In government hospital
-
ప్రసవాల్లో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు నెలలో నమోదైన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, ఇది ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో సరికొత్త రికార్డు అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు, ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నెలవారీ సమీక్షను నిర్వహించారు. అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రిలో 89% అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రి 89 శాతం, ములుగు 87, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84, వికారాబాద్ 83, గద్వాల ఆస్పత్రి 85 శాతం ప్రసవాలతో మంచి పనితీరు కనబర్చాయని హరీశ్‌రావు అభినందించారు. అతి తక్కువగా డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. మొత్తంగా మంచి సామర్థ్యపు స్కోర్ విషయంలో తొలి వరుసలో నిలిచిన మెదక్ (84.4), జోగుళాంబ గద్వాల (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్‌కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానాల్లో ఉన్న జగిత్యాల, కొమురంభీం, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
ఈ డాక్టర్లకు ఆల్ ది బెస్ట్
హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో నియామకం పొందారు. అదేం పెద్ద విశేషం? విశేషమే. ఎందుకంటే వీరిద్దరూ ట్రాన్స్జెండర్లు. గత కొంతకాలంగా దేశంలో తమ ఆత్మగౌరవం కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం పోరాడుతున్న ‘ఎల్జిబిటి’ సమూహాలకు ఈ నియామకం ఒక గొప్ప గెలుపు. అందుకే వీరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. గత వారం ప్రాచీ రాథోడ్ (30), రూత్ జాన్ పాల్ (28) ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో హెచ్.ఐ.వి రోగులకు చికిత్స అందించే ఏ.ఆర్.టి విభాగంలో వైద్యాధికారులుగా నియమితులయ్యారు. వీరు రాష్ట్రంలో డాక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన తొలి ట్రాన్స్జెండర్లు కావడం విశేషం. కొత్త చరిత్రకు నాంది పలికిన వీరు ‘సాక్షి’ తో తమ అనుభవాలు పంచుకున్నారు. మా కమ్యూనిటీకి విజయమిది... ఈ ఇద్దరిలో డాక్టర్ రూత్‌ది ఖమ్మం. డాక్టర్ ప్రాచీ రాథోడ్‌ది ఆదిలాబాద్ జిల్లా. చిన్న వయసులోనే డాక్టర్లు కావాలని కలలు కన్నప్పటికీ, కుటుంబ సభ్యుల మద్దతు కరువై, స్కూల్లో తోటి విద్యార్థుల వేధింపులు, సమాజంలో చిన్నచూపు వంటివి ఎదుర్కొంటూనే లక్ష్యాన్ని సాధించగలిగారు. తమలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కోసం పోరాడుతున్న ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఇదొక చారిత్రాత్మక విజయం అని వీరు అంటున్నారు. అర్హత ఉన్నా... తిరస్కరించారు... ‘మల్లారెడ్డి వైద్య విజ్ఞాన సంస్థలో 2018లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటి నుంచి ఉద్యోగం కోసం విఫలయత్నాలు ఎన్నో చేశా. సిటీలో కనీసం 15–20 ఆసుపత్రులు ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాయి. దీనికి కారణం మా జెండర్ అని ముఖం మీద చెప్పలేదు. కానీ అది మాకు అర్ధమైంది’ అన్నారు డా.రూత్.. తొలుత ఓ ఆసుపత్రిలో ఇన్ టర్న్షిప్ చేస్తున్నప్పుడు తనకు ఏ సమస్యా రాలేదనీ ∙లింగ మార్పిడి విషయం బయటపెట్టిన తర్వాతే తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారామె. తన అర్హతలను కాకుండా జెండర్‌నే చూశారన్నారు. తెలిశాక... వద్దన్నారు... డాక్టర్ ప్రాచీ రాథోడ్ రిమ్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌రంగంలో పనిచేస్తూ కెరీర్ ప్రారంభించారు. సిటీలో ఓ ఆస్పత్రిలో పని చేస్తూనే ఎమర్జెన్సీ మెడిసిన్ లో డిప్లొమా చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మూడేళ్లపాటు పని చేశారు. తన మార్పిడి గురించి తెలిశాక.. రోగులరాకకు ఇబ్బంది అవుతుందని ఆసుపత్రి భావించడంతో ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఏపీలో పెన్షన్ భేష్ ‘ఉస్మానియాలో సహ వైద్యులు, రోగులు బాగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడం సంతోషంగా ఉంది’ అని వీరు చెప్పారు. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్జెండర్లకు పింఛనుగా ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ అలాంటి ప్రత్యేక సహాయ సహకారాలు అన్ని చోట్లా మొదలు కావాలని ఆశిస్తున్నామన్నారు. ‘మేమిద్దరం ట్రాన్స్ఉమెన్ గా నీట్ పీజీ పరీక్షలను రాశాము, అయితే థర్డ్ జెండర్‌ను గుర్తించి అడ్మిషన్ ను మంజూరు చేసేందుకు వీలు కల్పించిన 2014 నాటి సుప్రీం కోర్ట్‡ తీర్పుకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్లు పొందలేదు’ అని చెప్పారు. తమ కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతామని, సమాజంలో సమాన హక్కులకై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. దేశంలోనూ అక్కడక్కడ వైద్య రంగంలో కెరీర్ ఎంచుకుంటున్న ట్రాన్స్‌జెండర్స్ దేశంలో మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నారు. కర్ణాటకలో త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ట్రాన్స్ డాక్టర్‌గా, యాక్టివిస్ట్‌గా జాతీయస్థాయిలో పేరొందారు. అలాగే కేరళకు చెందిన వి.ఎస్.ప్రియ కూడా లింగమార్పిడి చేయించుకున్న తొలి వైద్యురాలిగా రాణిస్తున్నారు. ఇప్పటికే రెండు ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్ ప్రారంభించిన తొలి నగరంగా సిటీ నిలిచింది. ఇద్దరు ట్రాన్స్ డాక్లర్లకు చిరునామాగా నిలిచిన ఘనతను కూడా తన సొంతం చేసుకుంది. ఒకే తరహా కష్టం కలిపింది స్నేహం అనేకానేక బాధాకరమైన అనుభవాల తర్వాత బతుకుదెరువు వేటలో భాగంగా వీరు ఇద్దరూ వేర్వేరుగా గత ఏడాది నారాయణగూడలో ఎన్.జి.ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైన ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ‘మిత్ర్’లో చేరారు. మంచి స్నేహితులయ్యారు. ఒకే తరహా సమస్యల మధ్య ఏర్పడిన తమ స్నేహం వేగంగా దృఢమైన బంధంగా బలపడిందనీ ఒకరి కొకరు తోడుగా, తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించి సాగుతోందని వీరు చెప్పారు. ప్రతీ సందర్భంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నామంటున్నారు. – ఎస్.సత్యబాబు సాక్షి, సిటీబ్యూరో -
పెద్దాసుపత్రుల్లో టెక్నీషియన్ల కొరత
► కీలకమైన కార్డియాలజీ, క్యాథ్‌ల్యాబ్, ఈసీజీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు ► అల్లాడుతున్న రోగులు.. ► వైద్య పరీక్షలకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ► రోగులకే కాదు.. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకూ ఇక్కట్లు ► 350 మంది టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు ప్రాథమిక నివేదిక హైదరాబాద్: జబ్బు నిర్ధారణలో వైద్య పరీక్షలు చాలా కీలకం. తద్వారా ఈ పరీక్షలు చేసే టెక్నీషియన్లది ఎంతో కీలక పాత్ర. రోగికి సరైన వైద్యం చేయాలంటే వైద్యుడు సైతం టెక్నీషియన్పైన ఆధారపడాల్సిందే. దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లే లేరు. ఫలితంగా పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో సరిగా వైద్యమందని పరిస్థితి నెలకొంది. పెద్దాసుపత్రికి వెళ్లి, ఔట్‌పేషెంట్ చిట్టీ రాయించుకుని.. వైద్యుని వద్దకు వెళ్లగానే.. జబ్బు నిర్ధారణకోసం వైద్య పరీక్షలు రాస్తే అవి చేసే టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేక రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఫలితంగా వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత..: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలూ.. వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులను టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పెద్దాసుపత్రులకు ఏటా దాదాపు 40 లక్షల మంది ఔట్పేషెంట్లు వస్తుంటే.. అందులో ఐదారు లక్షల మందికి మాత్రమే కొద్దోగొప్పో వైద్య పరీక్షలు అందుతున్నాయి. మిగతావారిలో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఏటా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందే ఔట్పేషెంట్లు లేదా ఇన్‌పేషెంట్లు వైద్య పరీక్షలకోసం కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకూ ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లిస్తున్నట్టు అంచనా. ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లు లేకపోవడమే ఇందుకు కారణం. టెక్నీషియన్ల కొరత కారణంగానే.. మన పెద్దాసుపత్రుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన పరికరాలు మూలనపడి ఉండడం గమనార్హం. కీలకమైన విభాగాల్లోనే కొరత.. రాష్ట్రంలో ఔట్పేషెంట్ల రద్దీ బాగా ఉండే ఆస్పత్రుల్లో విశాఖ కింగ్‌జార్జి, గుంటూరు పెద్దాసుపత్రి, కర్నూలు, కాకినాడలోని రంగరాయ, విజయవాడలోని సిద్ధార్థ వంటివి ఉన్నాయి. వీటికి రోజూ వేలల్లో పేషెంట్లు వస్తారు. కానీ వీటిలో కీలకమైన కార్డియాలజీ, ఈసీజీ, క్యాథ్‌ల్యాబ్, అనస్థీషియా, రేడియోగ్రాఫర్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు. దీంతో వైద్యులు నిర్ధారణ పరీక్షలు రాసినా అవి చేసేవారు అక్కడ లేకుండా పోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటున్నది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఈసీజీలకు వస్తూంటారు. వీళ్లు బయటకు పోలేరు. లోపల టెక్నీషియన్లు ఉండరు. దీంతో వారి మనోవేదన వర్ణనాతీతం. వైద్యవిద్యార్థులకూ ఇక్కట్లే.. టెక్నీషియన్లు లేకపోవడం, వైద్య పరీక్షలు సరిగా జరగకపోవడంతో ఎంబీబీఎస్, పీజీ వైద్యవిద్యార్థులూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరిగితేనే ఆ రోగమేంటీ? ఎలా వైద్యమందించాలన్నది వైద్యవిద్యార్థులకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏటా 1,750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 675 మంది పీజీ విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు. అయితే పలు రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు జరగకపోవడంతో వీరందరికీ పలు రోగాల విషయంలో నేర్చుకోవాల్సి అంశాలపై సందిగ్ధత ఏర్పడుతున్నట్టు విద్యార్థులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 350 మందికిపైగా టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు వైద్యాధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో టెక్నీషియన్ల ఖాళీల వివరాలివీ... ఆస్పత్రి టెక్నీషియన్ల కొరత జీజీహెచ్, కాకినాడ 40 జీజీహెచ్, గుంటూరు 45 కింగ్‌జార్జి, విశాఖ 40 జీజీహెచ్, అనంతపూర్ 25 జీజీహెచ్, కర్నూలు 35 ఎస్వీఆర్, తిరుపతి 33 జీజీహెచ్, విజయవాడ 28