Gurus
-
Guru Purnima 2023: కదిలించే కాంతి గురువు
‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించేది గురు. కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. గురువులు కాంతిని ఇస్తారు. జీవనం అనే చీకటిని ఛేదించడానికి ప్రతి మనిషికి కాంతిని ఇచ్చే గురువు ఎంతో అవసరం. వ్యాసుడు కీలకమైన గురువుకాగా ఆది శంకరాచార్య భారతీయతకు మహోన్నతమైన గురువు అయ్యారు. శంకరాచార్యే ఉండి ఉండకపోతే ఒక దశలో భారతీయత చిందరవందరైపోయేది. గౌతమ బుద్ధుడు, మహావీరుడు, రామానుజుడు, అరవిందుడు వంటి పలువురు మేలైన గురువులు మన మట్టికి, మనకు మేలు చేశారు. శంకరుల తరువాత స్వామి వివేకానందవల్ల ఒకదశలో భారతీయతకు రావాల్సిన చలనం, జ్వలనం వచ్చాయి. భారతీయ తత్త్వానికి, సత్వానికి విశ్వవ్యాప్తిని కలిగించారు వివేకానందులు. మనదేశానికి రాజకీయ స్వాతంత్య్రం రావడానికి వివేకానందులు పరోక్ష కారణం. వారు వెలిగించిన భారతీయస్ఫూర్తి పలువురిని జాతీయ ఉద్యమంవైపు నడిపించింది. వైదికత్వం కోసం, జాతి కోసం తన ఆత్మానుభూతిని సైతం త్యాగం చేసిన అత్యున్నతమైన యోగి–గురువు వారు. ఒక దశలో శంకరులు, ఒక దశలో వివేకానందులు అందివచ్చిన గురువులై మనల్ని కదిలించే కాంతులు అయ్యారు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అన్నది మన మట్టిలో మెరుస్తూ ఉండే మాట. కృష్ణుడు చెప్పిన పాఠం భగవద్గీత ప్రపంచం అంతా విలసిల్లుతోంది. ‘తుచ్ఛమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి పైకిలే’ అంటూ కృష్ణుడు మనల్ని ఉన్ముఖుల్ని చేస్తూనే ఉన్నాడు. ‘భగవద్గీత సందేశం అంతా ఈ మాటల్లో ఇమిడి ఉంది’ అని చెప్పారు వివేకానందులు. ఈ మాటల స్ఫూర్తితో వారు ‘లే, జాగృతి పొందు, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు’ అని అన్నారు. ‘పనిలో నేర్పరితనమే యోగం’ అనీ, ‘హీనమైన పనిని దూరంగా వదిలెయ్యి’ అనీ, ‘నిర్ణయించబడిన పనిని చెయ్యి’ ఆనీ, ‘శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది’ అనీ, ‘అనుమానస్తుడికి సుఖం లేదు’ అనీ కృష్ణుడు చెప్పినవి మన జీవితాలకు కాంతిని ఇచ్చేవి. ‘మానవ విజ్ఞానంలో సాటిలేనివాడు, అద్వితీయమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కృష్ణుడు’ అని వివేకానందులు చెప్పిందాన్ని అర్థం చేసుకుందాం. ఏది అన్నిటికన్నా ప్రయోజనకరమైంది? అన్న సంశయానికి ‘ధర్మం’ అని చెప్పి శంకరాచార్య సంశయ నివృత్తి చేశారు. ఏది వాంఛింపదగింది? అన్న సంశయానికి ‘స్వ, పర హితం’ అనీ, శత్రువు ఎవరు? అన్న సంశయానికి ‘సోమరితనం’ అనీ, ఏది దుఃఖం? అన్న సంశయానికి ‘ఉత్సాహం లేకపోవడం’ అనీ, ఏది జాడ్యం? అన్న సంశయానికి ‘నేర్చుకున్నది ఆచరించకపోవడం’ అనీ, ఎవరు స్నేహితులు? అన్న సంశయానికి ‘పాపాన్ని నివారించే వాళ్లు’ అనీ, ఏది పాతకం? అన్న సంశయానికి ‘హింస’ అనీ, ఎవరు ఎదుగుతారు? అన్న సంశయానికి ‘వినయం ఉన్నవాళ్లు’ అనీ, ఎవరు ప్రత్యక్ష దేవత? అన్న సంశయానికి ‘అమ్మ’ అనీ, వేటిని మనుషులు సంపాదించాలి? అన్న సంశయానికి ‘విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం’ అనీ, ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? అన్న సంశయానికి ‘సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత’ అనీ తెలియజెప్పి మనకు దిశానిర్దేశం చేశారు శంకరాచార్య. ‘మీరు అపారమైన ఓర్పు కలిగి ఉన్నారా, అయితే విజయం మీదే’ అని శంకరుల స్ఫూర్తితో వివేకానందులు ఉవాచించారు. ‘సత్యం, నిగ్రహం, తపస్సు, శుచి, సంతోషం, సిగ్గు, ఓర్పు, నిజాయితీ, జ్ఞానం, శాంతి, దయ, ధ్యానం కలిగి ఉండాలి; ఇదే సనాతన ధర్మం’ అన్న వ్యాసుడి ఉపదేశాన్ని వ్యక్తిత్వంలో నింపుకుని ప్రతి వ్యక్తీ ఉదాత్తంగా బతకాలి. మనకు అత్యవసరమైన గురువులుగా ఆది శంకరాచార్యను, స్వామి వివేకానందను మనం ఇకపై సంభావించి స్వీకరించాలి. ఈ ఇరు గురువుల ఉపదేశాల్ని అందుకుని భారతీయులమైన మనం దేశ సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, ప్రగతి కోసం పనిచెయ్యాలి; మనమూ పరిఢవిల్లాలి. – రోచిష్మాన్ -
జయాపజయాలు
మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు. శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే! ‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు. గోబెల్స్కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది. మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు. గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు. ‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన. వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో! స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు. వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం! -
సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా !!!
వాగ్గేయకారులలో ఒకరిగా ఖ్యాతి గడించిన శ్యామశాస్త్రి గారు పచ్చిమిరియం అప్పయ్య శాస్త్రి గారనే సంగీత విద్వాంసుడి దగ్గర అభ్యాసం కొనసాగిస్తున్నారు. ఒక సదాచారం ఏమిటంటే గురువుల ముందు తాంబూల చర్వణం చేయకూడదు. కానీ శ్యామశాస్త్రి గారికి తాంబూలం బాగా అలవాటు. గురువుగారు కూడా కాదని ఏనాడూ అనలేదు. ఒకనాడు గురువుగారితో మాట్లాడుతుండగా నోటిలో ఉన్న తాంబూల ఉచ్చిష్టం గురువుగారి ఉత్తరీయం మీద పడింది. పశ్చాత్తాప భావనతో వెంటనే శ్యామశాస్త్రి గారు... ఆ ఉత్తరీయం ఇస్తే ఉతికి పట్టుకొస్తానన్నారు. దానికి గురువుగారు...‘‘నీకు సంగీతం ఎందుకు నేర్పుతున్నానో తెలుసా ? ఏ నాటికయినా నీ నోటి తాంబూలం ఈ ఉత్తరీయం మీద పడాలని...’’ అన్నారు. అమ్మవారే పురుష స్వరూపంలో పుట్టిందని భావించిన అప్పయ్య శాస్తిగ్రారు– శ్యామశాస్త్రిని ఆ పేరుతో పిలిచేవారు కారు... ‘కామాక్షీ’ అని పిలిచేవారు. ఈ శిష్యుడికి తాను సంగీతం నేర్పడం లేదు, అతనిలో అప్పటికే ఉన్న సంగీతాన్ని ప్రచోదనం చేస్తున్నానంతే – అని భావించేవారు. సౌందర్యలహరిలో శంకరులంటారు – అమ్మవారి తాంబూలం ఎవరినోట్లోకయినా వెళ్ళిందా వారు మహా కవులయి పోతారు– అని. అలాభావించినగురువుగారు పొంగిపోయారు. తరువాత కాలంలో శ్యామశాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులయ్యారు.ఆ రోజుల్లో భూలోకం చాపచుట్టు కేశవయ్య గారని బిరుదులతో కూడిన గొప్ప సంగీత విద్వాంసుడు ఏనుగెక్కి వస్తుండేవారు. ‘నన్ను గెలవగలిగిన వాడెవడయినా ఉన్నాడా ?’ అని చాటింపు వేసుకుని వచ్చాడు. శ్యామశాస్త్రి గారితో వాదనకు రాజాస్థానంలో ఏర్పాటు చేసారు. వాదనలో మొదటివంతు శ్యామశాస్త్రి గారిది. శిరస్సు కదపకుండా తానం పలకమన్నారు. శాస్త్రరీత్యా తానం పలికేటప్పుడు శిరస్సు కదపకూడదు. వచ్చిన ఆ విద్వాంసుడు అలా చేయలేకపోయారు. తరువాతి వంతు కేశవయ్యగారిది. సింహనందనరాగంలో పాడమని సవాల్ విసిరారు. శ్యామశాస్త్రి అలవోకగా పాడేసారు. తరువాతి వంతు వచ్చినప్పుడు.. శరభనందన రాగంలో పాడమని ఆయన కేశవయ్యగారిని అడిగారు. శరభుడంటే సింహాన్ని చంపగలిగి, 8 కాళ్ళు కలిగి, పక్షి శిరస్సు కలిగిన ఒక స్వరూపం. ఈ రాగాన్ని శ్యామశాస్త్రి గారు అభివృద్ధి చేసారు. అందులో 19 3/4 వంతు మాత్రలు. ఒక ఆవృతిలో 79 అక్షరాలు వచ్చేటట్లుగా ఆలాపన చేయాలని సవాల్ విసిరారు. ఓటమిని అంగీకరించిన కేశవయ్యగారు, శ్యామశాస్త్రి గారి ఔన్నత్యాన్ని అభినందించి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆయన నాయకరాజుల గౌరవాన్ని నిలబెట్టారు.శ్యామశాస్త్రి జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా. తన భార్య మరణించిన ఐదవరోజున తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన ఇచ్ఛామోక్షాన్ని పొందారు. మిగిలిన ఇద్దరూ... త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు కూడా ఇలా ఇచ్ఛామోక్షాన్ని పొందిన వారే. త్యాగయ్యగారి కయితే బ్రహ్మకపాల మేధనం జరిగింది. ఈ ముగ్గురూ నాదోపాసన చేసిన వారే.శ్యామశాస్త్రి గారు అద్భుతమైన రెండు కీర్తనల్ని సంస్కృతంలో, తెలుగులో ఇచ్చారు. ఈ రెండూ కళ్యాణి రాగంలో ఉంటాయి. వీటిని మీరు ఏదయినా సంగీత వాద్య పరికరంమీద మోగిస్తే, ఏ కీర్తన పలికిస్తున్నారో తెలియదు. కేవలం కంఠంతో పాడితేనే ఇది ఫలానా కీర్తన అని తెలుస్తుంది. అలా ఇచ్చిన కీర్తనలో ఒకటి–‘హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరుమధ్యవాసినీ, అంబ శ్రీకామాక్షి....’ -
పాఠ్యపుస్తకాల్లో స్వామీజీలు, బాబాల చరిత్ర
గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్వాశ్రమంలో గోరక్నాథ్ మఠానికి ముఖ్య అధిపతిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకే కాబోలు ఆ మూలాలను మర్చిపోలేక ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మీదట ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చరిత్ర విస్మరించిన బాబాలు, స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన పాఠాలను కూడా చేర్చాలని యూపీ రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి యూపీ విద్యాశాఖ అధికారి భూపేంద్ర నారాయణ్ సింగ్ ‘ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఏడాది పంచే పాఠ్యపుస్తకాలలో ప్రముఖ బాబాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చేర్చనున్నాము. వీరిలో బాబా గోరఖ్నాథ్, బాబా గంభీర్నాథ్, స్వాతంత్ర్య సమరయోధుడు బంధు సింగ్, రాణి అవంతి బాయితో పాటు 12వ శతాబ్దికి చెందిన పోరాట యోధులు అల్లా, ఉదల్ గురించి కూడా చేర్చను’న్నట్లు తెలిపారు. వీరంతా నాథ్ శాఖకు చెందిన మహనీయులని, కానీ గత పాలకులు వీరిని నిర్లక్ష్యం చేసారన్నారు. నేటి తరానికి వీరి గురించి తెలియాలనే ఉద్దేశంతో వీరి జీవిత చరిత్రలను ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ ఏడాది పంచే పుస్తకాలు ఆకర్షణీయమైన రంగుల్లో, క్యూఆర్ కోడ్తో రానున్నాయన్నారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సంబంధిత పాఠాలు డిజిటల్ ఫార్మాట్లో మొబైల్ ఫోన్లలో కనిపిస్తాయని తెలిపారు. -
లోపలి శత్రువులను జయించాలి!
అర్జునునికి శత్రుపక్షంలోని వారందరూ బంధువులు, గురువులు అని తెలిసినప్పటికీ, వారిని జయించాలనే ఉద్దేశంతోనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. అయితే వారందరినీ చూడగానే మమకారం పెల్లుబికి, నిస్సహాయుడయ్యాడు, నిలువెల్లా విషాదం ఆవరించడంతో యుద్ధం చేయలేనని వెనుదిరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినదే శ్రీమద్భగవద్గీత. ఇంతకీ గీత ఏమంటోందంటే... పుట్టిన ప్రతిప్రాణికీ మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి జన్మించడమూ తప్పదు, అనివార్యమైనదీ, నిశ్చితమైనదీ అయిన జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడే వారి కోసం దుఃఖించడం సరికాదు అంటాడు శ్రీకృష్ణుడు. అంటే చనిపోయేది ప్రాణి మాత్రమే, ఆత్మ కాదు. మనం ఎవరయితే మరణించారని అనుకుంటున్నామో ఆ మరణించింది భౌతిక సమ్మేళనాలే కాని, చైతన్యరూపంలో ఉండే ఈ ఆత్మ మాత్రం కాదు. ముండకోపనిషత్ ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవి హృదయంలో ఉండి అక్కడి నుంచి శక్తిని ప్రసరింప చేస్తూ ఉంటుంది. ఈ చైతన్య ప్రసారం ఆగినప్పుడే దేహం నిర్జీవమవుతుంది. శరీరం నశించినా ఆత్మ మరణించదు. కనుక ఆత్మ నిత్యం, సత్యం, శాశ్వతం, పురాతనం అయినది. ఇది తెలిసిన వాడు జ్ఞాని. మానవుడు చిరిగిపోయిన పాతవస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లే నాశన రహితమైన ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు యుద్ధం లేకపోవచ్చు కానీ, అంతఃశత్రువులున్నారు. కామక్రోధలోభమోహమదమాత్సర్యాలే ఆ శత్రువులు. ఆ శత్రువులను జయించడం కోసమైనా గీతను ఆకళింపు చేసుకోవడం, అందులోని సూత్రాలను ఆచరించడం అవసరం. -
సమతను చాటిన సాధువు
పుస్తక పరిచయం ‘‘జనం అంతకుముందు చాలామంది బాబాలను, గురువులను చూశారు. అయితే, వాళ్లందరూ బ్రహ్మజ్ఞానం, మాయ, కోరికలు, సమర్పణలు, పరలోకాలు, ముక్తి, మోక్షం లాంటి మాటలే చెబుతూ ఉండేవారు. వాటిలో ఈ లోకానికి సంబంధించినవి, ఇప్పటికి అవసరమైనవి ఒక్కమాట కూడా ఉండేది కాదు. కానీ, ఈ కొత్త బాబా చెబుతున్నవి చాలా కొత్తగా ఉండటమే కాదు, అర్థమవుతోంది కూడా’’ అంటారు రచయిత మల్లంపల్లి సాంబశివరావు. ‘అభినవ బుద్ధుడు– అంబేడ్కర్ గురువు సంత్ గాడ్గేబాబా’ అనే తన పరిశోధనాత్మక గ్రంథంలో ఆయన అనేక విషయాలను వెలుగులోకి, తెలుగులోకి తెచ్చారు. సమాచారం కోసం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. వృద్ధాప్యంలో ఉన్న గాడ్గేబాబా డ్రై వర్ భావ్రావు కాలేను కలిశారు. తాను ఆచరిస్తున్నది బౌద్ధమనే విషయం తెలియకుండానే జీవితాంతం బుద్ధుడి వలే గడిపిన మహనీయుడు గాడ్గేబాబా అంటారు రచయిత. అక్షరజ్ఞానం లేని ఒక సాదాసీదా గాడ్గేబాబాను తన గురువుగా అంబేడ్కరే స్వయంగా ప్రకటించాడు. బుద్ధుడి మాదిరిగా తన 29వ ఏట గాడ్గేబాబా ఇంటి నుంచి వెళ్లిపోయి, సంసారిక జీవితానికి దూరంగా జరిగి, జనం ఈతిబాధలను రూపుమాపే మహత్కార్యానికి పూనుకున్నాడు. ఈ బాధలను తొలగించడానికి అపరిశుభ్రత నిర్మూలన అనే ఆచరణాత్మక విధానాన్ని ఆయన ఆయుధంగా చేసుకున్నాడు. స్వచ్ఛత గురించి గాంధీ మహాత్ముడు ప్రవచించకముందే, 1905లో మహారాష్ట్రలో అప్పటికే బోధిస్తూ, ఆచరిస్తూ జనం హృదయాలను గెలుచుకున్నవాడు గాడ్గేబాబా. పది సూత్రాల కోసం జీవితమంతా దేశాటన చేశాడు. ‘ఆకలిగొన్నవారికి అన్నం పెట్టండి, వస్త్ర విహీనులకు వస్త్రాలు అందించండి, దాహార్తులకు మంచినీరు ఇవ్వండి, జంతువులను ప్రేమించండి, జంతుబలికి పూనుకోకండి, అంటరానితనం పాటించకండి, మద్యాన్ని సేవించకండి, తల్లిదండ్రులను సేవించండి, విద్య లేనివారికి విద్యను అందించండి, అప్పులు చేసి తీర్థయాత్రలకు వెళ్లకండి’ అని బోధించాడు. మహారాష్ట్రలోని సతారా, అమరావతి, పుణె, బొంబాయి, వార్ధా వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు, గోశాలలు, విద్యాసంస్థలను 60కి పైగా నిర్మించాడు. గాడ్గేబాబా శిష్యగణం, అభిమానుల్లో సామాన్యులతోపాటు మాన్యులు కూడా అనేక మంది ఉన్నారు. ప్రముఖ కాలమిస్టు సుధీంద్ర కులకర్ణి, జేఎన్యూ ప్రొఫెసర్ వివేక్ కుమార్ వంటివారు రాసిన వ్యాసాలతో కూడిన ఐదు అనుబంధాలను పొందుపరిచిన ఈ 28 అధ్యాయాల పుస్తకానికి టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ ముందుమాట రాశారు. సంత్ గాడ్గేబాబా; రచన: మల్లంపల్లి సాంబశివరావు; పేజీలు: 166; వెల: 150; ప్రతులకు: విశాఖ బుక్స్, ఫోన్: 040–27090197 ఠి నీలం వెంకన్న