రసవత్తరం
జీహెచ్‌ఎంసీ పాలక మండలి తొలి సమావేశం
మేయర్ రామ్మోహన్ సంయమనం
మాజీ మేయర్ మాజిద్ ప్రశ్నల పరంపర
పాత.. కొత్తల మేలు కలయిక
సిటీబ్యూరో: కొందరు అనుభవాన్ని రంగరించి ప్రశ్నించడం... అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూడడం.. మరికొందరు అనుభవ రాహిత్యంతో తమకు తోచినట్టు మాట్లాడడం... మేయర్ సర్దుబాటు ధోరణిలో ముందుకెళ్లడం... మొత్తమ్మీద జీహెచ్‌ఎంసీ పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. రెండు, మూడు పర్యాయాలు గెలిచినవారు.. తొలిసారిగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాత, కొత్తల సమ్మిళితంగా కనిపించింది. అధ్యక్షత వహించిన మేయర్ బొంతు రామ్మోహన్ కాస్త తడబాటుకు గురైనా.. వడివడిగా సభను నడిపించడంలో సఫలీకృతులయ్యారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన సమావేశం ఏకదాటిగా దాదాపు మూడు గంటల పాటు నడిచింది. మాజీ మేయర్, ప్రస్తుత కార్పొరేటర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ తన అనుభవాన్ని రంగరించి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. కొత్త కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు అనుభవజ్ఞులతో సమానంగా తమ వాణి వినిపించారు. తాగునీటి సమస్యలు సహా వివిధ అంశాలను లేవనెత్తారు. ఎక్కువ మంది స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ప్రారంభించిన ఆటోట్రాలీలపై స్పందించారు. కొత్త ఆటో ట్రాలీలతో పాటు అవసరమైనన్ని డంపర్‌బిన్లు అందుబాటులోకి తేవాలని... కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
మొత్తానికి కొత్త మేయర్.. కొత్త కమిషనర్ (జనార్దన్‌రెడ్డి వచ్చాక జరిగిన పాలక మండలి తొలి సమావేశం ఇదే) కొత్త కార్పొరేటర్లతో వింతైన వాతావరణం నెలకొంది. ప్రశ్నల పరంపర... మేయర్ పోడియం వద్దకు చేరుకోవడం.. ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అధికారుల తీరును మాజిద్ హుస్సేన్ ఆక్షేపిస్తుండగా... ‘మీరు సీనియర్.. ఇదేనా డిసిప్లిన్..’ అంటూ మేయర్ వారించే ప్రయత్నం చేశారు. సభ నిర్వహణలో అనుభవ రాహిత్యం కనిపించినప్పటికీ.. వ్యవధిలోగా ముగించడంతో కృతకృత్యులయ్యారు. చాలా మంది సభ్యులు కొత్త వారు కావడంతో ఓ వైపు పోడియం వద్ద గొడవ జరుగుతుండగానే.. మరోవైపు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడటంతో ఓ దశలో గందరగోళం చోటుచేసుకుంది. సందర్భం లేకుండా ‘జై తెలంగాణ’ నినాదాలూ వినిపించాయి. ఓ వైపు ఎంఐఎం బృందం పోడియంను చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నా... మరోవైపు తమంత తాముగా ప్రసంగం చదువుకుంటూ పోయిన వారూ కనిపించారు. అజెండాలో మొత్తం 9 అంశాలు పొందుపరచగా... ఏడింటిపైనే చర్చించారు. అంతకుముందు మేయర్, డిప్యూటీ మేయర్లకు టీఆర్‌ఎస్ నాయకుడు బంగారు ప్రకాశ్ అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు.