ఫిబ్రవరి తొలివారంలో ప్రపంచ మార్కెట్లో కరెక్షన్ మొదలైన తర్వాత జరిగిన రికవరీల్లో ప్రపంచ ప్రధాన మార్కెట్లతో పోలిస్తే ఎంతగానో వెనుకబడిన భారత్ మార్కెట్ ప్రస్తుతం అవుట్ ఫెర్‌ఫార్మ్ చేస్తున్నది. వాస్తవానికి ఫిబ్రవరి కరెక్షన్ తర్వాత అమెరికా, లాటిన్ అమెరికా, కొన్ని ఆసియా సూచీలు వాటి పతనంలో 61.8 శాతం వరకూ కోలుకున్న తర్వాత.. క్షీణబాట పట్టాయి. కానీ ఆయా మార్కెట్లు కోలుకున్న సమయంలో మరింత దిగజారిన భారత్ సూచీలు ఇప్పుడు కీలకమైన ఫిబోనకీ గోల్డెన్ రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 61.8 శాతం కోలుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తున్నది. ఈ క్రమంలో... అంతర్జాతీయ పరిణామాలపరంగా ఎదురయ్యే క్షీణత ఈ వారం పరిమితంగా వుంటే.. కొద్దిరోజుల్లో భారత్ సూచీలు మరో 2 శాతం పెరిగే అవకాశం ఉందని మధ్యకాలిక టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రధాన సూచీల సాంకేతిక అంశాలు ఇలా ఉన్నాయి.
సెన్సెక్స్ సాంకేతికాలు...
ఏప్రిల్ 13తో ముగిసిన వారంలో స్థిరంగా ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 34,280 పాయింట్ల లక్ష్యం సమీపస్థాయి అయిన 34,313 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 404 పాయింట్ల లాభంతో 34,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడోవారం. తద్వారా ఫిబ్రవరి తొలివారంలో కరెక్షన్ మొదలైన తర్వాత వివిధ కనిష్టస్థాయిల వద్ద నుంచి జరిగిన పలు ర్యాలీలతో పోలిస్తే ఇదే అతిపెద్ద ర్యాలీగా నమోదయ్యింది. దీంతో మార్చి 23నాటి 32,484 పాయింట్లస్థాయిని స్వల్ప, మధ్యకాలాలకు బాటమ్‌గా పరిగణించవచ్చు. అంటే రానున్న రోజుల్లో ఆ స్థాయిని పరిరక్షించుకున్నంతవరకూ ప్రతీ తగ్గుదల తర్వాతా మార్కెట్ మరింత పెరిగే అవకాశాలుంటాయి. ఇక సిరియాపై దాడులు జరిగిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా వుంటే ఈ వారం సెన్సెక్స్‌కు 33,750 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్షీణత 33,500 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ లోపున ముగిస్తే 32,920 పాయింట్ల వరకూ పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 34,465 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ కీలకమైన నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమిస్తే 34,610 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. తొలి నిరోధాన్ని దాటితే కొద్ది రోజుల్లో 34,930 పాయింట్లస్థాయిని కూడా సెన్సెక్స్ అందుకునే వీలుంటుంది.
కీలక తక్షణ మద్దతు 10,355
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గతవారం క్రమేపీ ర్యాలీ జరుపుతూ చివరిరోజున 10,519 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 10,481 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ తగ్గితే 10,355 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో గనుక కోల్పోతే 10,290 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ కొద్దిరోజుల్లో 10,097 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 10,560 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన గనుక ముగిస్తే 10,630 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. అటుతర్వాత కొద్దిరోజుల్లో 10,705 పాయింట్లస్థాయిని అందుకునే అవకాశం ఉంటుంది.
సెన్సెక్స్ తక్షణ మద్దతు 33,750
Published Mon, Apr 16 2018 1:57 AM | Last Updated on Mon, Apr 16 2018 1:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment