించాలని మంత్రులు ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment