ఐదేళ్ల నా కుమారుని భవిష్యత్తు అవసరాల కోసం రూ.లక్షను ఇన్వెస్ట్ చేద్దామన్నది నా ఆలోచన. ఇందుకోసం ఫ్లెక్సీక్యాప్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో ఏ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి? ఒక్కటే పథకాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఎక్కువ పథకాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా?
– సునీల్, వైజాగ్
రెండు రకాల విభాగాలూ మీ లక్ష్యానికి అనుకూలంగానే ఉంటాయి. గడిచిన మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. మార్కెట్లలో ఉద్దాన, పతనాలను చూసే ఉంటారు. ముఖ్యంగా గతేడాది మార్చిలో మార్కెట్లు సగానికి కుప్పకూలినప్పుడు ఆందోళన చెంది ఉండకపోవచ్చు. ఇదే నిజమైతే అగ్రెస్సివ్ ఫండ్ విభాగంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐదేళ్ల కుమారుని ఉన్నత విద్యావసరాలకు ఇన్వెస్ట్ చేయాలన్నది మీ లక్ష్యం. కనుక కనీసం 10–15 ఏళ్ల పాటు మీ పెట్టుబడులను కొనసాగించగలరు. మార్కెట్ల అస్థిరతలను జీర్ణం చేసుకోగల శక్తి ఉంటే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నుంచి అధిక రాబడులను అందుకోవచ్చు. అయితే, చాలా మంది ఇన్వెస్టర్లకు ఇది కష్టంగా అనిపించొచ్చు. కొత్తగా వచ్చే చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విలువ వేగంగా తగ్గిపోతుంటే ఆందోళనకు గురికావడం సహజం. అటువంటి ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో ఫ్లెక్సీక్యాప్‌ను కూడా పరిగణనలోకి తీసుకోరాదు. అటువంటి వారు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కే పరిమితం కావడం మంచిది. మీ ప్రశ్నను పరిశీలిస్తుంటే అనుభవం కలిగిన ఇన్వెస్టర్ మాదిరే ఉన్నారు. అదే వాస్తవం అయితే ఫ్లెక్సీ క్యాప్ లేదా అగ్రెస్సివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయగలరు. అగ్రెస్సివ్ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటే కనీసం రెండు భిన్నమైన పథకాలను ఎంపిక చేసుకోండి. ఫ్లెక్సీక్యాప్ పథకం ఎంపిక చేసుకుంటే కనుక ఒక్క పథకం సరిపోతుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఎక్కువ వైవిధ్యంతో ఉంటాయి కనుక మీ అవసరాలకు ఒక్కటి సరిపోతుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగంలో యాక్సిస్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ పథకాల్లో డీఎస్‌పీ మిడ్‌క్యాప్ ఫండ్‌లేదా ఎస్‌బీఐ స్మాల్‌క్యాప్ ఫండ్ లేదా కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్‌లను పరిశీలించొచ్చు.
అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో 45–60 ఏళ్లలోని వారు తమ పెట్టుబడుల కేటాయింపులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా? క్రమం తప్పకుండా ఆదాయం కోసం (రెగ్యులర్) నాన్ పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ సేవింగ్స్ పథకాలను పరిశీలించొచ్చా?
– పాయల్, కడప
రిటైర్మెంట్ (ఉద్యోగ, వృత్తి జీవితానికి విరామం పలకడం)కు మీరు ఎంత సమీపంలో ఉన్నారనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అవుతుంది. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉంటే పెట్టుబడులను స్థిరాదాయ పథకాలవైపు ఎక్కువగా మళ్లించాలి. అయితే ఇతర అంశాలు కూడా ఇక్కడ ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆదాయం కోసం పెట్టుబడులపై ఆధారపడినట్టయితే భిన్నంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. స్థిరాదాయ పథకాలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. ఆదాయం కోసం పెట్టుబడులపై ఆధారపడాల్సిన అవసరం లేకపోతే అప్పుడు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవచ్చు. ఆదా యం కోసం పెట్టుబడులపై ఆధారపడరు కనుక ఈక్విటీల్లో పెట్టుబడుల గురించి ఆందోళన చెందా ల్సిన పరిస్థితి ఎదురుకాదు. అందుకే మీరు ఏ వయసులో ఉన్నారు, మీ అవసరాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థ లు విక్రయించే నాన్ లింక్డ్ సేవింగ్స్ పథకాలను మీరు పరిశీలిస్తున్నట్టయితే వద్దన్నదే నా సూచన. ఈ ప్లాన్‌లు బీమా, పెట్టుబడులతో కలసి ఉంటా యి. కనుక గొప్ప సాధనం కాదు. తక్కువ వ్యయాలతో కూడిన డెట్ ఫండ్ లేదా తక్కువ వ్యయాలతో కూడిన ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను పెట్టుకోవచ్చు. దీనివల్ల మెరుగైన రాబడులు అందుకోగలరు. బీమా, పెట్టుబడులతో కూడిన సాధనానికి దూరంగా ఉండి.. మీ పరిస్థితులకు అనుగుణంగా అనువైన సాధనాన్ని ఎంపిక చేసుకోండి.
::ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment