Corrections
-
మెత్తబడని అసమ్మతి!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడి పది రోజులు దాటినా అసమ్మతి నేతలు మెత్తబడటం లేదు. టికెట్ దక్కించుకున్న నేతలు అసమ్మతి నేతల సహకారం కోరుతూ వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సానుకూలంగా స్పందించడం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా ఇన్నాళ్లూ అధికార బలాన్ని ఉపయోగించి తమను తొక్కిపెట్టారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు సర్దుబాటుకు ససేమిరా అంటున్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలతో అంటకాగి పదవులు, పనులు పొందిన చోటా మోటా నేతలు కూడా ఏదో ఒక సాకు చూపుతూ ప్రస్తుతం దూరం పాటిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలోకి దిగాలనుకుంటున్న అభ్యర్థుల అడుగులు ముందుకు పడట్లేదు. ఆయా అభ్యర్థుల కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు అసమ్మతిని చల్లార్చేందుకు రాయబారం నెరపుతున్నా ఆశించిన ఫలితం రావట్లేదు. చాలా నియోజకవర్గాల్లో బుజ్జగింపుల పర్వం వికటించి కిందిస్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. నియోజకవర్గాలవారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగింపుల పర్వాన్ని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి తదితరులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతూ దిద్దుబాటుకు ప్రయత్నిస్తున్నారు. సొంతదారి వైపు అసమ్మతి చూపు ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం బీఆర్ఎస్లో సంచలనం సృష్టించగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు సొంత దారి చూసుకోవడంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఎమ్మెల్యే రేఖానాయక్ (ఖానాపూర్), వేముల వీరేశం (నకిరేకల్) పార్టీనీ వీడగా మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. తాము సైతం బీఆర్ఎస్ను వీడటం ఖాయమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. పటాన్చెరు, జహీరాబాద్, మెదక్, కల్వకుర్తి, సంగారెడ్డి, అలంపూర్, నాగార్జునసాగర్, కోదాడ, సూర్యాపేట, రామగుండం తదితర నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు రద్దు చేసి తమకు కేటాయించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నెలకొన్న అసమ్మతి దిద్దుబాటుకు మంత్రి టి.హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో తన నివాసంలో వరుస భేటీలు జరుపుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూ అభ్యర్థుల గెలుపు కోసం కలసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు. మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అసమ్మతి నేతలు శుక్ర, శనివారాల్లో హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్ రాక తర్వాత బుజ్జగింపుల పర్వం వేగం పుంజుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా పట్టాలెక్కుతుందని చెబుతున్నాయి. జనగామ, నర్సాపూర్ పంచాయితీ యథాతథం జనగామ, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), చిలుముల మదన్‌రెడ్డి (నర్సాపూర్) తమకు టికెట్ దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ) తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. కేటీఆర్ వచ్చిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాలపై పీటముడి వీడే అవకాశముంది. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టికెట్ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటంతో మధ్యేమార్గంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు తెరమీదకు వస్తున్నట్లు తెలిసింది. -
ఇంట్లో పెద్ద తాచుపాముంటే.. ప్రశాంతంగా, నిబ్బరంగా ఉండగలమా!
జీవితంలో కొన్ని వదిలించుకుని తీరవలసినవి, ఎన్ని సర్దుబాట్లుచేసుకుని అయినా వదలకూడనివి కొన్ని ఉంటాయి... వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా దిద్దుకోకపోతే పచ్చటి జీవితాలు పాడయిపోతాయి, మోడయిపోతాయి. అందులో మొదటగా స్నేహితుడు.. అదీ ఆత్మీయుడు, ప్రాణసముడు.. అని నమ్మి మనం మన కష్టం, సుఖం, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు అన్నీ మనసు విప్పి ఏవీ దాచుకోకుండా చెప్పేసుకుంటాం. ఇవన్నీ తెలుసుకుని మనల్ని మోసం చేయడానికి అతను కనిపెట్టుకుని ఉన్నాడు... అని తెలిసినప్పుడు మీరెంత ప్రమాదంలో ఉన్నారో ఊహించుకోండి. మీరు వెంటనే అప్రమత్తం కావాలి. దిద్దుబాటు చర్యలు చేపట్టాలి... సాధ్యం కానప్పుడు దూరంగా పెట్టడానికి సందేహించకూడదు. అలాగే భృత్యుడు... సేవకుడికి వినయం ఉండాలి. యజమానిపట్ల గౌరవభావం ఉండాలి. ఆయన చెప్పిన ఆదేశాలను పాటించడం తన విధిగా అనుకోవాలి. తనసేవలతో యజమానిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తుండాలి. అలా కాక యజమానికన్నా తాను ఎక్కువ చదువుకున్నవాడిననీ, దేనిలోకూడా ఆయనకేమీ తాను తీసిపోననీ, ఆయన మాటలు నేను వినేదేమిటనే సేవకుడు... యజమానిని ఎప్పుడూ తిరస్కార భావంతోనే చూస్తుంటాడు. అటువంటి భృత్యుడిని సంస్కరించగల శక్తి ఉంటే సంస్కరించగలగాలి... అది సాధ్యంకానప్పుడు వదిలించుకోవాలి. కపటి అయిన మిత్రుడు, అహంకారి అయిన భృత్యుడు మృత్యువుతో సమానం. ఇంట్లో పెద్ద తాచుపాము దూరింది.. ఇంట్లోనే ఎక్కడో ఉంది.. రోజుకు నాలుగైదు సార్లు కనిపిస్తున్నది. ఏదో దానిమానాన అది ఉందని ప్రశాంతంగా, నిబ్బరంగా ఇంట్లో ఉండగలమా... ఇవి కూడా అంతే... ఇక ... ఒకసారి అనుబంధం ఏర్పడిన తరువాత ఎన్ని అవాంతరాలు, ఎంత మానసిక క్లేశం ఎదురవుతున్నా సర్దుబాటు చేసుకుంటూ, చివరిదాకా కొనసాగించాల్సిన బంధం – దాంపత్య బంధం. ఇద్దరూ కలిసి చెయ్యిచెయ్యిపట్టుకుని ప్రస్థానం చేయాలి. ఎవరు ఎవరి చేయి పట్టుకున్నారు, ఎవరు ఎవరిని కాపాడుకోవాలి.. అనేది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు... ఒక చిన్న పిల్లను తీసుకుని తండ్రి నడిచి వెడుతున్నాడు. ‘అమ్మా! మనం నడుస్తున్న ప్రదేశం అంత మంచిది కాదు. కొండమీద నడుస్తున్నాం. జారితే ప్రమాదం. నా చేయి గట్టిగా పట్టుకో..’ అన్నాడు. దానికి ఆ పిల్ల .. ‘‘వద్దు నాన్నగారూ, నేను మీ చేయి పట్టుకున్నాననుకోండి. జారిపోవడం ఎంత ప్రమాదకరమో, మీ చేయి విడిచి పెట్టేయడం కూడా అంతే ప్రమాదకరం కావచ్చు. అందుకని నేను మీ చేయి పట్టుకోను. మీరే నా చేయి పట్టుకోండి. అప్పుడు ఎంత ప్రమాదం వచ్చినా మీరు నా చేయి వదలరు.. అది నా నమ్మకం’’ అన్నది. ఆ నమ్మకం ఎంత గొప్పది. ఇది భార్యాభర్తలమధ్య జీవితాంతం అలాగే ఉండాలి... ఒకరికొకరు బాసటగా. అంతే తప్ప ఎవరి చేయి ఎవరు ఎప్పుడు పట్టుకోవాలో వాళ్ళకే తెలియకపోతే... వాళ్ల మధ్యే అభిజాత్యాలు, అహంకారాలు పుడితే, ఆ దాంపత్యం ఏం వర్ధిల్లుతుంది, దానివల్ల ఏ ప్రయోజనం సిద్ధిస్తుంది... ఇవి చిన్న చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. తరువాత చూసుకోవచ్చులే అని కాక .. సమస్య మొదలయిందని గుర్తించిన మరుక్షణం దృష్టి పెట్టి దిద్దుకుని జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నిఫ్టీ సూచీలలో అదానీ గ్రూప్ షేర్లు
నిఫ్టీ ఇండెక్సులలో ఈ ఏడాది మార్చి31 నుంచి సవరణలు చేపడుతున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా వెల్లడించింది. నిఫ్టీ ఇండెక్సులలో ప్రయివేట్ రంగ కంపెనీలు అదానీ విల్మర్, అదానీ పవర్‌తోపాటు పలు ఇతర కంపెనీలకు చోటు లభించనుంది. అదానీ విల్మర్ నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ 100కు ప్రాతినిధ్యం వహించనుంది. ఇక అదానీ పవర్‌కు నిఫ్టీ 500, 200లతోపాటు నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, 150, లార్జ్‌మిడ్ క్యాప్ 250, మిడ్‌స్మాల్ క్యాప్ 400లలో చోటు లభించనుంది. ఇండెక్సుల నిర్వహణ సబ్‌కమిటీ షేర్ల జాబితాలో సవరణలను నిర్ణయించినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. అయితే ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎలాంటి మార్పులూ చేపట్టడంలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. కాగా.. నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌లో ఏబీబీ ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ సైతం ప్రాతినిధ్యం వహించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫసిస్, వన్ 97 కమ్యూనికేషన్స్లను నిఫ్టీ నెక్ట్స్ 50 ఇండెక్స్‌నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. -
కరెక్షన్లో పెట్టుబడుల రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి
ఇటీవల స్టాక్ మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చింది కదా.. భారీ దిద్దుబాటుకు అవకాశం ఉందా? వస్తే లాభాలు, పెట్టుబడులను కాపాడుకోవడం ఎలా?– నవీన్ కరెక్షన్ కనిపించింది. కానీ, గణనీయంగా ఏమీ పడిపోలేదు. ఆ తర్వాత నుంచి స్థిరంగా కోలుకోవడాన్ని చూస్తున్నాం. భారీ పతనం రానున్నదా? అంటే నిజంగా లేదనే చెప్పుకోవాలి. కానీ, నిజం ఏమిటంటే స్వల్పకాలంలో ఏమి జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడి నుంచి గణనీయంగా పెరిగిపోవచ్చు. ఖరీదైన మార్కెట్ వ్యాల్యూషన్‌ను చాలా కంపెనీలు ఆశించొచ్చు. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వ్యాల్యూషన్లు ఖరీదుగా అనిపిస్తున్నప్పటికీ, ఇవి ముందుకే వెళ్లొచ్చు. కనుక స్వల్పకాలానికి అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో అంటే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ కంపెనీల ఆదాయాలు, లాభాలు మరింత వృద్ధి చెందొచ్చు. దీర్ఘకాలానికి మార్కెట్ పట్ల నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను. అయితే, అదే కాలంలో కొన్ని కంపెనీలు ప్రతికూలతలను చూడొచ్చా? అంటే అవుననే నా సమాధానం. మార్కెట్లో ఈ తరహా కంపెనీలు ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది ఐపీవోల్లో ఖరీదైన వ్యాల్యూషన్లకు స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఏడాది, రెండేళ్ల తర్వాత లాభాలు రాకపోతే అంత ఖరీదుపెట్టి ఎందుకు కొన్నామా? అని అనిపించొచ్చు. ఇప్పుడైతే వాటి ధరలు పెరుగుతూ వెళుతుండడం పట్ల ఇన్వెస్టర్లు సౌకర్యంగానే ఉన్నారు. దీంతో ఆయా స్టాక్స్ వ్యాల్యూషన్ సరైనదేనన్న భావనతో ఉన్నారు. కానీ, కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా విశ్లేషణ చేస్తే అప్పుడు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. భారీ కరెక్షన్, ఆతర్వాత ఏకధాటిగా ర్యాలీని ఎవరూ ఊహించలేరు. కనుక అటువంటి ప్రశ్నలకు సమాధానం లభించదు. కాకపోతే మన పెట్టుబడులు, లాభాలను ఎలా కాపాడుకోవాలి? అంటే అందుకు మార్గముంది. అదే రీబ్యాలన్స్. మీరు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నట్టయితే స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్ ) పథకాలకు ఎంతో కొంత కేటాయింపులు చేసుకోవాలి. అది 25% లేదా 50 శాతమా అన్నది మీ ఎంపికే. ఒకవేళ మీ పెట్టుబడుల కేటాయింపులు ఈక్విటీ, డెట్‌కు 50:50 శాతం చొప్పున నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగిపోయి మొత్తం పెట్టుబడుల్లో మీ ఈక్విటీ భాగం 50% నుంచి 60 శాతానికి చేరి.. డెట్ పెట్టుబడుల విలువ 40 శాతానికి తగ్గిందనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సిందల్లా.. 60 శాతంగా ఉన్న ఈక్విటీని 50 శాతానికి తగ్గించుకోవాలి. అంటే 10% మేర ఈక్విటీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. దీన్ని లాభాల స్వీకరణగా చూడొచ్చు. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాంతో ఈక్విటీ, డెట్ మళ్లీ 50:50 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ మార్కెట్ పడిపోయి మీ 50% వాటా కాస్తా 40 శాతానికి తగ్గిపోయి, ఫిక్స్డ్ ఇన్కమ్ పెట్టుబడులు 60 శాతంగా ఉన్నాయనుకోండి. అప్పుడు మొత్తం పెట్టుబడిలో ఫిక్స్డ్ ఇన్కమ్ భాగం 50 శాతానికి తగ్గిపోయే విధంగా విక్రయాలు చేపట్టాలి. ఆ మొత్తాన్ని ఈక్విటీలోకి మళ్లించుకోవాలి. నూరు శాతం ఈక్విటీ లేదా నూరు శాతం డెట్ పెట్టుబడులు చాలా ప్రమాదకరం. మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి తరుగుదలను హెడ్జ్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు – రోణాక్ షా రూపాయి తరుగుదల అన్నది వాస్తవం. ఐదు, పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చిన్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే సరైనది. సామర్థ్యం, మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీయ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఒకవేళ మీరు ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి:జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి! -
చిన్నారులపై అత్యాచారానికి ఉరిశిక్షే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న నికృష్టపు ఘటనల నేపథ్యంలో.. చిన్నారులను లైంగిక దాడులనుంచి కాపాడే చట్టం–2012 (పోక్సో)కు పలు సవరణలు చేసింది. ఇకపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భేటీ వివరాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. చిన్నారులపై అత్యాచారాలతోపాటు మైనర్లపై లైంగికదాడులకు పాల్పడే వారినీ కఠినంగా శిక్షించాలని ఈ సవరణల్లో పేర్కొన్నట్లు తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీని పూర్తిగా అణచివేసేందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తున్న వారికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష విధించేలా పోక్సో చట్టంలో మార్పులు చేశామన్నారు. కఠినమైన శిక్షల ద్వారానే చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు అత్యాచారాలను అదుపుచేసేందుకు వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం పోక్సో చట్టంలోని 2,4,5,6,9,14,15,34,42,45 సెక్షన్లను సవరించింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన మూడో విడతలో భాగంగా.. గ్రామీణప్రాంతాల్లో అనుసంధానతకోసం 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సింగిల్ కోడ్‌లోకి 13 కార్మిక చట్టాలు: 13 కేంద్ర కార్మిక చట్టాలను ఒకే కోడ్ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లు (కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల బిల్లు – 2019)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కార్మికులకు బీమా కవరేజీ పెరిగేందుకు అవకాశముంటుంది. 10 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకు ఈ కోడ్ వర్తిస్తుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. దీంతోపాటు దేశవ్యాప్తంగా అక్రమ డిపాజిట్లను సేకరించే కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ‘నియంత్రణ లేని డిపాజిట్ల పథకం రద్దు బిల్లు’కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరించని డిపాజిట్ల పథకం ఆర్డినెన్స్–2019 స్థానంలో ఈ బిల్లు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లులో చట్ట విరుద్ధంగా డిపాజిట్లను పెంచినట్లయితే అటువంటి సందర్భాల్లో సదరు వ్యక్తులకు శిక్ష, తిరిగి చెల్లించేందుకు తగిన నిబంధనలున్నాయి. ఉద్యోగులకు మెరుగైన సేవా ప్రయోజనాలు చేకూర్చేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు (ఆర్పీఎఫ్) ఆర్గనైజ్డ్ గ్రూప్–ఏ హోదాను కేంద్ర కేబినెట్ కల్పించింది. -
సెన్సెక్స్ తక్షణ మద్దతు 33,750
ఫిబ్రవరి తొలివారంలో ప్రపంచ మార్కెట్లో కరెక్షన్ మొదలైన తర్వాత జరిగిన రికవరీల్లో ప్రపంచ ప్రధాన మార్కెట్లతో పోలిస్తే ఎంతగానో వెనుకబడిన భారత్ మార్కెట్ ప్రస్తుతం అవుట్ ఫెర్ఫార్మ్ చేస్తున్నది. వాస్తవానికి ఫిబ్రవరి కరెక్షన్ తర్వాత అమెరికా, లాటిన్ అమెరికా, కొన్ని ఆసియా సూచీలు వాటి పతనంలో 61.8 శాతం వరకూ కోలుకున్న తర్వాత.. క్షీణబాట పట్టాయి. కానీ ఆయా మార్కెట్లు కోలుకున్న సమయంలో మరింత దిగజారిన భారత్ సూచీలు ఇప్పుడు కీలకమైన ఫిబోనకీ గోల్డెన్ రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 61.8 శాతం కోలుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తున్నది. ఈ క్రమంలో... అంతర్జాతీయ పరిణామాలపరంగా ఎదురయ్యే క్షీణత ఈ వారం పరిమితంగా వుంటే.. కొద్దిరోజుల్లో భారత్ సూచీలు మరో 2 శాతం పెరిగే అవకాశం ఉందని మధ్యకాలిక టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రధాన సూచీల సాంకేతిక అంశాలు ఇలా ఉన్నాయి. సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 13తో ముగిసిన వారంలో స్థిరంగా ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 34,280 పాయింట్ల లక్ష్యం సమీపస్థాయి అయిన 34,313 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 404 పాయింట్ల లాభంతో 34,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడోవారం. తద్వారా ఫిబ్రవరి తొలివారంలో కరెక్షన్ మొదలైన తర్వాత వివిధ కనిష్టస్థాయిల వద్ద నుంచి జరిగిన పలు ర్యాలీలతో పోలిస్తే ఇదే అతిపెద్ద ర్యాలీగా నమోదయ్యింది. దీంతో మార్చి 23నాటి 32,484 పాయింట్లస్థాయిని స్వల్ప, మధ్యకాలాలకు బాటమ్‌గా పరిగణించవచ్చు. అంటే రానున్న రోజుల్లో ఆ స్థాయిని పరిరక్షించుకున్నంతవరకూ ప్రతీ తగ్గుదల తర్వాతా మార్కెట్ మరింత పెరిగే అవకాశాలుంటాయి. ఇక సిరియాపై దాడులు జరిగిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా వుంటే ఈ వారం సెన్సెక్స్‌కు 33,750 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్షీణత 33,500 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ లోపున ముగిస్తే 32,920 పాయింట్ల వరకూ పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 34,465 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ కీలకమైన నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమిస్తే 34,610 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. తొలి నిరోధాన్ని దాటితే కొద్ది రోజుల్లో 34,930 పాయింట్లస్థాయిని కూడా సెన్సెక్స్ అందుకునే వీలుంటుంది. కీలక తక్షణ మద్దతు 10,355 ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ గతవారం క్రమేపీ ర్యాలీ జరుపుతూ చివరిరోజున 10,519 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 10,481 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ తగ్గితే 10,355 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో గనుక కోల్పోతే 10,290 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ కొద్దిరోజుల్లో 10,097 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 10,560 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన గనుక ముగిస్తే 10,630 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. అటుతర్వాత కొద్దిరోజుల్లో 10,705 పాయింట్లస్థాయిని అందుకునే అవకాశం ఉంటుంది. -
గ్రూప్–2 పార్ట్ ఏలో దిద్దుబాట్లు
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల్లోని పార్ట్–ఏలో పొరపాట్లు దిద్దడం, వైట్నర్ వినియోగించడం వంటివి ఉన్నాయని.. పార్ట్–బిలో అలాంటివేవీ కనిపించలేదని హైకోర్టు నియమించిన ముగ్గురు సీనియర్ న్యాయవాదుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. పార్ట్–ఏలో పొరపాట్లు చేసిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాల్సి ఉందని, కానీ వారి జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అనుమతి ఇచ్చిందని పేర్కొంది. 3,147 మంది అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్లలోని పార్ట్–ఏలో 120 మంది పొరపాటు చేసినట్లు టీఎస్పీఎస్సీ తేల్చిందని, వారంతా సర్టిఫికెట్ల ధ్రువీకరణకు ఎంపికయ్యారని వివరించింది. ఇలా పొరపాట్లు చేసినవారి సంఖ్య 120 మంది కంటే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. హడావుడిలో పొరపాట్లలా ఉన్నాయి.. పార్ట్–ఏలో బుక్లెట్, ప్రశ్నపత్రం, టెస్ట్‌బుక్ సిరీస్, రోల్ నంబర్లు తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని.. ఇందులో బబ్లింగ్ రెండు సార్లు చేయడం, అసలు బబ్లింగ్ చేయకపోవడం వంటి తప్పిదాల్ని గుర్తించామని కమిటీ తెలిపింది. అభ్యర్థులు హడావుడిలో పొరపాట్లు చేశారని అనిపిస్తోందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారా, ఎందుకు చేశారన్నదానిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. ‘‘టాప్‌లో ఉన్న ఐదువేల మంది అభ్యర్థుల్లో ఇలాంటి పొరపాట్లు చేసినవారెవరైనా వివక్ష లేకుండా ఎంపిక చేశారు. ఆ తప్పులు అభ్యర్థి శక్తి సామర్థ్యాలను ప్రభావితం చేసేవిగా అనిపించడం లేదు. స్కానింగ్ ఏజెన్సీ గుర్తించేలా ఓఎంఆర్ జవాబు పత్రాలున్నాయి. అభ్యర్థుల పత్రాలు తారుమారు కాలేదు. ఓఎంఆర్ షీట్లలో టీఎస్పీఎస్సీ జోక్యం ఉన్నట్లు కనిపించలేదు. కొట్టివేతలు, దిద్దుబాట్లు సరిచేయాలంటే.. షార్ట్ లిస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల పత్రాలను నేరుగా పరిశీలన చేయాల్సిన అవసరముంది. కానీ అలా చేయలేదు..’’అని కమిటీ పేర్కొంది. వైట్నర్ వివాదంతో.. గ్రూప్–2 పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓఎంఆర్ షీట్లలో వైట్నర్ వినియోగించారని, తప్పులు చేసిన అభ్యర్థులను కూడా ఎంపిక చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన రాజశేఖర్‌రెడ్డి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు.. ఆ జవాబు పత్రాల పరిశీలన కోసం ముగ్గురు సీనియర్ న్యాయవాదులు పి.శ్రీరఘురాం, ఆర్.రఘునందన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అభ్యర్థుల పత్రాలను పరిశీలించి హైకోర్టుకు నివేదిక అందజేసింది. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయమూర్తి.. పిటిషనర్లు వాదనలు తెలియజేసేందుకు విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు. -
ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ
కడప సెవెన్‌రోడ్స్ : జాతీయ ఓటర్ల జాబితా శుద్ధీకరణ–2016 కార్యక్రమం కింద ఓటర్ల జాబితాలో ఉన్న తçప్పులను నిర్ణీత సమయంలో సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. బుధవారం కొత్త కలెక్టరేట్లో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో సరిహద్దులతో కూడిన పోలింగ్ కేంద్రాల పటాన్ని తయారు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేసిన విధంగా నజర్ నక్ష, మ్యాపింగ్ తదితర అంశాలతో అన్ని మున్సిపాలిటీల పరిధిలోని కమిషనర్లు, సాంకేతిక సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించి ఓటర్ల ఫోటోను సరిచూసి డిజటలైజేషన్ చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్‌కు మ్యాపింగ్‌ను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిదిలో ఓటర్ల సంఖ్య 1000 నుంచి 1100 లోపు ఉండేలా మ్యాపింగ్ సిద్దం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉండి అక్కడ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకుంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తయారు చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కాలపరిమితిలోపు ఓటర్ల జాబితా శుద్దీకరణ జరగాలన్నారు. కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం కొత్త కలెక్టరేట్లో గోడౌన్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు, క్లెయిమ్స్, ఆక్షేపణలు ఒక వారం రోజుల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో సులోచన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
2016 నుంచి సీఏ కొత్త సిలబస్
ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు * అంతర్జాతీయ ప్రమాణాలతో కరికులమ్ * మహిళా సీఏల కోసం ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్.. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి టాస్క్‌ఫోర్స్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న అకౌంటింగ్ నిబంధనలు, పన్ను చట్టాలకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. 2016 కల్లా కొత్త కరికులమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ఉంటుందన్నారు. శనివారం ఐసీఏఐ ‘కంపెనీల చట్టం, ప్రత్యక్ష పన్నులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రఘు విలేకరులతో మాట్లాడారు.అంతర్జాతీయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అధిక డిమాండ్ ఉందని, ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వాళ్లకి విదేశాల్లో అధిక జీతాలకు ఉద్యోగాలు లభిస్తున్నయన్నారు. గతేడాది పరీక్ష రాసిన వాళ్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటే ఈ కోర్సు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చని, అందుకే ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రారంభ వేతనంగా ఏడు లక్షల నుంచి గరిష్టంగా రూ. 21 లక్షల వరకు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 20 కేంద్రాల్లో క్యాంపస్ నియామకాలు జరిపామని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఐటీ, ఈకామర్స్ రంగాల నుంచి డిమాండ్ బాగుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించే విధంగా క్లౌడ్ క్యాంపస్, 120 రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్ ప్రాక్టీసులో ఉన్న మహిళా సభ్యులు కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి దూరమవుతున్నారని, వీరు ఇంటి దగ్గర నుంచే సేవలను అందించే విధంగా ‘ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 40,000 మంది మహిళా సీఏలు ఉండగా ఈ పోర్టల్ ఇప్పటి వరకు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి సేవలను ఉపయోగించుకోవడానికి 150 కంపెనీలు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో కంపెనీల చట్టంలో సవరణలు కొత్త కంపెనీల చట్టంలో సీఏలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని నిబంధనలను మార్చడానికి కేంద్రం అంగీకరించిందని, దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణలు జరగొచ్చన్నారు. ముఖ్యంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20కి మించి కంపెనీల్లో పనిచేయకూడదన్న నిబంధనలో ప్రైవేటు కంపెనీలకు మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే ఆడిట్ రొటేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను కూడా సవరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రీ బడ్జెట్ మెమొరాండం తుది దశలో ఉందని, ఈ నెలాఖరుకి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ కోసం టాస్క్ ఫోర్స్ కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సూచనలు సలహాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, జనధన యోజన పథకాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.