jihecensi
-
అధికారుల తనిఖీ...పలు హోటళ్లకు జరిమానా
► నగరంలోని హోటళ్లలో జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీలు ► పలు హోటళ్లకు జరిమానా విధించారు హైదరాబాద్: నగరంలోని హోటళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు రెండవరోజు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు జరిమానా విధించారు. అపరిశుభ్రంగా ఉన్నందుకు, ప్రభుత్వ అనుమతిలేని మాంసాన్ని ఉపయోగించినందుకు గాను బంజారాహిల్సెలోని ఆన్ ఓహిరీస్ హోటల్ యాజమాన్యానికి రూ.5వేలు జరిమానా విధించారు. షాపూర్‌నగర్‌లోని సాగర్ రెస్టారెంట్లో అనధికార కబేళాల నుంచి తీసుకొచ్చిన మాంసం ఉపయోగించడంతో ఆ హోటల్‌ను మూసివేశారు. నల్గొండ క్రాస్ రోడ్డులోని సోహెల్ హోటల్లో అనుమతిలేని మాంసం ఉపయోగిస్తున్నందుకు రూ.40వేల జరిమానా విధించారు. అలాగే ఆర్టిసీ క్రాస్‌రోడ్స్‌లోని అస్టోరియా హోటల్‌కు రూ. 20వేల జరిమానా విధించారు. సికింద్రాబాద్ ఎస్.డి రోడ్‌లోని మినర్వాగ్రాండ్ హోటల్ అండ్ రెస్టారెంట్‌కు రూ. 10వేలు జరిమానా విధించారు. గచ్చిబౌలిలోని అల్షబా హోటల్లో జీహెచ్ఎంసీ అధికార ముద్రలేని మాంసాన్ని వినియోగిస్తున్నందున రూ. 20వేలు జరిమానా విధించారు. గచ్చిబౌలిలోని డ్రంక్‌యార్డ్ శివాని రెస్టారెంట్ బార్‌కు రూ. 10వేలు జరిమానా విధించారు. -
ఐదంతస్తుల అక్రమకట్టడం కూల్చివేత
అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా గ్రేటర్ అధికారులు ఐదంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు. టోలిచౌకి ప్రాంతం బృందావన్ కాలనీలో ఒక ఐదంతస్తుల భవనాన్ని ఆక్రమిత స్థలంలో నిర్మించినట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి జేసీబీలతో చేరుకున్నారు. ఆ భవనాన్ని నేలమట్టం చేయటంపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని, అధికారులతో వాగ్వాదానికి దిగారు. భవనం కూల్చివేతను ఆపాలని గట్టిగా కోరారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే, అధికారులు ససేమిరా మాట వినకపోవటంతో అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. సిబ్బంది కూల్చివేతను కొనసాగిస్తున్నారు. -
రసవత్తరం
జీహెచ్ఎంసీ పాలక మండలి తొలి సమావేశం మేయర్ రామ్మోహన్ సంయమనం మాజీ మేయర్ మాజిద్ ప్రశ్నల పరంపర పాత.. కొత్తల మేలు కలయిక సిటీబ్యూరో: కొందరు అనుభవాన్ని రంగరించి ప్రశ్నించడం... అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూడడం.. మరికొందరు అనుభవ రాహిత్యంతో తమకు తోచినట్టు మాట్లాడడం... మేయర్ సర్దుబాటు ధోరణిలో ముందుకెళ్లడం... మొత్తమ్మీద జీహెచ్ఎంసీ పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశం రసవత్తరంగా సాగింది. రెండు, మూడు పర్యాయాలు గెలిచినవారు.. తొలిసారిగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాత, కొత్తల సమ్మిళితంగా కనిపించింది. అధ్యక్షత వహించిన మేయర్ బొంతు రామ్మోహన్ కాస్త తడబాటుకు గురైనా.. వడివడిగా సభను నడిపించడంలో సఫలీకృతులయ్యారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన సమావేశం ఏకదాటిగా దాదాపు మూడు గంటల పాటు నడిచింది. మాజీ మేయర్, ప్రస్తుత కార్పొరేటర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ తన అనుభవాన్ని రంగరించి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశారు. కొత్త కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు అనుభవజ్ఞులతో సమానంగా తమ వాణి వినిపించారు. తాగునీటి సమస్యలు సహా వివిధ అంశాలను లేవనెత్తారు. ఎక్కువ మంది స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ప్రారంభించిన ఆటోట్రాలీలపై స్పందించారు. కొత్త ఆటో ట్రాలీలతో పాటు అవసరమైనన్ని డంపర్బిన్లు అందుబాటులోకి తేవాలని... కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు. మొత్తానికి కొత్త మేయర్.. కొత్త కమిషనర్ (జనార్దన్‌రెడ్డి వచ్చాక జరిగిన పాలక మండలి తొలి సమావేశం ఇదే) కొత్త కార్పొరేటర్లతో వింతైన వాతావరణం నెలకొంది. ప్రశ్నల పరంపర... మేయర్ పోడియం వద్దకు చేరుకోవడం.. ప్రతిపక్షం, అధికార పక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. అధికారుల తీరును మాజిద్ హుస్సేన్ ఆక్షేపిస్తుండగా... ‘మీరు సీనియర్.. ఇదేనా డిసిప్లిన్..’ అంటూ మేయర్ వారించే ప్రయత్నం చేశారు. సభ నిర్వహణలో అనుభవ రాహిత్యం కనిపించినప్పటికీ.. వ్యవధిలోగా ముగించడంతో కృతకృత్యులయ్యారు. చాలా మంది సభ్యులు కొత్త వారు కావడంతో ఓ వైపు పోడియం వద్ద గొడవ జరుగుతుండగానే.. మరోవైపు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడటంతో ఓ దశలో గందరగోళం చోటుచేసుకుంది. సందర్భం లేకుండా ‘జై తెలంగాణ’ నినాదాలూ వినిపించాయి. ఓ వైపు ఎంఐఎం బృందం పోడియంను చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నా... మరోవైపు తమంత తాముగా ప్రసంగం చదువుకుంటూ పోయిన వారూ కనిపించారు. అజెండాలో మొత్తం 9 అంశాలు పొందుపరచగా... ఏడింటిపైనే చర్చించారు. అంతకుముందు మేయర్, డిప్యూటీ మేయర్లకు టీఆర్ఎస్ నాయకుడు బంగారు ప్రకాశ్ అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. -
‘స్పెషల్’ ఆఫీసర్
సోమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి సిటీబ్యూరో: సోమేశ్ కుమార్... జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్. అనుకున్న పనులు చేయడంలోనూ.. విమర్శలు ఎదుర్కోవడంలోనూ స్పెషలే. కమిషనర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న ఆయన స్పెషలాఫీసర్గానూ జీహెచ్ఎంసీ పాలనాపగ్గాలు చేపట్టి పది నెలలు దాటింది. రెండు హోదాల్లోనూ ‘అద్భుతాలు’ చేయాలని తలపోస్తున్నారు. రూ. 5కే భోజనం నుంచి ‘ఆకాశమార్గాల’ దాకా భారీ కలలతో వివిధ పథకాలకు రూపకల్పన చేశారు. అన్నింటినీ ఏకకాలంలో పూర్తి చేయాలని ఆరాట పడుతున్నారు. అనుకున్నదే తడవుగా పూర్తి కావాలని ఆదేశిస్తుండటంతో అధికారుల్లో ‘వణుకు’ ఎక్కువవుతోంది. ఫలితంగా పనులు తడబడుతున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా... తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను ఏడాదిలోనే పూర్తిచేసి అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు కొన్ని రాజకీయ పక్షాలు ఆటంకాలు కల్పిస్తున్నా.. టీఆర్ఎస్ కార్యకర్త అని విమర్శలు గుప్పిస్తున్నా... దేనికీ వెనుకాడటం లేదు. క్యాడర్ కేటాయింపులపై ఓవైపు క్యాట్‌లో కేసు నడుస్తున్నప్పటికీ.. తన మానాన పని చేసుకుపోతున్నారు. రెండేళ్లలో వందకు పైగా ప్రకటనలు చేసినప్పటికీ పట్టుమని పది కూడా పూర్తికాకపోవడంతో విమర్శలు తప్పడం లేదు. పగలూ రాత్రీ తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ... పని రాక్షసుడనే ముద్రతోముందుకు సాగుతున్న సోమేశ్ కుమార్ పథకాలు.. పనుల్లో కొన్నింటిని అవలోకిస్తే.. ఇదీ పనుల తీరు ఎస్సార్డీపీ రూ.24 వేల కోట్లకు పైగా విలువైన పనులు. యాన్యుటీ విధానంలో పిలిచిన టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంతో తొందరగా మొదలు పెట్టాలనుకున్నా జాప్యం తప్పలేదు. ఈపీసీ పద్ధతిలో తిరిగి టెండర్లు పిలిచారు. ఈ-ఆఫీస్ ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా, పనుల్లో పారదర్శకతకు ఉద్దేశించినది. వీలైనంత త్వరితంగా అమలులోకి తెచ్చారు. టౌన్‌ప్లానింగ్‌లో పెండింగ్ తగ్గినప్పటికీ... ముడుపులు మాత్రం ఆగలేదు. ఆర్ఓ ప్లాంట్లు మురికివాడల పేదలకు శుద్ధ జలం అందించేందుకు ఈ ప్లాంట్లు 1500 ఏర్పాటు చేయాలనుకున్నారు. తొలిదశలో అందుబాటులోకి తేవాలనుకున్నవి సైతం సీఎం హామీతో మహబూబ్‌నగర్‌కు పంపాల్సి వచ్చింది. దాంతో పట్టుమని పది కూడా ఏర్పాటు కాలేదు. డ్రైవర్ కమ్ ఓనర్ సత్ఫలితమిచ్చిన స్కీమ్. తొలి రెండు దశల్లో 408 మందికి ఉపాధి లభించింది. మొత్తం 5వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నప్పటికీ, మలిదశల్లో జాప్యం జరుగుతోంది. ఆటో టిప్పర్లు చెత్త రవాణా కోసం నిరుద్యోగులకు 2,500 టిప్పర్లు అందించాలనుకున్నారు. వీరిలో దాదాపు 94 శాతం మంది తమవంతు వాటాలు చెల్లించి ముందుకొచ్చారంటే వారి నమ్మకం అర్థం చేసుకోవచ్చు. ఇంటింటికీ చెత్తడబ్బాలు సీఎం హామీ నేపథ్యంలో చెత్త తరలింపునకు ఇంటింటికీ రెండు రంగు డబ్బాలు అందించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. 45 లక్షల చెత్తడబ్బాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్వయం సహాయక మహిళా సంఘాల ఉపాధికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలనుకున్నప్పటికీ రూ.వంద కోట్లు కూడా ఇవ్వలేకపోయారు.ఈ-లైబ్రరీలు, జిమ్‌లు, మోడల్ మార్కెట్లు, బస్‌బేలు, బస్షెల్టర్లు, మల్టిపుల్ ఫంక్షన్ హాళ్లు, ఎఫ్ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ పనులు పూర్తి కాలేదు. మిగతా ప్రభుత్వ విభాగాలు శ్రద్ధ చూపకపోవడంతో పనులు కదల్లేదు. జీహెచ్‌ఎంసీవి దాదాపు 25 శాతం పూర్తయ్యాయి. గతంలో మాటలకే పరిమితమైన వైట్‌టాపింగ్ పనులు కార్యరూపం దాల్చాయి. త్వరలో మరిన్ని మార్గాల్లో రానున్నాయి. రూ. 5కే భోజనం అద్భుత విజయం సాధించింది. దాదాపు 50 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.ఇంటి నెంబర్లు, గౌరవ సదన్లు వంటివి అందుబాటులోకి రాలేదు. బతుకమ్మ ఘాట్, బతుకమ్మల నిమజ్జనాలకు మంచినీటి కొలను వంటి పనులు శీఘ్రంగా జరిగాయి. ‘మహాప్రస్థానం’ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వర్షాకాలం ముగిసిపోయినా ‘హరితహారం’ ప్రారంభం కాలేదు. సేవలపైనే పూర్తి దృష్టి అందరి సహకారంతోనే పథకాలు విజయవంతం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సిటీబ్యూరో: ప్రజలకు సకాలంలో సేవలందితే అవినీతి క్రమేపీ తగ్గుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. గడచిన రెండేళ్లలో చేపట్టిన రూ.5కే భోజనం, డ్రైవర్‌కమ్ ఓనర్, ఎస్సార్డీపీ పథకాలు వేటికవే ప్రత్యేకత కలిగినవని చెప్పారు. వివిధ కారణాలతో కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోంద న్నారు. దీనికి నిరుత్సాహపడాల్సిన పని లేదన్నారు. ప్రజలు, సిబ్బంది, ఇతరత్రా అందరి సహకారం వల్లే ఎన్నో పనులు చేయగలిగామన్నారు. ప్రజలకు మెరుగైనే సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. ‘ఎన్ని చేసినా అవినీతి తగ్గలేదన్న’ ప్రశ్నకు బదులిస్తూ... సకాలంలో పనులు జరిగితే అది కూడా క్రమేపీ సాధ్యమవుతుంద ని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రవేశపెట్టిన ఈ-ఆఫీస్ వల్ల టౌన్‌ప్లానింగ్‌లో పెండింగ్ దరఖాస్తులు తగ్గాయన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో నిర్మాణాలకు అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. త్వరలో అది అమలు చేస్తామన్నారు. ఏటా వెయ్యి కిలోమీటర్ల వంతున వైట్‌టాపింగ్ రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అవి అందుబాటులోకి వస్తే రహదారుల మరమ్మతుల పేరిట నిధుల ఖర్చు, అవినీతి తగ్గుతుంద ని ఆయన అభిప్రాయపడ్డారు. మేమే పనులు చేస్తాం తాము ఎంతగా రహదారుల పనులు చేస్తున్నప్పటికీ... కొన్ని మార్గాల్లో అప్రదిష్ట వస్తోందని కమిషనర్ చెప్పారు. మెట్రో రైలు మార్గాల్లోనూ తామే పనులు పూర్తి చేసి, వాటి బిల్లులు మెట్ర రైలు వర్గాలకు అందజేస్తామని ‘సాక్షి’కి తెలిపారు. అన్ని పనుల్లోనూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యం పెంచుతామన్నారు. రహదారి మరమ్మతుల నుంచి చెత్త తరలింపు పనుల వరకు వారే చేస్తామని ముందుకొస్తే.. అప్పగిస్తామని తెలిపారు. దీనిపై సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులందరితో సోమవారం నుంచి సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే ఆటో ట్రాలీల నిర్వహణకు సంఘాలు ముందుకొస్తే వారికే కేటాయిస్తామని తెలిపారు. రూపాయికే టిఫిన్? రూ.5కే భోజన పథకానికి మంచి స్పందన వస్తున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోఒక రూపాయికే టిఫిన్ అందజేసే కార్యక్రమం అమలు చేయాలని కమిషనర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
చెత్త వాహనాల డ్రైవర్లకూ ఓనర్లయ్యే యోగం
డ్రైవర్ కమ్ ఓనర్ తరహా మరో పథకానికి జీహెచ్ఎంసీ కసరత్తు బ్యాంకు రుణం ద్వారా భారీ వాహనాలను సమకూర్చే సదుపాయం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చెత్త తరలించే వాహనాలను నడుపుతున్న ప్రైవేట్ వాహనాల డ్రైవర్లనే సదరు వాహనాల యజమానులుగా చేసే మరో కొత్త కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుడుతోంది. డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం తెల్సిందే. 105 మందికి బ్యాంకు రుణాలు ఇప్పించి కారు ఓనర్లను చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే తరహాలో జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాల డ్రైవర్లనూ ఓనర్లను చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా భారీ వాహనాలను(5 టన్నులు, 10 టన్నులు, 25 టన్నుల సామర్థ్యం కలిగిన) సైతం బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించనున్నారు. సదరు వాహనాలను జీహెచ్ఎంసీ సేవలకే వినియోగిస్తారు. వారికి చెల్లించే అద్దె చార్జీల నుంచే బ్యాంకు రుణవాయిదాలు చెల్లిస్తారు. తద్వారా చెత్త తరలింపు వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తున్న వారే జీవితాంతం ప్రైవేటు యజమానుల వద్ద పనిచేయకుండా వారే ఓనర్‌గా మారుతారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. 141 అద్దె వాహనాల ద్వారా చెత్త తరలింపు.. జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ వెలువడే 3,800 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు, ఇతరత్రా అవసరాలకు మొత్తం 914 వాహనాలను వినియోగిస్తున్నారు. ఇందులో 773 వాహనాలు జీహెచ్‌ఎంసీవి కాగా మిగతా 141 వాహనాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. సదరు వాహనాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్న వారికి కొత్తగా చేపడుతున్న పథకం ద్వారా ప్రయోజనం కలుగనుంది. డ్రైవింగ్ లెసైన్సు తదితర అర్హతలుండి సదరు వాహనాలను నడపగల ఇతరులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండో దశలో 250 మందికి సొంతకార్లు.. డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ద్వారా తొలిదశలో 105 మంది బ్యాంక్ ద్వారా రుణసదుపాయం కల్పించిన విషయం తెల్సిందే. రెండో దశలో మరో 250 మందికి ఈ అవకాశం లభించనుంది. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కమిషనర్ సోమేశ్‌కుమార్ గురువారం సంతకం చేశారు. ఈసారి కార్లు పొందేవారు జీహెచ్ఎంసీకి మాత్రమే కాకుండా ఇతర క్యాబ్ సర్వీసులకు సైతం తమ కార్లను నడపవచ్చు. కాగా వాటి డ్రైవర్లుగా మాత్రం వారే ఉండాలి. బ్యాంకు రుణాలు పొందేందుకు తగిన గ్యారంటీనిచ్చే క్యాబ్ సర్వీసులకు ఈ కార్లను వినియోగించనున్నారు. గ్రీన్క్యాబ్, టాక్సీ ఫర్ ష్యూర్, మెరు, సిటీట్యాక్సీ తదితర క్యాబ్స్ నిర్వాహకులతో జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఈ పథకం కింద మారుతీ స్విఫ్ట్‌డిజైర్ కారును రుణంపై అందించనున్నారు. లబ్ధిదారు తనవంతు వాటాగా రూ.1.38 లక్షలు చెల్లించాలి. వాహన ధర రూ.7.05 లక్షలుగా కాగా, మారుతీ సంస్థ రూ.67 వేలు రాయితీ ఇస్తుంది. రూ.5 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తారు. నెలకు రూ.10,500 వంతున ఆరేళ్లపాటు ఈఎంఐ చెల్లించాలి. ఎస్సీలు, మైనార్టీలకు ఆయా సంస్థల నుంచి గ్రాంట్స్ లభిస్తాయి. ఈ కార్లను అధికారుల ప్రయాణానికి వాడుకుంటే జీహెచ్ఎంసీ నెలకు రూ.25 వేలు అద్దెగా చెల్లిస్తోంది. ఈ మొత్తం సరిపోవడం లేదని డ్రైవర్లనుంచి వస్తున్న విజ్ఞప్తులపై అధికారులు సానుకూలంగా స్పందించి ఆ అద్దె మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
రూ. 134 కోట్లతో భారీ కాంప్లెక్స్
జీహెచ్ఎంసీ సన్నాహాలు చిలకలగూడలో నిర్మాణానికి యోచన ప్రతిపాదనలు సిద్ధం వచ్చేవారం స్టాండింగ్ కమిటీ ముందుకు.. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో భారీ కాంప్లెక్స్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్, హబ్సిగూడ, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మొత్తం 18 కాంప్లెక్స్‌లలో 600కు పైగా యూనిట్లు ఉన్నాయి. వీటన్నింటినీ తలదన్నేలా రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మరో నాలుగంతస్తుల్లో భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని అంచనా వ్యయం రూ.134 కోట్లు. వచ్చేవారం జరుగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందాక ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడలో కూల్చివేసిన జీహెచ్ఎంసీ పాత షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలోనే కొత్తది నిర్మించనున్నారు. దీనిని జీహెచ్ఎంసీ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు మిగతా యూనిట్లను వివిధ సంస్థలు లేదా దుకాణాలకు అద్దెకుఇవ్వనున్నారు. ఇందులో ఒక అంతస్తును జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వినియోగించుకొని, మిగతా వాటిని అద్దెకివ్వాలనేది ప్రస్తుత ఆలోచన. భవిష్యత్‌లో మార్పు చేర్పులకు వీలుంది. మొత్తం భవనాన్ని జీహెచ్ఎంసీయే వినియోగించుకోవడమా లేక అద్దెకివ్వడమా అనేది అప్పటి అవసరాలను బట్టి నిర్ణయిస్తారు. అమలు ఎప్పటికో? ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ అవసరాలకు కొత్త ఆఫీస్ కమ్ కౌన్సిల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని సుమారు రెండేళ్ల క్రితం నిర్ణయించారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టగా, స్టాండింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ ఆమోదం కూడా లభించాయి. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద సన్నాహాలు చేయగా, ఆటంకాలు ఎదురయ్యాయి. భవన నిర్మాణానికి వీలుగా అక్కడి చెత్త ట్రాన్స్ఫర్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంది. అందుకు వేరే ప్రదేశం కనిపించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ కాంప్లెక్స్ అవసరాలకు సరిపడా లేదని, జనరల్ కౌన్సిల్ సమావేశాల కోసం తగిన కౌన్సిల్ హాల్ కూడా లేనందున రెండింటి అవసరాలు తీరేలా కొత్త ఆఫీస్ కమ్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఏడంతస్తుల్లో నిర్మించాలని భావించారు. అదీ అమలుకు నోచలేదు. ఈ నేపథ్యంలో రూ. 134 కోట్ల వ్యయమయ్యే కొత్త భవనం నిర్మాణం కూడా ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఖర్చు ఘనం.. చెత్త పదిలం!
రూ.కోట్లలో నిధులు వృథా ఎక్కడి చెత్త అక్కడే అధ్వానంగా పారిశుద్ధ్యం వానొస్తే చిత్తడి పొంచి ఉన్న వ్యాధులు ఇదీ గ్రేటర్ తీరు సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు...వ్యర్థాలతో నిండిపోయినా ఖాళీ కాని డంపర్ బిన్లు... మురికి గుంటలు...వాటిలో కుటుంబాలతో నివాసం ఉండే దోమలు... ఆస్పత్రుల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులు...ఇదీ గ్రేటర్ చిత్రం. వ్యాధులు రాకుండా ఆదిలోనే అరికట్టేందుకు.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్య నిపుణులను సైతం పారిశుద్ధ్య సేవల్లో వినియోగిస్తున్నారు. అదీ ఫలితమివ్వడం లేదు. అదే వైద్యులను ఆస్పత్రుల్లో నియమిస్తే అక్కడైనా సక్రమంగా సేవలందే అవకాశం ఉంటుందనే విమర్శలు ఎదుర్కోవడం తప్పితే ఉపయోగం ఉండడం లేదు. అదనపు సిబ్బందిని నియమిస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు. కొన్ని కార్పొరేషన్ల వార్షిక బడ్జెట్ కంటే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న ఖర్చే ఎక్కువ. ఏటా దాదాపు రూ.300 కోట్లు పారిశుద్ధ్యానికి వెచ్చిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కారణాలెన్నో... అడుగడుగునా అవినీతి.. లెక్కలు, రికార్డుల్లో తప్ప, క్షేత్ర స్థాయిలో కనిపించని సిబ్బంది. కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు.. వాహనాల అదనపు ట్రిప్పులు. కొందరు అధికారులు.. మరికొందరు కార్పొరేటర్ల సొంతలాభం .. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్యం క్షీణించడానికీ ఎన్నో కారణాలు. దీన్ని చక్కదిద్దేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కడదాకా సాగడం లేదు. ఇటీవల కొన్ని మార్గాల్లో పారిశుద్ధ్యం బాధ్యతను ప్రైవేటు కాంట్రాక్టర్లకు క ట్టబెట్టారు. అయినా ఏ మార్పూ కనిపించడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణలో ఖర్చులు పరిశీలిస్తే... ఇది ఇళ్ల నుంచి వచ్చే చెత్తను వేసేందుకు అవసరమైన డంపర్బిన్ల కోసం చేసిన ఖర్చు. ఇవి కాక ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించేందుకు 5,638 రిక్షాలు ఉన్నాయి. వీటిలో 2691 రిక్షాలు మరమ్మతుల్లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం వార్డుల్లోని చెత్తను తరలించేందుకు 3000 రిక్షాలను కార్పొరేటర్లకు ఇచ్చారు. త్వరలో మరో 1500 రిక్షాలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ వాహనాలు.. డంప్ బిన్ల నుంచి చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డులకు తరలించేందుకు మొత్తం 564 వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిలో 458 జీహెచ్‌ఎంసీవి కాగా, మరో 106 అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. ఇంకో 44 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. ధరలో తేడా రావడంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. ఇవి కాక సీజన్ల వారీగా తీసుకునే అదనపు వాహనాలు.. అదనపు సిబ్బంది.. స్పెషల్ డ్రైవ్‌ల పేరిట అదనపు పనులు, ఇతరత్రా పనుల పేరిట వెరసి ఏటా దాదాపు రూ. 300 కోట్లు పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తరలింపు తదితరాలకు ఖర్చు చేస్తున్నారు. వీఐపీలకే ప్రాధాన్యం గ్రేటర్లో మొత్తం 6411 కి.మీ.ల మేర రహదారులు ఉన్నప్పటికీ, వీఐపీలు ఉండే మార్గాలు..వారు ప్రయాణించే రహదారులు. ప్రధాన రహదారుల్లో మాత్రమే పారిశుద్ధ్య పనులు సవ్యంగా చేస్తున్నారు. మిగతా ప్రాంతాలను గాలికి వదిలేస్తున్నారు. వీఐపీలు ఉండేవి, ప్రధాన రహదారులు కలిపి దాదాపు 2 వేల కి.మీ. ఉన్నాయి. పారిశుద్ధ్య పనులకు దిగువ స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఉన్నారు. కార్మికుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే శానిటరీ సూపర్వైజర్ల నుంచి మొదలు పెడితే.. శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్), డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు పని చేస్తున్నారు. కార్మికులు దాదాపు 18 వేల మంది ఉండగా, శానిటరీ సూపర్వైజర్లు వేయిమంది ఉన్నారు. 18 మంది డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు జోనల్ కమిషనర్లు ఉన్నారు. పొంచి ఉన్న వ్యాధులు వర్షాకాలంలో వ్యర్థాలు త్వరితంగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీన్ని చక్కదిద్దేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లంటూ లేవు. దీంతో వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధిచెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. నగరంలో ఈ ఏడాది ఇంకా గట్టి వర్షాలే కురియలేదు. అయినప్పటికీ అనేక సర్కిళ్లలో ఇప్పటికే మలేరియా, డెంగీ వంటి కేసులు గుర్తించారు. మలక్‌పేట, చార్మినార్, కార్వాన్, హిమాయత్‌నర్, ఆబిడ్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ సర్కిళ్లలో 73 మలేరియా కేసులు, ఆబిడ్స్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే రోగాలు ప్రబలే ఆస్కారం ఉంది.