మేం నేరస్తులం కాదు
మేం నేరస్తులం కాదు
Published Sun, Dec 15 2013 11:51 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్‌జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరారు. ‘మేం నేరస్తులం కాదు’, ‘మరొక వ్యక్తిని ప్రేమించడమనేది నేరం కాదు’ తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని జంతర్ మంతర్‌లో ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్‌నెస్, కేర్ అండ్ ఎంపవర్‌మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు.
ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు. ‘ఒక పిల్లర్‌ను ఏర్పాటుచేసి మాకు మద్దతిచ్చే వారి సంతకాలను దానిపై తీసుకుంటాం. అన్ని ప్రాంతాలకు ఈ పిల్లర్‌ను తీసుకెళ్లి అందరి మద్దతు కూడగడతాం. ఆ తర్వాత దాన్ని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌కు బహూకరిస్తామ’ని జోషి వెల్లడించారు. స్వలింగ సంపర్కంపై నిషేధాన్ని 2009లో సడలించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు అది ముమ్మాటికీ నేరమేనని ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement