గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్ : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్వాశ్రమంలో గోరక్‌నాథ్ మఠానికి ముఖ్య అధిపతిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందుకే కాబోలు ఆ మూలాలను మర్చిపోలేక ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక మీదట ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చరిత్ర విస్మరించిన బాబాలు, స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన పాఠాలను కూడా చేర్చాలని యూపీ రాష్ట్ర విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ విషయం గురించి యూపీ విద్యాశాఖ అధికారి భూపేంద్ర నారాయణ్ సింగ్ ‘ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ ఏడాది పంచే పాఠ్యపుస్తకాలలో ప్రముఖ బాబాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చేర్చనున్నాము. వీరిలో బాబా గోరఖ్‌నాథ్, బాబా గంభీర్‌నాథ్, స్వాతంత్ర్య సమరయోధుడు బంధు సింగ్, రాణి అవంతి బాయితో పాటు 12వ శతాబ్దికి చెందిన పోరాట యోధులు అల్లా, ఉదల్ గురించి కూడా చేర్చను’న్నట్లు తెలిపారు. వీరంతా నాథ్ శాఖకు చెందిన మహనీయులని, కానీ గత పాలకులు వీరిని నిర్లక్ష్యం చేసారన్నారు.
నేటి తరానికి వీరి గురించి తెలియాలనే ఉద్దేశంతో వీరి జీవిత చరిత్రలను ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ ఏడాది పంచే పుస్తకాలు ఆకర్షణీయమైన రంగుల్లో, క్యూఆర్ కోడ్‌తో రానున్నాయన్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత పాఠాలు డిజిటల్ ఫార్మాట్‌లో మొబైల్ ఫోన్లలో కనిపిస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment