ఈ డాక్టర్లకు ఆల్‌ ది బెస్ట్‌ | Two transgender doctors get government jobs | Sakshi
Sakshi News home page

ఈ డాక్టర్లకు ఆల్‌ ది బెస్ట్‌

Published Fri, Dec 2 2022 4:19 AM | Last Updated on Fri, Dec 2 2022 4:19 AM

Two transgender doctors get government jobs - Sakshi

డాక్టర్‌ రూత్‌ జాన్‌పాల్‌, డాక్టర్‌ ప్రాచీ రాథోడ్‌

హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్‌జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్‌జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాలి.

గత వారం ప్రాచీ రాథోడ్‌ (30), రూత్‌ జాన్‌  పాల్‌ (28) ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో హెచ్‌.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్‌.టి విభాగంలో  వైద్యాధికారులుగా నియమితులయ్యారు.  వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు  ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు.

మా కమ్యూనిటీకి విజయమిది...
ఈ ఇద్దరిలో డాక్టర్‌ రూత్‌ది ఖమ్మం. డాక్టర్‌ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్‌ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై,  స్కూల్లో తోటి విద్యార్థుల  వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న  ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు.  

అర్హత ఉన్నా... తిరస్కరించారు...
‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు  ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్‌ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు  డా.రూత్‌..  తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్‌ టర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడు  తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం  బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే  చూశారన్నారు.

తెలిశాక... వద్దన్నారు...
డాక్టర్‌ ప్రాచీ రాథోడ్‌ రిమ్స్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్‌ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్‌ లో డిప్లొమా చేశారు.  సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని  ఆసుపత్రి భావించడంతో  ఉద్యోగం పోగొట్టుకున్నారు.

ఏపీలో పెన్షన్‌  భేష్‌
‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు  చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు.

‘మేమిద్దరం ట్రాన్స్‌ఉమెన్‌ గా నీట్‌ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్‌ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్‌ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‌‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్‌డ్‌ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు.

దేశంలోనూ అక్కడక్కడ
వైద్య రంగంలో కెరీర్‌ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్‌ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్‌ గుమ్మరాజు ట్రాన్స్‌ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్‌.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు.  ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్స్‌ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్‌ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది.

ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం
అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్‌.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ ‘మిత్ర్‌’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ  ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు.

– ఎస్‌.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement