‘స్పెషల్’ ఆఫీసర్
సోమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి
సిటీబ్యూరో: సోమేశ్ కుమార్... జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్. అనుకున్న పనులు చేయడంలోనూ.. విమర్శలు ఎదుర్కోవడంలోనూ స్పెషలే. కమిషనర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న ఆయన స్పెషలాఫీసర్‌గానూ జీహెచ్‌ఎంసీ పాలనాపగ్గాలు చేపట్టి పది నెలలు దాటింది. రెండు హోదాల్లోనూ ‘అద్భుతాలు’ చేయాలని తలపోస్తున్నారు. రూ. 5కే భోజనం నుంచి ‘ఆకాశమార్గాల’ దాకా భారీ కలలతో వివిధ పథకాలకు రూపకల్పన చేశారు. అన్నింటినీ ఏకకాలంలో పూర్తి చేయాలని ఆరాట పడుతున్నారు. అనుకున్నదే తడవుగా పూర్తి కావాలని ఆదేశిస్తుండటంతో అధికారుల్లో ‘వణుకు’ ఎక్కువవుతోంది. ఫలితంగా పనులు తడబడుతున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా... తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను ఏడాదిలోనే పూర్తిచేసి అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు కొన్ని రాజకీయ పక్షాలు ఆటంకాలు కల్పిస్తున్నా.. టీఆర్‌ఎస్ కార్యకర్త అని విమర్శలు గుప్పిస్తున్నా... దేనికీ వెనుకాడటం లేదు. క్యాడర్ కేటాయింపులపై ఓవైపు క్యాట్‌లో కేసు నడుస్తున్నప్పటికీ.. తన మానాన పని చేసుకుపోతున్నారు. రెండేళ్లలో వందకు పైగా ప్రకటనలు చేసినప్పటికీ పట్టుమని పది కూడా పూర్తికాకపోవడంతో విమర్శలు తప్పడం లేదు. పగలూ రాత్రీ తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ... పని రాక్షసుడనే ముద్రతోముందుకు సాగుతున్న సోమేశ్ కుమార్ పథకాలు.. పనుల్లో కొన్నింటిని అవలోకిస్తే.. ఇదీ పనుల తీరు
ఎస్సార్‌డీపీ
రూ.24 వేల కోట్లకు పైగా విలువైన పనులు. యాన్యుటీ విధానంలో పిలిచిన టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంతో తొందరగా మొదలు పెట్టాలనుకున్నా జాప్యం తప్పలేదు. ఈపీసీ పద్ధతిలో తిరిగి టెండర్లు పిలిచారు.
ఈ-ఆఫీస్
ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా, పనుల్లో పారదర్శకతకు ఉద్దేశించినది. వీలైనంత త్వరితంగా అమలులోకి తెచ్చారు. టౌన్‌ప్లానింగ్‌లో పెండింగ్ తగ్గినప్పటికీ... ముడుపులు మాత్రం ఆగలేదు.
ఆర్‌ఓ ప్లాంట్లు
మురికివాడల పేదలకు శుద్ధ జలం అందించేందుకు ఈ ప్లాంట్లు 1500 ఏర్పాటు చేయాలనుకున్నారు. తొలిదశలో అందుబాటులోకి తేవాలనుకున్నవి సైతం సీఎం హామీతో మహబూబ్‌నగర్‌కు పంపాల్సి వచ్చింది. దాంతో పట్టుమని పది కూడా ఏర్పాటు కాలేదు.
డ్రైవర్ కమ్ ఓనర్
సత్ఫలితమిచ్చిన స్కీమ్. తొలి రెండు దశల్లో 408 మందికి ఉపాధి లభించింది. మొత్తం 5వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నప్పటికీ, మలిదశల్లో జాప్యం జరుగుతోంది.
ఆటో టిప్పర్లు
చెత్త రవాణా కోసం నిరుద్యోగులకు 2,500 టిప్పర్లు అందించాలనుకున్నారు. వీరిలో దాదాపు 94 శాతం మంది తమవంతు వాటాలు చెల్లించి ముందుకొచ్చారంటే వారి నమ్మకం అర్థం చేసుకోవచ్చు.
ఇంటింటికీ చెత్తడబ్బాలు
సీఎం హామీ నేపథ్యంలో చెత్త తరలింపునకు ఇంటింటికీ రెండు రంగు డబ్బాలు అందించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. 45 లక్షల చెత్తడబ్బాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
స్వయం సహాయక మహిళా సంఘాల ఉపాధికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలనుకున్నప్పటికీ రూ.వంద కోట్లు కూడా ఇవ్వలేకపోయారు.ఈ-లైబ్రరీలు, జిమ్‌లు, మోడల్ మార్కెట్లు, బస్‌బేలు, బస్‌షెల్టర్లు, మల్టిపుల్ ఫంక్షన్ హాళ్లు, ఎఫ్‌ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ పనులు పూర్తి కాలేదు. మిగతా ప్రభుత్వ విభాగాలు శ్రద్ధ చూపకపోవడంతో పనులు కదల్లేదు. జీహెచ్‌ఎంసీవి దాదాపు 25 శాతం పూర్తయ్యాయి.
గతంలో మాటలకే పరిమితమైన వైట్‌టాపింగ్ పనులు కార్యరూపం దాల్చాయి. త్వరలో మరిన్ని మార్గాల్లో రానున్నాయి. రూ. 5కే భోజనం అద్భుత విజయం సాధించింది. దాదాపు 50 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.ఇంటి నెంబర్లు, గౌరవ సదన్‌లు వంటివి అందుబాటులోకి రాలేదు. బతుకమ్మ ఘాట్, బతుకమ్మల నిమజ్జనాలకు మంచినీటి కొలను వంటి పనులు శీఘ్రంగా జరిగాయి. ‘మహాప్రస్థానం’ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వర్షాకాలం ముగిసిపోయినా ‘హరితహారం’ ప్రారంభం కాలేదు.
సేవలపైనే పూర్తి దృష్టి
అందరి సహకారంతోనే పథకాలు విజయవంతం
జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్
సిటీబ్యూరో: ప్రజలకు సకాలంలో సేవలందితే అవినీతి క్రమేపీ తగ్గుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. గడచిన రెండేళ్లలో చేపట్టిన రూ.5కే భోజనం, డ్రైవర్‌కమ్ ఓనర్, ఎస్సార్‌డీపీ పథకాలు వేటికవే ప్రత్యేకత కలిగినవని చెప్పారు. వివిధ కారణాలతో కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోంద న్నారు. దీనికి నిరుత్సాహపడాల్సిన పని లేదన్నారు. ప్రజలు, సిబ్బంది, ఇతరత్రా అందరి సహకారం వల్లే ఎన్నో పనులు చేయగలిగామన్నారు. ప్రజలకు మెరుగైనే సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. ‘ఎన్ని చేసినా అవినీతి తగ్గలేదన్న’ ప్రశ్నకు బదులిస్తూ... సకాలంలో పనులు జరిగితే అది కూడా క్రమేపీ సాధ్యమవుతుంద ని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రవేశపెట్టిన ఈ-ఆఫీస్ వల్ల టౌన్‌ప్లానింగ్‌లో పెండింగ్ దరఖాస్తులు తగ్గాయన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో నిర్మాణాలకు అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. త్వరలో అది అమలు చేస్తామన్నారు. ఏటా వెయ్యి కిలోమీటర్ల వంతున వైట్‌టాపింగ్ రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అవి అందుబాటులోకి వస్తే రహదారుల మరమ్మతుల పేరిట నిధుల ఖర్చు, అవినీతి తగ్గుతుంద ని ఆయన అభిప్రాయపడ్డారు.
మేమే పనులు చేస్తాం
తాము ఎంతగా రహదారుల పనులు చేస్తున్నప్పటికీ... కొన్ని మార్గాల్లో అప్రదిష్ట వస్తోందని కమిషనర్ చెప్పారు. మెట్రో రైలు మార్గాల్లోనూ తామే పనులు పూర్తి చేసి, వాటి బిల్లులు మెట్ర రైలు వర్గాలకు అందజేస్తామని ‘సాక్షి’కి తెలిపారు. అన్ని పనుల్లోనూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యం పెంచుతామన్నారు. రహదారి మరమ్మతుల నుంచి చెత్త తరలింపు పనుల వరకు వారే చేస్తామని ముందుకొస్తే.. అప్పగిస్తామని తెలిపారు. దీనిపై సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులందరితో సోమవారం నుంచి సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే ఆటో ట్రాలీల నిర్వహణకు సంఘాలు ముందుకొస్తే వారికే కేటాయిస్తామని తెలిపారు.
రూపాయికే టిఫిన్?
రూ.5కే భోజన పథకానికి మంచి స్పందన వస్తున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోఒక రూపాయికే టిఫిన్ అందజేసే కార్యక్రమం అమలు చేయాలని కమిషనర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.