పెద్దాసుపత్రుల్లో టెక్నీషియన్ల కొరత
► కీలకమైన కార్డియాలజీ, క్యాథ్‌ల్యాబ్, ఈసీజీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు
► అల్లాడుతున్న రోగులు..
► వైద్య పరీక్షలకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి
► రోగులకే కాదు.. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకూ ఇక్కట్లు
► 350 మంది టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు ప్రాథమిక నివేదిక
హైదరాబాద్: జబ్బు నిర్ధారణలో వైద్య పరీక్షలు చాలా కీలకం. తద్వారా ఈ పరీక్షలు చేసే టెక్నీషియన్లది ఎంతో కీలక పాత్ర. రోగికి సరైన వైద్యం చేయాలంటే వైద్యుడు సైతం టెక్నీషియన్‌పైన ఆధారపడాల్సిందే. దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లే లేరు. ఫలితంగా పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో సరిగా వైద్యమందని పరిస్థితి నెలకొంది. పెద్దాసుపత్రికి వెళ్లి, ఔట్‌పేషెంట్ చిట్టీ రాయించుకుని.. వైద్యుని వద్దకు వెళ్లగానే.. జబ్బు నిర్ధారణకోసం వైద్య పరీక్షలు రాస్తే అవి చేసే టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేక రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఫలితంగా వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత..: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలూ.. వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులను టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పెద్దాసుపత్రులకు ఏటా దాదాపు 40 లక్షల మంది ఔట్‌పేషెంట్లు వస్తుంటే.. అందులో ఐదారు లక్షల మందికి మాత్రమే కొద్దోగొప్పో వైద్య పరీక్షలు అందుతున్నాయి. మిగతావారిలో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఏటా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందే ఔట్‌పేషెంట్లు లేదా ఇన్‌పేషెంట్లు వైద్య పరీక్షలకోసం కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకూ ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లిస్తున్నట్టు అంచనా. ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లు లేకపోవడమే ఇందుకు కారణం. టెక్నీషియన్ల కొరత కారణంగానే.. మన పెద్దాసుపత్రుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన పరికరాలు మూలనపడి ఉండడం గమనార్హం.
కీలకమైన విభాగాల్లోనే కొరత..
రాష్ట్రంలో ఔట్‌పేషెంట్ల రద్దీ బాగా ఉండే ఆస్పత్రుల్లో విశాఖ కింగ్‌జార్జి, గుంటూరు పెద్దాసుపత్రి, కర్నూలు, కాకినాడలోని రంగరాయ,
విజయవాడలోని సిద్ధార్థ వంటివి ఉన్నాయి. వీటికి రోజూ వేలల్లో పేషెంట్లు వస్తారు. కానీ వీటిలో కీలకమైన కార్డియాలజీ, ఈసీజీ, క్యాథ్‌ల్యాబ్, అనస్థీషియా, రేడియోగ్రాఫర్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు. దీంతో వైద్యులు నిర్ధారణ పరీక్షలు రాసినా అవి చేసేవారు అక్కడ లేకుండా పోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటున్నది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఈసీజీలకు వస్తూంటారు. వీళ్లు బయటకు పోలేరు. లోపల టెక్నీషియన్లు ఉండరు. దీంతో వారి మనోవేదన వర్ణనాతీతం.
వైద్యవిద్యార్థులకూ ఇక్కట్లే..
టెక్నీషియన్లు లేకపోవడం, వైద్య పరీక్షలు సరిగా జరగకపోవడంతో ఎంబీబీఎస్, పీజీ వైద్యవిద్యార్థులూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరిగితేనే ఆ రోగమేంటీ? ఎలా వైద్యమందించాలన్నది వైద్యవిద్యార్థులకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏటా 1,750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 675 మంది పీజీ విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు. అయితే పలు రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు జరగకపోవడంతో వీరందరికీ పలు రోగాల విషయంలో నేర్చుకోవాల్సి అంశాలపై సందిగ్ధత ఏర్పడుతున్నట్టు విద్యార్థులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 350 మందికిపైగా టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు వైద్యాధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ఆసుపత్రుల్లోని
వివిధ విభాగాల్లో టెక్నీషియన్ల ఖాళీల వివరాలివీ...
ఆస్పత్రి టెక్నీషియన్ల కొరత
జీజీహెచ్, కాకినాడ 40
జీజీహెచ్, గుంటూరు 45
కింగ్‌జార్జి, విశాఖ 40
జీజీహెచ్, అనంతపూర్ 25
జీజీహెచ్, కర్నూలు 35
ఎస్వీఆర్, తిరుపతి 33
జీజీహెచ్, విజయవాడ 28