హిజ్రాను వేధించి.. ఆపై కాల్పులు
తాను అప్పుగా ఇచ్చిన నగదు తిరిగివ్వమని అడిగినందుకు ఓ హిజ్రాపై నిందితుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో శనివారం చోటుచేసుకుంది. దీదర్ అనే ట్రాన్స్ జెండర్ షాహిద్ అనే వ్యక్తికి కొంత మొత్తం అప్పుగా ఇచ్చింది. ఎన్ని రోజులైనా తన డబ్బులు తిరిగివ్వడం లేదని అతడి ఇంటికి వెళ్లింది. డబ్బులు ఇవ్వమని అడిగిన క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన నిందితుడు షాహిద్, తనకు మనీ ఇచ్చిన హిజ్రాపై తుపాకీతో కాల్పులుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ దీదర్ చేతిలోకి దూసుకెళ్లింది.
దీదర్ కు ప్రాథమిక చికిత్స నిర్వహించి సర్జరీ వార్డులోకి షిఫ్ట్ చేశామని కైబర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మరికొంత మంది హిజ్రాలు ఆస్పత్రికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డబ్బులు తిరిగివ్వక పోగా తనను వేదింపులకు గురిచేశాడని దీదర్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఏడాది కైబర్ ఏరియాలో హిజ్రాలపై జరిగిన ఆరో దాడి కావడం గమనార్హం. అలీషా అనే ట్రాన్స్ జెండర్ పై ఈ ఏడాది మొదట్లో ఓ వ్యక్తి ఎన్నిమిది రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.