జీవితంలో కొన్ని వదిలించుకుని తీరవలసినవి, ఎన్ని సర్దుబాట్లుచేసుకుని అయినా వదలకూడనివి కొన్ని ఉంటాయి... వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా దిద్దుకోకపోతే పచ్చటి జీవితాలు పాడయిపోతాయి, మోడయిపోతాయి. అందులో మొదటగా స్నేహితుడు.. అదీ ఆత్మీయుడు, ప్రాణసముడు.. అని నమ్మి మనం మన కష్టం, సుఖం, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నీ మనసు విప్పి ఏవీ దాచుకోకుండా చెప్పేసుకుంటాం.
ఇవన్నీ తెలుసుకుని మనల్ని మోసం చేయడానికి అతను కనిపెట్టుకుని ఉన్నాడు... అని తెలిసినప్పుడు మీరెంత ప్రమాదంలో ఉన్నారో ఊహించుకోండి. మీరు వెంటనే అప్రమత్తం కావాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలి... సాధ్యం కానప్పుడు దూరంగా పెట్టడానికి సందేహించకూడదు.
అలాగే భృత్యుడు... సేవకుడికి వినయం ఉండాలి. యజమానిపట్ల గౌరవభావం ఉండాలి. ఆయన చెప్పిన ఆదేశాలను పాటించడం తన విధిగా అనుకోవాలి. తనసేవలతో యజమానిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తుండాలి. అలా కాక యజమానికన్నా తాను ఎక్కువ చదువుకున్నవాడిననీ, దేనిలోకూడా ఆయనకేమీ తాను తీసిపోననీ, ఆయన మాటలు నేను వినేదేమిటనే సేవకుడు... యజమానిని ఎప్పుడూ తిరస్కార భావంతోనే చూస్తుంటాడు. అటువంటి భృత్యుడిని సంస్కరించగల శక్తి ఉంటే సంస్కరించగలగాలి... అది సాధ్యంకానప్పుడు వదిలించుకోవాలి. కపటి అయిన మిత్రుడు, అహంకారి అయిన భృత్యుడు మృత్యువుతో సమానం. ఇంట్లో పెద్ద తాచుపాము దూరింది.. ఇంట్లోనే ఎక్కడో ఉంది.. రోజుకు నాలుగైదు సార్లు కనిపిస్తున్నది. ఏదో దానిమానాన అది ఉందని ప్రశాంతంగా, నిబ్బరంగా ఇంట్లో ఉండగలమా... ఇవి కూడా అంతే...
ఇక ... ఒకసారి అనుబంధం ఏర్పడిన తరువాత ఎన్ని అవాంతరాలు, ఎంత మానసిక క్లేశం ఎదురవుతున్నా సర్దుబాటు చేసుకుంటూ, చివరిదాకా కొనసాగించాల్సిన బంధం – దాంపత్య బంధం. ఇద్దరూ కలిసి చెయ్యిచెయ్యిపట్టుకుని ప్రస్థానం చేయాలి. ఎవరు ఎవరి చేయి పట్టుకున్నారు, ఎవరు ఎవరిని కాపాడుకోవాలి.. అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది.
ఉదాహరణకు... ఒక చిన్న పిల్లను తీసుకుని తండ్రి నడిచి వెడుతున్నాడు. ‘అమ్మా! మనం నడుస్తున్న ప్రదేశం అంత మంచిది కాదు. కొండమీద నడుస్తున్నాం. జారితే ప్రమాదం. నా చేయి గట్టిగా పట్టుకో..’ అన్నాడు. దానికి ఆ పిల్ల .. ‘‘వద్దు నాన్నగారూ, నేను మీ చేయి పట్టుకున్నాననుకోండి. జారిపోవడం ఎంత ప్రమాదకరమో, మీ చేయి విడిచి పెట్టేయడం కూడా అంతే ప్రమాదకరం కావచ్చు.
అందుకని నేను మీ చేయి పట్టుకోను. మీరే నా చేయి పట్టుకోండి. అప్పుడు ఎంత ప్రమాదం వచ్చినా మీరు నా చేయి వదలరు.. అది నా నమ్మకం’’ అన్నది. ఆ నమ్మకం ఎంత గొప్పది. ఇది భార్యాభర్తలమధ్య జీవితాంతం అలాగే ఉండాలి... ఒకరికొకరు బాసటగా. అంతే తప్ప ఎవరి చేయి ఎవరు ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకే తెలియకపోతే... వాళ్ల మధ్యే అభిజాత్యాలు, అహంకారాలు పుడితే, ఆ దాంపత్యం ఏం వర్ధిల్లుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది...
ఇవి చిన్న చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. తరువాత చూసుకోవచ్చులే అని కాక .. సమస్య మొదలయిందని గుర్తించిన మరుక్షణం దృష్టి పెట్టి దిద్దుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment