సాహిత్య సౌరభం... శీలవైభవం | Education - values | Sakshi
Sakshi News home page

సాహిత్య సౌరభం... శీలవైభవం

Published Sat, Oct 17 2015 12:06 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

సాహిత్య సౌరభం... శీలవైభవం - Sakshi

సాహిత్య సౌరభం... శీలవైభవం

విద్య - విలువలు
 
ఒక ఆఫీసర్ ఓ అయిదుగురు అసిస్టెంట్స్‌ను రిక్రూట్ చేయవలసి వచ్చింది. ఓ వంద మంది ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో స్టేట్ చీఫ్ సెక్రటరీ ఒకతన్ని రికమెండ్ చేశాడు. ఆయన ఆ అబ్బాయికి ఉద్యోగం ఇస్తూ ఫైలు మీద ఇలా రాశాడు. ‘‘ఈ ఒక్క అపాయింట్‌మెంటు చీఫ్ సెక్రటరీ రికమెండేషన్ మీద చేయకపోతే రేపు సంస్థకు సమస్యలు రావచ్చు. అందువల్ల ఆ అభ్యర్థికి ఉద్యోగం ఇస్తున్నాను. దీనివల్ల సంస్థకు పెద్ద నష్టమేమీ కలగదు. దిస్ మే అప్రూవ్డ్’’ అని రాసి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌కి ఇచ్చాడు. మరొక ఆఫీసర్ ఉండేవాడు. ఆయననేవాడు. ‘‘ఎప్పుడూ రూల్, రూల్ అనీ, రూల్స్ పర్మిట్ చెయ్యవండి అని మాట్లాడకయ్యా. నిజంగా నీవు చాలా గొప్పపని చేయాల్సి వస్తే బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్. నిజంగా అది నీవు మంచని నమ్మితే రాయి ఫైలు మీద. దాన్ని నేను ఆమోదిస్తాను’’ అనేవాడు.

మీరు మీకిందవాళ్లకి అలాంటి స్ఫూర్తినివ్వగల ఆఫీసర్సుగా తయారుకండి. మీరు నమ్మిన సిద్ధాంతానికి నిలబడగలిగినవారుగా తయారుకండి. ఎప్పుడైనా మీ జీవితంలో చిన్న పొరపాటు జరిగితే మృతపిండాలు కాకండి. బంతులు కండి. అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి, ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి. ఆయన నిరాశతో రుషికేశ్‌లోని ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామీజీ అలా వెళుతూ కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి వెళ్లాను ఇంటర్వ్యూకు. అది పొందడం నాకిష్టం. కాని నేను సెలక్ట్ అవ్వలేదు. ఈ ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. ఏదో ఈ ఇంటర్వ్యూకి వెళ్లాను. దీనికి సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టం లేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఈశ్వరుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా ఎందుకు వెళ్లలేకపోతున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే! ఈ దేశానికి ఉపగ్రహాలు తయారుచేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు కలాం. రెండవమారు రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా దాన్ని తృణప్రాయంగా వదిలి విద్యార్థులతో మాట్లాడటమే నాకిష్టమనీ, ప్రతి కాలేజీకి, యూనివర్సిటీలకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూనే వాళ్ల మధ్యనే కన్నుమూశారాయన.
 తలిదండ్రులను, గురువులను గౌరవించగలిగిన శీలవైభవం లేనివాడు ఎవడికి కావాలి.

మీరు ఎదగడం కాదు. మిమ్మల్ని ఆదర్శంగా మీ వెనుకనున్నవాళ్లు తీసుకోవాలి. అది మీ ప్రవర్తన చేత సాధ్యమవుతుందేమో. కేవలం నాలాగా ఉపన్యాసాలు చెప్పడం వల్ల సాధ్యం కాదు. ఏ ఒక్కరైనా నా ఈ మాటల వల్ల మీ జీవితాలను దిద్దుకోగలిగితే అది చాలు. పెద్దలు ఇచ్చిన సాహిత్యం మీదగ్గర పెట్టుకోండి. ఎత్తు పల్లాలను తట్టుకోగలిగిన శక్తి ఎక్కడినుంచి వస్తుందంటే ఒక భగవత్ గీతను మీ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చదువుతున్న చంద్రశేఖరేంద్ర సరస్వతిగారి బోధనల్ని మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు చదవండి.

మంచి మంచి పుస్తకాలు కొని చదవండి. ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగు పుట్టి పెరిగినట్లు బతకకూడదు. మంచిగా బతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందికి  తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా? అన్న సందిగ్ధం. మీరు ఇంగ్లిషు బాగా చదువుకుని చక్కగా పాసవ్వండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథ ప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతనగారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి. సినిమాను వినోదంగా తీసుకోండి. సినిమాలు ఆదర్శం కావని గుర్తుంచుకోండి. ఎక్కడైనా మీ జీవితాలలో వెలుగు నింపగలిగే ఆదర్శాలు కనిపిస్తే.. మీరు దానిని అనుసరిస్తే నేను తప్పుపట్టడానికి సిద్ధంగా లేను. అది మంచి పనే అని చెపుతాను.
 సచిన్ టెండూల్కర్ ముంబాయిలోని ఒక వీధిలో ఇల్లు కడుతూ... ఈ వీధిలోని వాళ్లందరి ఇళ్లకు ఉత్తరాలు రాసి పంపించాడు. నేను ఇల్లు కట్టే క్రమంలో పునాదులను తవ్వడానికి రాళ్లు పేల్చవలసి వస్తుంది. ట్రక్స్ వెళుతున్నప్పుడు చప్పుళ్లు వస్తున్నాయి. దీనివల్ల వీధిలో ఉన్న మీ అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కానీ మీ అందరినీ కోరేదొక్కటే. అమ్మ కడుపులో నుంచి ఓ బిడ్డడు ఒక కుటుంబంలో ప్రవేశించడానికి ముందు అమ్మకడుపులో తొమ్మిది నెలలు ఉన్నప్పుడు ఆ అమ్మ పొందే వికారాలు, కష్టాలు భరిస్తే తప్ప ఆ బిడ్డడు రాలేనట్టు... మీ అందరూ కష్టాలను తల్లిలా ఓరిస్తే తప్ప, మీ కుటుంబంలో సభ్యుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకోలేను. మీకు కలుగుతున్న కష్టాలకు క్షమించవలసినది’ అని ఉత్తరాలు పంపాడు.

ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీని మీరు అలవాటు చేసుకోండి. ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ అయిన సచిన్ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంత పైకి లేచాడు. తను రికార్డు బ్రేక్ చేయగానే ఊర్ధ్వలోకాలలో ఉన్న తన తండ్రికి తలయెత్తి కృతజ్ఞత చెబుతాడు. ఎంతోమంది వీధి బాలలను చదివిస్తున్నాడు. ఎక్కడా తానిది చేశానని చెప్పుకోడు. ఎవ్వరిమీదయినా వ్యతిరేకంగా ఒక మాటయినా మాట్లాడలేదు. నేను మీతో మనవి చేసేది అదే. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఆయనేం చెప్పుకున్నాడో తెలుసా సమాధానం. ‘‘నేను బ్యాట్ పట్టుకుని అన్యమనస్కంగా ఏదో షాట్ కొట్టినప్పుడు ఆ బాల్ వెళ్లవలసిన డెరైక్షన్‌లో వెళ్లవలసిన వేగంలో వెళ్లకపోతే.. మహాకోపంతో ఇంకా రెండు బాల్స్ చూసి లోపలకొచ్చి, ‘‘ఏరా ఇలా ఆడుతున్నావ్?’’ అని మా గురువుగారు కొడితే దిమ్మదిరిగి పడిపోయాను. ఆనాడు మా గురువుగారు కొట్టిన దెబ్బ జ్ఞాపకం ఉండిపోయి, ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. ఎక్కడ బంతి పడుతుంది. దీన్ని ఏ డెరైక్షన్‌లో కొట్టాలి? అని. అంతే స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. ఒక సభలో గురువుగారి పాదాలకి నమస్కరించి గురువుగారి గొప్పతనాన్ని చెబుతాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి. ఒక్కొక్కరూ జాతిరత్నాల్లా ప్రకాశించి ఈ దేశానికి ఖ్యాతి తీసుకురండి.
 
కిందివారికి పని చెప్పడం తేలికే! కాని, చేయడంలోని కష్టాన్ని తెలుసుకోవాలి. మీరు రేపు చాలా పెద్ద పెద్ద అధికారులు అవుతారు. కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం మీ చేతుల్లో ఉంటుంది. ఆ నిధులు సక్రమంగా ఖర్చు కావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. ఎదుటివారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకరికొకరు అర్థమవుతారు.
 మా ఆఫీసు విషయమే మీకొక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఇన్స్‌పెక్షన్‌కు ముందు ఆఫీసంతా సర్దమన్నారు. పాత ఫైళ్లన్నీ చూసి పనికిరానివి తీసివేసి పనికి వచ్చేవి ఒక క్రమంలో అమర్చుకోవాలి. మీకు తెలుసు. ఇటువంటి విషయాల్ని ఎంత పట్టించుకుంటామో. మా అధికారి చిన్న సమావేశం ఏర్పాటు చేసి అందర్నీ పిలిచారు. ఐదు నిమిషాల్లో సమావేశం ముగిసింది. ఆయనేం చెప్పారో తెలుసా. ‘‘నేను రేపు ఆదివారం వచ్చి ఈ పని మొదలుపెడుతున్నాను. మీలో ఎవరైనా రావచ్చు. రాకపోయినా నేనేమీ అనను. రేపు పని పూర్తి కాకపోతే రోజూ ఉదయం 7 గంటలకే వచ్చి చేస్తాను. ఎన్నాళ్లలో అవుతుందో అన్నాళ్లలో అవుతుంది. మీరు రావాలనుకుంటే రండి. మీకు స్వాగతం.’’

 ఆదివారమే మా ఆఫీసు ఇన్‌స్పెక్షన్‌కు ముస్తాబైంది. ఆయన అందర్నీ సమావేశపరచి ప్రశంసించారు. ఆయన అందర్నీ ఆజ్ఞాపించి, వాళ్లు పని పూర్తిచేయలేకపోతే కోప్పడి హంగామా చేసి ఉంటే ఏమయ్యేది? ఆయన చెడ్డవాడయ్యేవాడు. కింది ఉద్యోగులకు ఆయనంటే ఇష్టం ఉండేది కాదు. పని అసలే జరిగేది కాదు. అందువల్ల సమయానుకూలంగా ప్రవర్తించాలి. కోపం నివారించుకోవాలి. కలిసి పనిచేయాలి. క్రోధాన్ని తొలగించుకోవడం అన్ని శ్రేయస్సులకూ మూలం. అందుకే మనం నేర్చుకునే విద్య మన క్రోధాన్ని పోగొట్టగలగాలి. అదొక గొప్ప విలువ.
 
 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement