సంస్కారమే బలం... విచక్షణే శక్తి! | The discretionary power of the strength of the cover! | Sakshi
Sakshi News home page

సంస్కారమే బలం... విచక్షణే శక్తి!

Published Fri, Nov 20 2015 11:40 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

సంస్కారమే బలం... విచక్షణే శక్తి! - Sakshi

సంస్కారమే బలం... విచక్షణే శక్తి!

విద్య - విలువలు
 
సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారంతోడైతే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. దానితో, ఆ సంస్కారబలంతో మీకు తెలియకుండానే ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఔను! నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను. నేనేం తప్పు మాట్లాడలేదు, నేనే తప్పు చేయలేదు’’ అన్న విశ్వాసం పెరగాలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడకపోతే, పిల్లలకు నాలుగు మాటలు ధైర్యంగా చెప్పలేకపోతే నాకు ఈ గౌరవం ఎందుకు? ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. అందుకున్న వాడు అదృష్టవంతుడు. అందుకోలేనివాడు పరమేశ్వరుని దయతో ఎప్పటికయినా అందుకోవాలి. అప్పుడు నేను చేస్తున్న ఈ ప్రయత్నం పూర్తయినట్లే. నీపట్ల ఎంత కఠినంగా మాట్లాడినా నీకేది అందాలో అది అందించినవాడిపట్ల గౌరవం ప్రదర్శించిననాడే నీకు హితం.

నీ హితంకోరి మాట్లాడేటప్పుడు అన్ని వేళలా మంచి మాటలే ఉండవు. మనం పాలకోవా అంటాం. ఉత్తరభారతదేశంలో దేధ్‌పేడా అంటారు. పేరలా ఉందేమిటండీ’ అని పాలకోవా తిననంటే నీ ఖర్మ. పేరేదయితే నీకెందుకు? పాలకోవా రుచి ఉందా లేదా! అనుభవిస్తే అదృష్టవంతుడివి. నేనింతటి వాడినయ్యా, మా నాన్నగారేంటండీ అలా మాట్లాడతారనుకోకూడదు. అమ్మ కూడా అలానే మాట్లాడుతుంది. వేళపట్టున తినరా, ఉపన్యాసాలనీ, ప్రసంగాలనీ ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చి తినకురా. కావాలంటే ఉపన్యాసం మధ్యలో ఆపయినా కొద్దిగా తినరా. నీ ఒళ్ళు అసలే గాజుకాయలాంటిది’ అంటుంది. ‘‘ఏంటమ్మా అలా మాట్లాడతావు. నేనింత పెద్దపెద్ద సభలలో మాట్లాడతాను. నీవేంటి అందరిముందు అలా మాట్లాడతావేంటి’’ అనకూడ. పరమ సంతోషంతో స్వీకరించాలి. మా అమ్మకాకపోతే అలా ఎవరు చెబుతారు. అది నా అదృష్టం. ఇప్పుడే కాదు, నా షష్టిపూర్తయినా మా అమ్మ అలానే చెబుతుంటుంది. ఆమె వాక్కులో కాఠిన్యం కాదు, ఆమె ఏం కోరుకుంటున్నదో తెలుసుకుంటే అది సంస్కారం.

 నీవేదో ఉన్నత స్థానంలో ఉన్నావని అమ్మ అలా మాట్లాడకూడదనుకుంటే ఎలా? నీవలా కావాలని ఆమె ఉపవాసాలు చేసింది, గుళ్ళకు వెళ్ళింది, ప్రదక్షిణలు చేసింది... నీకు జలుబు చేస్తుందని ఆమె చింతకాయపచ్చడి మానేసింది. నీకు జలుబు చేస్తే ఆమె శొంఠిపొడి తిని నీకు పాలిచ్చింది. ఆమె శరీరంలో 15 లీటర్ల నెత్తురు పోగొట్టుకుని నిన్ను కన్నది. ఆమె పచ్చిపుండయి నిన్ను కాపాడింది. నాన్నగారు ఆకలిమీదొచ్చి అడిగితే ఏం వండిపెట్టిందేమో కానీ, నీవు ఏడిస్తే మాత్రం ఆమె నెత్తురు పాలయ్యాయి. ఆమె ఇప్పుడు అయోగ్యురాలయిందా? ఆమె ఇప్పుడు నీతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలా? అలా అని నీవనుకోవడమే నీ కుసంస్కారం. ఆమె ఏది మాట్లాడినా అది ఈశ్వరుడి మాటనుకోవడం నీ సంస్కారం, ఒక మనిషికి ఇది తెలియదు. వాడు పాడైపోడు’ అని శాస్త్రం చెప్పింది. వాడు ఎప్పుడు పాడైపోతాడంటే నేను తెలుసుకోను, నేను వినను’’ అంటే పాడైపోతాడు. పుట్టుకతో ఎవరూ సర్వజ్ఞులు కారు. ప్రతివాడూ తప్పొప్పుల కూడికే.

కఠినంగా ఉండడమే హితవాక్కు లక్షణం
నో స్మోకింగ్  అని బోర్డుంటుంది. అంటే పొగ తాగరాదు. పొగతాగడంవల్ల వచ్చే నష్టములు అని బోర్డు పెట్టరు కదా! ఒక కీడునుంచి మిమ్మల్ని బయటకు లాగాలనుకోండి. మర్యాదగా చెప్పడం కుదరదు. ఒక మహారాజుగారున్నారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. వంది, మాగధి, ఏనుగులు, గుర్రాలు, మేళాలు, తాళాలు వెడతాయా! మహారాజుగారిని ఈడ్చుకొచ్చేస్తారంతే. నేను మహారాజును, పల్లకీ పంపొద్దా అంటాడా ఆయన? అనడు. అనకపోగా మంటలనుంచి తప్పించి మంచిపని చేశారని తన మెడలోని హారం తీసి ఇస్తాడు. అగ్నిహోత్రంలో చిక్కుకున్నవాడిని బయటికి తీసుకురావడానికి వాక్కు మాధుర్యంతో ఉండదు. నీళ్ళలో కొట్టుకుపోతున్నవాడిని రాచమర్యాదలతో బయటికి తీసుకురారు. బయటికి లాక్కొచ్చి, ఒడ్డునపడేసి పైన కాళ్ళు పెట్టి తొక్కి నీళ్ళు కక్కించాలి. నీళ్ళలో మునిగినాయన మహానుభావుడు. ఎక్కడ కనిపించినా కాళ్ళకు నమస్కారం చేసే డాక్టరు కూడా ఆ ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు, ఆఖరి ఊపిరి మీదున్నప్పుడు, కాళ్ళు మీదపెట్టి నొక్కేస్తాడు, అంతకన్నామార్గంలేదు. సంస్కారం అన్న మాటకు అర్థం ఎక్కడున్నదీ అంటే... ఎందుకంత కఠినంగా మాట్లాడారని ఆలోచించడం కాదు, వారు ఎలా మాట్లాడినా నా అభ్యున్నతి కోసమే అలా మాట్లాడారని అనుకోవడం నీ సంస్కారం.

అలాకాక, పెద్దల వాక్కులో కాఠిన్యం చూడడం అలవాటయితే అది సంస్కార రాహిత్యం.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో దేనికి వెళ్ళినా విద్యార్థులేకాదు, ప్రొఫెసర్లు కూడా చెవులొగ్గి వినేవారు. అటువంటి వాళ్ళు ’’పిల్లలు వృద్ధిలోకి రావాలి, అందరూ సమున్నతమైన స్థితిని పొందాలి’’అని అంత పెద్ద వయసులోకూడా విశ్రాంతి తీసుకోకుండా ’’పిల్లలతో సంభాషించడం నాకెంత ఇష్టమో! ఎందుచేతంటే, భావి భారతమంతా వాళ్ళచేతుల్లోనే ఉంది’’ అంటూ అంత శ్రమకోర్చి వచ్చి నాలుగు మంచి మాటలు చెబుతుంటే... వినండి, పూర్తిగా వినండి. ఒక్కోమాట ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయన ఒకసారి ఒక యూనివర్శిటీలో మాట్లాడుతూ...’’ఈ దేశం వృద్ధిలోకి రావాలంటే ఒకే ఒక్క ఆస్కారముంది. చిన్న చిన్న దేశాలు... ఎంత చిన్నవంటే... ప్రపంచ పటంలో సూదిపెట్టి చూపిస్తే కానీ కనబడని దేశాలు, ఈ వేళ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. కారణం చమురు నిక్షేపాల మీద వాటికున్న కమాండ్. మనం కూడా మనకున్న చమురు వనరులను ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో చూడండి. అలాగే దేశంలో పనికిమాలిన మొక్కలుగా భావించే వాటి ఆకులనుండి సహజమైన చమురు వంటి పెట్రోల్, ముడిచమురు వంటివి తయారు చేయడంలో పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా విద్యార్థులు చదవడం నేర్చుకోవాలి.’’ అన్నారు. పిల్లలు అటువంటి ప్రయత్నం చేసిన నాడు ఎవడో ఒక విద్యార్థివల్ల మొత్తం ఈ దేశం స్వరూపమే మారిపోతుంది. అలాంటి పరిశోధనాత్మక దృష్టి పెంచుకోండి. కేవలం గాటకు కట్టిన తాడు ఎంతదూరం వస్తుందో అంతదూరం వరకే ఒక పశువు తిరిగినట్లుగా మూసపోసిన జీవితాన్ని జీవించకండి. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ అభ్యున్యన్నతి కోసం మీ మేధాశక్తిని ఎంత ఉపయోగించుకోగలరో చూడండి.

 అటువంటి మహాపురుషులు చాలామంది ఉన్నారు లోకంలో. విశాఖపట్టణంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా చేసిన డాక్టర్ శ్రీపాద పినాకపాణిగారు సంగీతంలో కూడా పరమ నిష్ణాతులై, 90 ఏళ్ళుదాటినా కూడా మంచంమీద లేవలేని స్థితిలో ఉండి కూడా అసంఖ్యాకంగా శిష్యులు వచ్చి సేవిస్తుండగా, స్వరాలు వేసి పాడుకుంటూ తరించిపోయేవారు. ఒక పనికిమాలిన వాడిగా కాకుండా, కొన్ని లక్షలమందికి పనికివచ్చేలా వృద్ధాప్యం తాలూకు అసౌకర్యాలను లెక్కచేయకుండా జీవితా గడుపుతున్న మహాపురుషులున్నారు. కానీ మన ప్రచార, ప్రసార సాధనాలు అటువంటి వాళ్ళ గురించి మీకు చెప్పే ప్రయత్నం అసలు చేయవు. ఏది అక్కర్లేదో... ఎక్కడో ఎవడో నూతిలో పడిపోతే  బ్రేకింగ్ న్యూసంటూ గంటలతరబడి మీకు చూపిస్తాయి. చూసి మీరు పొందే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మీకుగా మీరు అలవాటు చేసుకోకపోతే గడిచిపోయిన సమయం మళ్ళీరాదు. అందుకే మనవి చేస్తున్నా. నా ఆర్తిని సహృదయంతో అర్థంచేసుకోండి.    
 
 కఠినంగా ఉండడమే హితవాక్కు లక్షణం
 నో స్మోకింగ్  అని బోర్డుంటుంది. అంటే పొగ తాగరాదు. పొగతాగడంవల్ల వచ్చే నష్టములు అని బోర్డు పెట్టరు కదా! ఒక కీడునుంచి మిమ్మల్ని బయటకు లాగాలనుకోండి. మర్యాదగా చెప్పడం కుదరదు. ఒక మహారాజుగారున్నారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. వంది, మాగధి, ఏనుగులు, గుర్రాలు, మేళాలు, తాళాలు వెడతాయా!
 మహారాజుగారిని ఈడ్చుకొచ్చేస్తారంతే.
 
 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement