పాడేరు, న్యూస్‌లైన్: కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గిరిజ న సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా లో రక్ష సెక్యూరిటీ సంస్థలో జూన్ నెల నుంచి సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందుతున్న గిరిజన యువకులు సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వినూత్నంగా ఆ యువకుల తల్లిదండ్రులతో ఆదివా రం ఫోన్‌లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన పాడేరు ఐటీడీఏకు ఫోన్ చేసి శిక్షణ పొందిన యువకుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
తాను ఇటీవల రక్ష సెక్యూరిటీ శిక్షణ సంస్థను సందర్శించానని, మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారని, ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారని చెప్పారు. అన్ని వసతి సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంస్థలో ఉద్యోగాలు చేయడం ద్వారా మంచి జీతభత్యాలు లభిస్తాయని, చక్కని భవిష్యత్ ఏర్పడుతుందని భరోశా ఇచ్చారు. విశాఖ ఏజెన్సీలోని గిరిజన యువకులపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేసినట్టు తెలి పారు. తమ బిడ్డలకు ఇతర రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ర్టంలోనే ఉద్యోగావకాశాలు కల్పించాలని పలువురు తల్లిదండ్రులు కమిషనర్‌ను కోరారు.
దీనిపై ఆయన స్పందిస్తూ ఉద్యోగాలు ఎక్కడ వచ్చిన పనిచేయాలన్నారు. తాను బీహార్‌కు చెందిన వాడనని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే సూపర్వైజర్ స్థాయికి ఎదిగి మరింత ఎక్కువ జీతభత్యాలు పొందుతారని తెలిపారు. అనంతరం రక్ష సంస్థలో శిక్షణ పొందుతున్న జీకే వీధి మండలం సంకాడ గ్రామానికి చెందిన సాగిన రాజుపడాల్, డుంబ్రిగుడ మండలం సంతవలస, కండ్రుం గ్రామాలకు చెందిన కుమిడి రామరాజ్యం, మఠం శంకరరావు తదితరులు తమ తల్లిదండ్రులతో ఈ ఫోన్‌లో మాట్లాడారు.
శిక్షణ బాగుందని, అన్ని సౌకర్యాలు కల్పించారని, సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నామని సంతోషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ కాఫీ సీనియర్ సహాయకులు ఎం.వెంకటేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం జాబ్స్ ఎం.కరుణానిధి, జేడీఏంలు సత్తిరాజు, సతీష్, డీసీసీబీ డెరైక్టర్ బి.నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.