- ఆయా విభాగాల అధికారులతో కలిసి పర్యటనలు
- సంక్రాంతి తర్వాత ఏర్పాటు
- బల్దియా కమిషనర్ సోమేశ్ వెల్లడి
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ఏదైనా సమస్య ఏర్పడితే అది మా పరిధి కాదంటే..కాదని చెప్పి చేతులు దులుపుకుంటారు. అందర్నీ సమన్వయం చేసి సదరు సమస్యను పరిష్కరించాలంటే ఉన్నతాధికారులకు తలనొప్పవుతోంది. ఇక నుంచి ఆ సమస్య రాకుండా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆయా విభాగాల అధికారులతో కలిసి ‘సమన్వయకమిటీ’ పర్యటనలు చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి గతంలో ఎంసీహెచ్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ విధానం ఉండేది. తిరిగి దాన్ని అమలు చేసేందుకు సోమేశ్‌కుమార్ సిద్ధమయ్యారు. నెలకోమారు ఈ కమిటీ నగరంలో పర్యటించి.. దృష్టికొచ్చిన సమస్యలను పరిష్కరిస్తుందని కమిషనర్ చెప్పారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ..జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఏపీసీపీడీసీఎల్, హెచ్‌ఎంఆర్, తదితర విభాగాల అధికారులు ఈ సమన్వయకమిటీలో ఉంటారని చెప్పారు. సంక్రాంతి తర్వాత ఈ కమిటీ ఏర్పాటు కానుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో డక్టింగ్: మెట్టుగూడ-నాగోలు మార్గంలో 8 కి.మీ.ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారి, డక్టింగ్ తదితర పనులు చేయనున్నట్లు చెప్పారు. దశలవారీగా నగరంలో ఎంపిక చేసిన మార్గాల్లో ఈ పనులు చేస్తారు. వీటి వ్యయం రూ. 310 కోట్లు. కాగా, హెచ్‌ఎంఆర్ మార్గాల్లో తనవంతు వాటాగా రూ.65 కోట్లు చెల్లిస్తుంది.
ఎక్స్‌ప్రెస్‌వేకు సొబగులు: పీవీఎఎక్స్‌ప్రెస్‌వే పై గ్రీనరీతో సుందరీకరణ పనులు చేయనున్నా రు. ఇందులో భాగంగా సెంట్ర ల్ మీడియన్‌లో డ్రిప్ ఇరిగేషన్‌తో గ్రీనరీ నిర్వహణ, వెయ్యి పూలకుండీలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వంద కుండీలు ఏర్పాటు చేశారు.
మొండి బకాయిల వసూళ్లకు: ఆస్తిపన్ను మొండిబకాయిల వసూళ్ల కోసం చట్టం మేరకు చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. సర్కిల్ వారీగా టాప్ 100 బకాయిదారులపై తొలుత చర్యలు తీసుకుంటారు. వాహనాలు, దుకాణాల సీజ్ తదితర చర్యలు తీసుకుంటారు. అక్రమ నిర్మాణాల నుంచి కూడా ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఆస్తిపన్ను వసూలు చేసినంత మాత్రాన అక్రమ నిర్మాణాలపై యాజమాన్యహక్కులు రావని కమిషనర్ స్పష్టం చేశారు. కోర్టు వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
రోడ్లకు నిధులు ఇస్తాం..: రహదారుల పనుల కోసం విధివిధానాలు రూపొందించారు. ప్రస్తు తం డివిజన్‌కు రూ.50 లక్షల వంతున కేటాయించారు. అవసరాన్ని బట్టి ఒక్కో డివిజన్‌కు మరో ఐదారుకోట్ల వరకు మంజూరు చేసేం దుకు సైతం అభ్యంతరం లేదని సోమేశ్‌కుమా ర్ తెలిపారు.అలాగే..పారిశుధ్య కార్యక్రమాల్లోనూ ఎక్కడినుంచి ఎవరు పనిచేయాలో వివరాలు కూడా ఉన్నాయని, వీటిని స్థానిక కార్పొరేటర్లకు అందజేసే ఆలోచన ఉందన్నారు. ఆ మార్గంలో పనులు చేయాల్సిన వారి పేర్లను విద్యుత్‌స్తంభాలపై రాసే యోచన కూడా ఉందని చెప్పారు.