చెత్తే కదా అని విసిరేస్తే జైలుకే!
- జీహెచ్‌ఎంసీ కొరడా
- దశలవారీగా జరిమానాలు
- పదేపదే అదే తప్పు చేస్తే జైలుశిక్ష
- ఎంపిక చేసిన 8 ప్రధాన మార్గాల్లో రేపట్నుంచి అమలు
సాక్షి, సిటీబ్యూరో: ఇకపై రోడ్లపై ఇష్టానుసారం చెత్త వేస్తే కుదరదు. తొలిసారి రూ.500 జరిమానా.. మళ్లీ మళ్లీ అదే తప్పుచేస్తే ఈ మొత్తం దశల వారీగా రూ. 10 వేలకు పెరుగుతుంది. అంతేకాదు.. జైలు శిక్షా పడొచ్చు. గ్రేటర్‌లో చెత్త సమస్య పరిష్కారానికి సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. చెత్త రహిత రహదారుల (లిట్టర్ ఫ్రీ రోడ్స్)ను తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 8 ప్రధాన మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ మార్గాల్లో ఆగస్టు 1 నుంచి ‘చెత్త వేస్తే జరిమానా’ చర్యలు అమల్లో ఉంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. ప్రజారోగ్యం, నగర సుందరీకరణ కోసం ఈ కఠిన చర్యలకు సిద్ధమయ్యామన్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టాలను అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇవీ నిబంధనలు..
ఎంపిక చేసిన మార్గాల్లోని దుకాణదారులు, సంస్థలు, నివాసితులు చెత్తను జీహెచ్‌ఎంసీ నియమించిన వ్యక్తులకే అందజేయాలి
సిబ్బంది రోజుకు రెండుసార్లు నిర్ణీత సమయాల్లో (ఉదయం 11-మధ్యాహ్నం 2, రాత్రి 8-10 గంటలు) చెత్తను సేకరిస్తారు. స్థానిక పరిస్థితులను బట్టి ఈ వేళల్లో మార్పుచేర్పులకు వీలుంది
ఎంపిక చేసిన ప్రాంతాల్లోని రోడ్లపై ఎవరూ చెత్త వేయరాదు. దీనిని ఉల్లంఘిస్తే జరిమానా.. ఆపై జైలు శిక్ష ఉంటాయి
ఈ మార్గాల్లోని దుకాణాదారులు, గృహాల వారితో పాటు తోపుడుబండ్ల వ్యాపారులు చెత్తను తమ ప్రాంగణంలోనే ఉంచాలి
తడి, పొడి చెత్తలు వేయడానికి వీలుగా రెండు డబ్బాలను వినియోగించాలి. వాటికి మూతలుండాలి. ఆకుపచ్చ రంగు డబ్బాలో తడి చెత్త, తెలుపు రంగు డబ్బాలో పొడి చెత్త వేయాలి. నిర్ణీత సమయాల్లో వచ్చే జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందిన సేకరణదారుకు వీటిని అందజేయాలి
రోజులోని 24 గంటల- నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎప్పుడు చెత్త వేసినా అందుకు కారకులైన వారికి జరిమానా విధిస్తారు
ఇవీ చెత్తర హిత మార్గాలు..
బంజారాహిల్స్ రోడ్‌నెంబరు 1: మాసాబ్‌ట్యాంక్ ప్యారడైజ్ హోటల్ నుంచి జీవీకే మాల్ మీదుగా నాగార్జున సర్కిల్ వరకు.
బంజారాహిల్స్ రోడ్ నెంబరు 2: నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డునెంబరు 2, టీవీ 9 కార్యాలయం, ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చె క్‌పోస్టు వరకు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12: కళింగ ఫంక్షన్ హాల్ నుంచి ఇన్‌కంట్యాక్స్ క్వార్టర్స్ మీదుగా పెన్షన్ ఆఫీసు వరకు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పెద్దమ్మగుడి మీదుగా మాదాపూర్ ఠాణా వరకు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 92: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి సీవీఆర్ న్యూస్, బాలకృష్ణ ఇంటి మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు.
ఖైరతాబాద్ ప్రధాన రహదారి: ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ రోడ్డు, సోమాజిగూడ రోడ్డు, సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా బేగంపేట ఫ్లైఓవర్ వరకు.
బేగంపేట రోడ్: బేగంపేట ఫ్లైఓవర్ నుంచి గ్రీన్‌లాండ్స్ గెస్ట్‌హౌస్, పంజగుట్ట న్యూ ఫ్లైఓవర్ మీదుగా జీవీకే మాల్ వరకు.
సచివాలయం రోడ్: ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ విగ్రహం, రవీంద్రభారతి మీదుగా అసెంబ్లీ వరకు.
ఈ మార్గాల్లో రోడ్డుకు రెండు వైపులా నిబంధనలు అమలు చేస్తారు.