ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ
కడప సెవెన్‌రోడ్స్ :
జాతీయ ఓటర్ల జాబితా శుద్ధీకరణ–2016 కార్యక్రమం కింద ఓటర్ల జాబితాలో ఉన్న తçప్పులను నిర్ణీత సమయంలో సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. బుధవారం కొత్త కలెక్టరేట్‌లో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ నియోజకవర్గాల ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో సరిహద్దులతో కూడిన పోలింగ్ కేంద్రాల పటాన్ని తయారు చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేసిన విధంగా నజర్ నక్ష, మ్యాపింగ్ తదితర అంశాలతో అన్ని మున్సిపాలిటీల పరిధిలోని కమిషనర్లు, సాంకేతిక సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించి ఓటర్ల ఫోటోను సరిచూసి డిజటలైజేషన్ చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్‌కు మ్యాపింగ్‌ను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిదిలో ఓటర్ల సంఖ్య 1000 నుంచి 1100 లోపు ఉండేలా మ్యాపింగ్ సిద్దం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య అధికంగా ఉండి అక్కడ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకుంటే సమీపంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తయారు చేసేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కాలపరిమితిలోపు ఓటర్ల జాబితా శుద్దీకరణ జరగాలన్నారు. కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం కొత్త కలెక్టరేట్‌లో గోడౌన్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ల జాబితాలో సవరణలు, క్లెయిమ్స్, ఆక్షేపణలు ఒక వారం రోజుల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్వో సులోచన, ఇతర అధికారులు పాల్గొన్నారు.