మనసు మయూరమై నాట్యమాడుతోంది. ఎంత వెచ్చని కబురొచ్చి వాలింది ఈవేళ మా ఇంటి జామచెట్టు మీద! భుజం మీది చిలుక నా బుగ్గను కొరికి, గిలిగింతలు పెట్టింది. ఇన్నేళ్లుగా మూసి ఉంచారు, ఇకనైనా తెరవమని కోర్టు చెప్పేవరకు ఈ లోకం మా కోసం మనసును పరచలేకపోయింది!
చిలకలు జాంపండును మాత్రమే కొరకాలని ఏముందీ.. వాటిష్టం.. దేన్నైనా కొరకొచ్చని న్యాయస్థానం చెప్పినప్పుడు.. ముందుగా నా బుగ్గే ఎరుపెక్కిందో, లేక.. చిలుక ముక్కే పదునెక్కిందో గమనించుకోలేదు. గాటు పడ్డ చోటు నుంచి రక్తపుచుక్క హరివిల్లు వర్ణంలో కిందికి జారింది. చూద్దును కదా.. అది చిలుక పెట్టిన గాటు కాదు. పరవశపు తత్తరపాటులో నాకై నేను కొరుక్కున్న పెదవి గాటు!
ఆడామగే ఉండాలి ఈ దేశంలో, ఆడామగే ఉండాలి ఈ దేశపు విహార స్థలాల్లో, ఆడామగే ఉండాలి ఈ దేశపు విడిది గృహాల్లో! న్యాయమేనా? ఈ లోకంలో ఉన్నది ఒక్క ఆడామగేనా? లోపలి మనసుల్ని వదిలేసి, పైపైన మనుషుల్ని చూస్తూ ఉంటే ఆడామగ మాత్రమే కనిపిస్తారు. ఆడలోని మగను, మగలోని ఆడను చూడండని ఎన్నేళ్లు అడిగాం. ఎన్నేళ్లు విజ్ఞప్తి చేశాం. ఎన్నేళ్లు ప్రదర్శనలు చేశాం. ఎన్నేళ్లు అభాసుపాలయ్యాం. ఎన్నేళ్లు అవమానాలు పడ్డాం. ఎన్నేళ్లు చచ్చి బతికాం!
ఇన్నేళ్లూ రక్తమంటే ఎర్ర రంగే. ఇకనుంచీ రక్తమంటే వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కూడా. మతం లేని, జాతి లేని, జాతీయత లేని, జెండర్ లేని ఒక నిండైన మానవ ప్రపంచం సొగసైన వంపుగా భువిపై విరిసిందీ వేళ.
ప్యాలెస్ బయటికొచ్చి నిలబడ్డాను. కోలాహలంగా ఉంది. అంతా ముద్దుల రంగులు అద్దుకుని ఉన్నారు. ముఖాలు వెలిగిపోతున్నాయి. కొందరింకా ఆలింగనాల అలసట నుంచి తేరుకోనే లేదు. ‘మనం సాధించాం.. మాన్వేంద్రా?’ అంటున్నారు. నవ్వాను. ‘మీ వెనుక ఏముందో చూడండి’ అని పెద్దగా అరిచి చెప్పాను. అంతా తలలు వెనక్కి తిప్పి చూసి.. ‘ఓ..’ అని ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. భూమ్యాకాశాలు కలిసే చోట పెద్ద ఇంద్రధనుస్సు!
‘‘మనం ఇప్పుడు ఆ ఇంద్రధనుస్సు పౌరులం’’ అన్నాను. అంతా ‘ఓ..’ అని అరిచారు మళ్లీ. ‘‘మనదిప్పుడు ఇంద్రధనుస్సు పౌరసత్వం’’ అన్నాను. దిగ్మండలం పులకించేలా మళ్లీ ‘ఓ..’ అనే ధ్వని!
ప్యాలెస్ లోపలికి వచ్చి నిలబడ్డాను. గోడపై ఫొటోలో మహారాణాశ్రీ రఘుబీర్ సింహ్‌జీ రాజేంద్రసింగ్‌జీ! నాన్న. ఆయన పక్కనే రాణీ రుక్ష్మిణీ దేవి! అమ్మ. వాళ్ల పెళ్లినాటి ఫొటో.
‘‘నా కడుపున చెడబుట్టావురా’’ అంది అమ్మ.. నాలో స్త్రీహృదయం మాత్రమే ఉందని తొలిసారి అమ్మకు తెలిసినప్పుడు! నేనే ఆ సంగతి అమ్మకు చెప్పాను. విషాదంలో కూరుకుపోయింది అమ్మ.
‘‘వద్దన్నా పెళ్లి చేశారు. రాకుమారి చంద్రికా కుమారిని ఇప్పుడు నేనేం చేసుకునేదమ్మా’’ అని అమ్మను అడిగాను. చంద్రిక నా భార్య. తను అర్థం చేసుకుంది. వెళ్లిపోయింది. అమ్మ అర్థం చేసుకోలేదు. నన్ను వెళ్లిపొమ్మంది. ‘వీడు నా కొడుకు కాదు’ అని బహిరంగంగా ప్రకటన కూడా చేయించింది. స్త్రీ అయి ఉండి అమ్మ నాలోని స్త్రీ మనసును అర్థం చేసుకోలేకపోయింది. పుట్టింట్లోంచి వచ్చేశాను. దుఃఖమేం లేదు. స్త్రీకే కదా పుట్టింట్లోంచి వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది.
పైకి ఒకలా ఉండి, లోపల ఇంకోలా ఉండే స్వేచ్ఛ ప్రతి మనిషికీ ఉన్నప్పుడు.. లోపల ఉన్నట్లే పైకీ ఉండగలిగే స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు? ఆ స్వేచ్ఛ ఇన్నేళ్లకొచ్చింది.
న్యాయమూర్తులకు ధన్యవాదాలు.
మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment