ఇటీవల స్టాక్ మార్కెట్‌లో కొంత కరెక్షన్ వచ్చింది కదా.. భారీ దిద్దుబాటుకు అవకాశం ఉందా? వస్తే లాభాలు, పెట్టుబడులను కాపాడుకోవడం ఎలా?– నవీన్
కరెక్షన్ కనిపించింది. కానీ, గణనీయంగా ఏమీ పడిపోలేదు. ఆ తర్వాత నుంచి స్థిరంగా కోలుకోవడాన్ని చూస్తున్నాం. భారీ పతనం రానున్నదా? అంటే నిజంగా లేదనే చెప్పుకోవాలి. కానీ, నిజం ఏమిటంటే స్వల్పకాలంలో ఏమి జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు. ఇక్కడి నుంచి గణనీయంగా పెరిగిపోవచ్చు. ఖరీదైన మార్కెట్ వ్యాల్యూషన్‌ను చాలా కంపెనీలు ఆశించొచ్చు. అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వ్యాల్యూషన్లు ఖరీదుగా అనిపిస్తున్నప్పటికీ, ఇవి ముందుకే వెళ్లొచ్చు. కనుక స్వల్పకాలానికి అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో అంటే వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఈ కంపెనీల ఆదాయాలు, లాభాలు మరింత వృద్ధి చెందొచ్చు. దీర్ఘకాలానికి మార్కెట్ పట్ల నేను ఎంతో నమ్మకంతో ఉన్నాను.
అయితే, అదే కాలంలో కొన్ని కంపెనీలు ప్రతికూలతలను చూడొచ్చా? అంటే అవుననే నా సమాధానం. మార్కెట్‌లో ఈ తరహా కంపెనీలు ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది ఐపీవోల్లో ఖరీదైన వ్యాల్యూషన్లకు స్టాక్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఏడాది, రెండేళ్ల తర్వాత లాభాలు రాకపోతే అంత ఖరీదుపెట్టి ఎందుకు కొన్నామా? అని అనిపించొచ్చు. ఇప్పుడైతే వాటి ధరలు పెరుగుతూ వెళుతుండడం పట్ల ఇన్వెస్టర్లు సౌకర్యంగానే ఉన్నారు. దీంతో ఆయా స్టాక్స్ వ్యాల్యూషన్ సరైనదేనన్న భావనతో ఉన్నారు. కానీ, కంపెనీల ఆర్థిక మూలాల ఆధారంగా విశ్లేషణ చేస్తే అప్పుడు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. భారీ కరెక్షన్, ఆతర్వాత ఏకధాటిగా ర్యాలీని ఎవరూ ఊహించలేరు. కనుక అటువంటి ప్రశ్నలకు సమాధానం లభించదు. కాకపోతే మన పెట్టుబడులు, లాభాలను ఎలా కాపాడుకోవాలి? అంటే అందుకు మార్గముంది. అదే రీబ్యాలన్స్. మీరు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నట్టయితే స్థిరాదాయ (ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ) పథకాలకు ఎంతో కొంత కేటాయింపులు చేసుకోవాలి. అది 25% లేదా 50 శాతమా అన్నది మీ ఎంపికే. ఒకవేళ మీ పెట్టుబడుల కేటాయింపులు ఈక్విటీ, డెట్‌కు 50:50 శాతం చొప్పున నిర్ణయించుకున్నారని అనుకుందాం. మార్కెట్ ఇక్కడి నుంచి పెరిగిపోయి మొత్తం పెట్టుబడుల్లో మీ ఈక్విటీ భాగం 50% నుంచి 60 శాతానికి చేరి.. డెట్ పెట్టుబడుల విలువ 40 శాతానికి తగ్గిందనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సిందల్లా.. 60 శాతంగా ఉన్న ఈక్విటీని 50 శాతానికి తగ్గించుకోవాలి. అంటే 10% మేర ఈక్విటీ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. దీన్ని లాభాల స్వీకరణగా చూడొచ్చు. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాంతో ఈక్విటీ, డెట్ మళ్లీ 50:50 శాతంగా ఉంటుంది. ఒకవేళ ఈక్విటీ మార్కెట్ పడిపోయి మీ 50% వాటా కాస్తా 40 శాతానికి తగ్గిపోయి, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులు 60 శాతంగా ఉన్నాయనుకోండి. అప్పుడు మొత్తం పెట్టుబడిలో ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ భాగం 50 శాతానికి తగ్గిపోయే విధంగా విక్రయాలు చేపట్టాలి. ఆ మొత్తాన్ని ఈక్విటీలోకి మళ్లించుకోవాలి. నూరు శాతం ఈక్విటీ లేదా నూరు శాతం డెట్ పెట్టుబడులు చాలా ప్రమాదకరం.
మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి తరుగుదలను హెడ్జ్ చేసుకునేందుకు వీలుగా ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు – రోణాక్ షా
రూపాయి తరుగుదల అన్నది వాస్తవం. ఐదు, పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చిన్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే సరైనది. సామర్థ్యం, మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీయ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఒకవేళ మీరు ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.
- ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్)
చదవండి:జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి!
Comments
Please login to add a commentAdd a comment