ప్రజారవాణాలో స్మార్ట్.. ముంబయి బెస్ట్
అక్కడ ఇక్కడ
సిటీబ్యూరో: మహానగరం విస్తరణలో వడివడిగా పరుగులు పెడుతోంది. ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు అందుబాటులో తెస్తున్నట్టు నాయకులు చెబుతున్నారు. కానీ మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఇంకా పాతికేళ్ల వెనుకే ఉన్నాం. సిటీ ఒకచోటు నుంచి మరోచోటుకు సొంత వాహనాలు లేని సిటీజన్లు నరకం చూడాల్సిందే. రాత్రయితే బస్సులు లేక అవస్థలు పడాల్సిందే. హైటెక్ యుగంలో ఉన్న హైదరాబాద్‌లో చాలా కాలనీలకు బస్సు రూట్లే లేవు. అయితే, మన పొరుగున ఉన్న ముంబయి మహానగరంలో మాత్రం బస్సుల కోసం పడిగాపులు పడకుండా, వ్యక్తిగత వాహనాలతో పనిలేకుండా తీరైన ప్రజారవాణా వ్యవస్థ అమల్లో ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ బల్దియాలో బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పడమేగాని అమలు చేయడం లేదు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇదే అంశాన్ని నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బృహన్ ముంబయి ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు’ (బెస్ట్) సంస్థ విధానాలు.. గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ‘సాక్షి’ కథనం..
ఇక్కడంతా హడావిడే..
ముంబయి తరహాలో ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు ఆ నగరంలో అమలవుతున్న ‘క్యూ’ పద్ధతిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం హడావుడిగా నిర్ణయం తీసుకుంది. కానీ అది ఆచరణలో విఫలమైంది. అప్పట్లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రె డ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఆర్టీసీ జేఎండీ రమణారావు, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్, ఇతర అధికారుల బృందం ముంబయిలో పర్యటించింది. బస్సుల నిర్వహణ, ఆన్‌లైన్ సేవలు, క్యూ పద్ధతి వంటి అనేక అంశాలను పరిశీలించింది. ఈ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో క్యూ పద్ధతి అమలు కావాలంటే కనీసం 1300 చోట్ల బస్‌బేలు అవసరమని ఆర్టీసీ పేర్కొంటున్నా.. ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమే.
గ్రేటర్ ఆర్టీసీ - బెస్ట్ సేవలు ఇలా..
⇒ గ్రేటర్ ఆర్టీసీ బెస్ట్
⇒ మొత్తం బస్సులు: 3550 మొత్తం బస్సులు: 5000
⇒ నగరంలో డిపోలు: 28 ముంబయిలో డిపోలు: 26
⇒ నగర జనాభా: 80 లక్షలకు పైగా ముంబయి జనాభా సుమారు 2 కోట్లు
⇒ ప్రయాణికుల సంఖ్య: 34 లక్షలు ప్రయాణికుల సంఖ్య 45 లక్షలు
⇒ ఆక్యుపెన్సీ: 68 శాతం ఆక్యుపెన్సీ 75 శాతం
⇒ నగరంలో ఉన్న రూట్లు: 1050 సుమారు రూట్లు 750
⇒ జీపీఎస్ కేవలం 80 బస్సుల్లోనే అన్ని బస్సులు జీపీఎస్ పరిధిలో
⇒ ఆన్‌లైన్ సేవలు విస్తరించాల్సి ఉంది బస్‌పాస్‌తో సహా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే..
⇒ కేవలం వంద బస్టాపుల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బస్సుల్లో ఎల్‌ఈడీ, స్టేజీ అనౌన్స్‌మెంట్
⇒ క్యూ పద్ధతికి అనుకూలమైన రూట్లు లేవు అన్ని రూట్లలోనూ క్యూ పద్ధతి అమలు
⇒ మహిళలకు ముందు ద్వారం ఉన్నా అమలు లేదు మహిళలకు, పురుషులకు వేర్వేరు ద్వారాలు
⇒ ప్రతి 30 నిమిషాలకో ఒక బస్సు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు
⇒ రాత్రి 9 దాటితే బస్సు లభించడం కష్టం అన్ని వేళల్లోనూ అందుబాటులో బస్సులు
⇒ ఇక్కడ మాన్యువల్ టిక్కెట్‌లు అమలు స్మార్ట్‌కార్డుల ద్వారా ప్రయాణికులకు సేవలు