భూకంప జోన్ పరిధిలోనే రాజధాని
- నిర్మాణాలు విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి -నేపాల్ అంత తీవ్రత లేకున్నా జాగ్రత్తలు అవసరం
- రాజీపడితే భారీ మూల్యం
- ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రిసెర్చ్ సెంటర్ అధిపతి ప్రదీప్‌కుమార్
హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని భూకంప తీవ్రత కలిగిన జోన్ పరిధిలోనే ఉందని ఐఐఐటీ హైదరాబాద్ ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి ఫ్రొఫెసర్ రామచర్ల ప్రదీప్‌కుమార్ చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా వాటిని తీర్చిదిద్దాలని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన ప్రదీప్‌కుమార్‌తో సాక్షి ముచ్చటించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనూ .....
సాక్షి : ఇటీవల ప్రపంచ వ్యాపితంగా భూకంపాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.?
ప్రదీప్ : అవును. పర్యావరణ పరిస్థితులు భూకంపాలను సష్టిస్తున్నాయి. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తాయని ముందుగా అంచనా వేసినా అందుకు తగిన విధంగా నిర్మాణాలు లేకపోవడం వలన నష్టం అధికంగా ఉంటుంది.
సాక్షి : నవ్యాంధ్ర రాజధాని కష్ణా తీరం భూకంపాల జోన్‌లో ఉందా?
ప్రదీప్ : కృష్ణా తీరమైన విజయవాడ పరిసరాలన్ని భూకంపాల జోన్-3లో ఉన్నాయి. నూతన రాజధానిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. అయితే జోన్-4, జోన్-5, జోన్-6 ఇలా భూకంపాల తీవ్రత కలిగిన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. వాటితో పోల్చితే ఇక్కడ అంత భారీ ప్రభావం ఉండదు.
సాక్షి : ఇటీవల నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది కదా...?
ప్రదీప్ : అవును. అయితే నేపాల్ సరిహద్దు ప్రాంతాలైన కాశ్మీర్ జోన్-5లో ఉంది.
సాక్షి :నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది కాదా. దానిపై భూకంపాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.?
ప్రదీప్ : జోన్-5 కన్నా అత్యధిక తీవ్రత కలిగిన టోక్యో, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లోనే భూకంపాలు తట్టుకునే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి ఇంజనీరింగ్ విధానాలను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలి. దానివలన భూకంపాలను ఎదుర్కొనేందుకు అవకాశముంటుంది.
సాక్షి : ఏ విధమైన చర్యలు చేపట్టాలి?
ప్రదీప్ :అంతర్జాతీయ ప్రమాణాల్లో భాగంగా ఐఎస్1893 (కెరిటెరియ ఫర్ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రెక్చర్) బుక్ ప్రమాణాలను అనుసరించాలి. అలాగే పీర్‌రివ్యూ కమిటీ నిరంతరం పరిశీలించాలి. ఈ కమిటీ రెండు సంవత్సరాల కొకసారి మారుతుంది. దానివలన నిర్మాణాలను వివిధ రకాలుగా ఆయా రంగాల నిపుణులు పరిశీలిస్తారు. దీనివలన మంచి నిర్మాణాలు వస్తాయి.
సాక్షి : భారీ బహుళ అంతస్తుల భవనాలను నమూనాలుగా చూపిస్తున్నారు. వాటిపై భూకంపాల ప్రభావం ఉండదా?
ప్రదీప్ : ఆర్కిటెక్చర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా స్ట్రెక్చరల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. దాని వలన మేలు జరుగుతుంది. ఏది ఏమైనా ప్రమాణాల విషయంలో రాజీ పడితే మూల్యం చెల్లించక తప్పదు.