ఓటర్ల జాబితాలో ఆధార్ సంఖ్య ముద్రించ వద్దు
సుప్రీం ఆదేశాల నేపధ్యంలో అప్రమత్తం
సీఈఓ భన్వర్‌లాల్
కడప సెవెన్‌రోడ్స్ : ఓటర్ల జాబితాలు, ఓటరు స్లిప్పులలో ఆధార్ సంఖ్యలు ముద్రించవద్దని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓటర్ల జాబితాలను ఆధార్‌తో సీడింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితాలను ఫ్యూరిఫై చేయడం కోసమేనని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్, బ్యాంకు ఖాతా, వాహనాల నమోదు, డ్రైవింగ్ లెసైన్స్‌లు, పెన్షన్లు లాంటి ప్రతి పనిని ఆధార్‌తో లింకు పెడుతోంది. ప్రభుత్వం నుంచి సేవలు, రాయితీలు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయకూడదని రెండేళ్ల క్రితమే సుప్రీం కోర్టు ఆదేశించింది.
అయితే, సుప్రీం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసి ప్రతి దాన్ని ఆధార్‌తో లంకె పెడుతోంది. ఈ విషయమై ఇటీవల సుప్రీం కోర్టు మండిపడుతూ తమకు వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపధ్యంలో ఓటర్ల జాబితాల్లో ఆధార్ సంఖ్య ముద్రిస్తే సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడ్డ సీఈఓ వెంటనే మేల్కొని ఆధార్ సంఖ్యలో ముద్రించవద్దంటూ ఇచ్చిన ఆదేశాలు శనివారం కలెక్టరేట్‌కు వచ్చాయి. అయితే, అధికారుల డేటా బేస్‌లో మాత్రమే ఓటర్ల పేరు పక్కన వారి ఆధార్ సంఖ్య ఉంటుంది. ఇందువల్ల ఓటింగ్ సమయాల్లో అక్రమాలు జరగకుండా చూడగలుగుతామని అధికారులు అంటున్నారు.
ఆధార్ సీడింగ్‌లో రెండవ స్థానంలో జిల్లా..
ఓటర్ల జాబితాలను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా, కడపజిల్లా రెండవస్థానంలో ఉంది. జిల్లాలో 21,71,522 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 20,80,850 (95.8 శాతం) మందికి ఆధార్ సీడింగ్ నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలో వంద శాతం ఆధార్ సీడింగ్ జరిగింది. ఇక బద్వేలులో 99.84 శాతం, కమలాపురంలో 99.79 శాతం, రాజంపేటలో 99.72 శాతం, జమ్మలమడుగులో 99.70 శాతం ఆధార్ సీడింగ్ నిర్వహించారు. వందశాతం ఆధార్‌సీడింగ్ 34 మండలాల్లో జరిగింది. 99 శాతం కంటే ఎక్కువ ఆధార్ సీడింగ్ జరిగిన మండలాలు 10 ఉండగా, ఆరు మండలాల్లో 90 శాతం కంటే అధికంగా జరిగింది. కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే 72 శాతంతో తక్కువ స్థానంలో ఉంది.