World Market
-
ప్రపంచ వాణిజ్యంలో ఎక్కడున్నాం..?
జూన్ నెలలో దేశ ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా 2 శాతమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ప్రపంచంలోని ఏ దేశానికైనా ఇది అత్యధికం. దేశంలోని చాలా పరిశ్రమలు స్థానిక అవసరాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదు. దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం ఎగుమతులు పెరగకపోవడానికి మరో కారణం. అయితే ఐటీ, వ్యాపార సేవల విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాం. ఇది సానుకూలాంశం. విదేశాలతో వ్యాపారం చేయడం భారత్‌కు చాలా పాతవిద్య. ఆర్థిక వ్యవస్థ గణనీయంగా, వేగంగా క్షీణించిన వలస పాలకుల ఏలుబడిలోనూ చైనా సహా ఇతర ఇరుగు పొరుగు దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించిన ఘనత మనది. అయితే శతాబ్దాల విదేశీ వ్యాపార అనుభవమున్నప్పటికీ పలు దశాబ్దాలుగా విదేశీ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అతి బలహీనమైన లంకెలా మిగిలిపోయింది. 2022–23లో వర్తకపు సరుకుల ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మళ్లీ తగ్గి పోయింది. జూన్ నెలలో ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనానికి, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలకు ఇది నిదర్శనం. అయితే ఇక్కడ ఓ సానుకూల అంశం లేకపోలేదు. సేవల ఎగు మతులు ఇప్పటికీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వాణిజ్యం ప్రతికూల పరిస్థితులను కాదని ముందుకు సాగుతున్నది. సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. సేవల రంగంలో భారత్ భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 4.9 శాతానికి చేరుకున్నట్లు మోర్గన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక తెలియజేయడం చెప్పుకోవాల్సిన అంశం. ఇది ప్రధానంగా ఐటీ సేవల (46 శాతం) వల్లనే. దీంతోపాటు వ్యాపార సేవలు కూడా 24 శాతంతో తమదైన ముద్ర వేశాయి. సేవల విషయంలో పరిస్థితి ఇలా ఉంటే, వస్తువుల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. వస్తువుల ఎగుమతులు అమెరికా, యూరప్ వంటి మార్కెట్ల డిమాండ్లపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. మన పొరుగునే ఉన్న చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ఒక దేశానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది ఎక్కువ. శేష ప్రశ్నలు ఎన్నో... దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో మన పాత్ర పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఎగుమతుల విషయంలో వెనుకబడి ఉండేందుకు కారణాలేమిటి? మొదటిది... దేశీ మార్కెట్ ఒకటి లేకపోవడం. దేశీ మార్కెట్ ఒకటి ఉండి ఉంటే స్థానిక చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ఇక్కడే వ్యాపారం చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశీ మార్కెట్లను వెతుక్కునే శ్రమ తగ్గుతుంది. దేశంలో కొన్ని పరిశ్రమలు కేవలం ఎగుమతులపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని సంప్రదాయ రంగాలకు చెందినవీ ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్, హస్తకళలు, జ్యువెలరీ, రంగురాళ్లు వంటివి. వీటితోపాటు ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువులు, రిఫైన్డ్ నూనె ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చాలా పరిశ్రమలు స్థానికంగా మార్కెట్ అవస రాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. ఇంకోలా చెప్పాలంటే స్థానిక పరిశ్రమలు సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదన్నమాట. ఎగుమతులు పెరగకపోవడానికి రెండో లోపం... దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం. ప్రపంచ వాణిజ్య సంస్థపై మనం చాలాకాలం ఆశలు పెట్టుకున్నాం. ఎదుగు తున్న మార్కెట్లకు కొన్ని లాభాలు అందిస్తుందని ఆశపడ్డాం. ఈ క్రమంలో ప్రాంతీయ లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకునే సమయం కాస్తా మాయమైపోయింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగ స్వామ్యం (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్ట్నర్షిప్–ఆర్సీఈపీ) నుంచి వైదొలగాలన్న నిర్ణయం కూడా ఆచితూచి తీసుకున్నదే. ఏదో ఒక దేశం ద్వారా చైనా తన చౌక వస్తువులను దేశంపై గుమ్మరిస్తుందన్న ఆందోళన కూడా ఉండింది. అయినా కూడా... ఇతర ప్రాంతీయ వాణిజ్య గ్రూపుల్లోకి చేరే దిశగా చాలాకాలం క్రితమే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. ఉదాహరణకు... పదకొండు మంది సభ్యులున్న ‘కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్’ (సీపీటీపీపీ). ఈ వ్యాపార వర్గంలో చేరి ఉంటే దేశ విదేశీ వ్యాపారం, ఎగుమతులు పెరిగేందుకు తగిన సహకారం లభించి ఉండేది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆస్ట్రేలియా, జపాన్, మలేసియాలు భాగస్వాములుగా ఉండి... అతి జాగ్రత్తగా చైనా లేకుండా చేసుకున్న వ్యాపార వర్గంలో చేరేందుకు భారత్ ప్రయత్నించాలి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే... యూరోపి యన్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందం పదేళ్లుగా అమల్లో లేకుండా పోయింది. భారత్‌కున్న అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈ ప్రాంతంతోనూ వాణిజ్య ఒప్పందం విషయమై ఇటీవలే చర్చలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తూ దేశంలోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగం కావడం దేశ హితం కోసమే అన్న భావన ప్రబలుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఇలాంటి ఒప్పందాలు ఇటీవలే కుదరడం గమనార్హం. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్, యునైటెడ్ కింగ్డమ్లతోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. మళ్లీ వెనక్కి? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఏడేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ఒప్పందం చేసు కోవడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు చర్చలు ఒక్కటే మార్గమని ఇటీవలే గుర్తించి ఆ దిశగా ముందుకు కదులుతూండటం హర్షించదగ్గ విషయం. పర్యావరణం, లేబర్, డిజిటల్ వాణిజ్యం వంటి వాణిజ్యేతర అంశాలను కూడా ఇప్పుడు చర్చి స్తున్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదిరితే చాలా లాభాలుంటాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ వంటి హైటెక్ దేశాల్లో మన దేశానికి చెందిన నిపుణులు పనిచేయడం సులువు అవుతుంది. చివరగా... ఎగుమతులు మరింత జోరు అందుకునేందుకు ఉన్న ఇంకో అవరోధం ఇటీవలి కాలంలో పెరిగిపోయిన రక్షణాత్మక ధోరణులు. దిగుమతులకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. విదేశీ తయారీదారుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయులు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. స్థానికంగా పారిశ్రామిక రంగానికి సహాయం అవసరమని అనుకుంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటివి ఉండనే ఉన్నాయి. దిగుమతి చేసుకునే వస్తువులు మరింత ఖరీదు చేయడం కంటే దేశీ తయారీ రంగం ఊపందుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు సరిపోతాయి. ఆత్మ నిర్భర్ భారత్ విధానం కూడా గతంలోని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్(దిగుమతికి ప్రత్యామ్నాయం) విధానాన్ని గుర్తు చేస్తోంది. లైసెన్స్ రాజ్ కాలంలో ఇది చాలా ప్రధానమైందన్నది తెలిసిందే. దేశంలో ఇప్పటికే దిగుమతి సుంకాలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అవి చైనా, ఆగ్నేయాసియా దేశాల సుంకాలకు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి మారితేనే భారత్ అంతర్జాతీయ వాణిజ్య విపణిలో కీలక పాత్ర పోషించగలుగుతుంది. వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్ ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘కరోనా’కు మందు! మార్కెట్ ముందుకు...
కరోనా వైరస్ చికిత్సలో అమెరికా గిలీడ్ ఔషధం సత్ఫలితాలు ఇస్తుండటంతో గురువారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ఏప్రిల్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జోరుగా సాగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం, పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వనున్నదన్న అంచనాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను దశలవారీగా తొలగించనుండటం... ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 33,500 పాయింట్లపైకి, నిఫ్టీ 9,850 పాయింట్లపైకి ఎగబాకాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి. వారంలో నిఫ్టీ 8 శాతం అప్... ఈ వారంలో సెన్సెక్స్ 2,390 పాయింట్లు, నిఫ్టీ 706 పాయింట్ల మేర లాభపడ్డాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 7.6 శాతం, నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి. గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వార లాభం. ఏప్రిల్ నెలలో సెన్సెక్స్ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వాహన, చమురు, గ్యాస్, లోహ, ఐటీ షేర్లు కూడా జోరుగా పెరిగాయి. ► ఓఎన్జీసీ షేర్ 13.4 శాతం లాభంతో రూ.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు చెరో 3 శాతం ఎగిశాయి. ► 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు–సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి. ► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ కన్సూమర్, రిలయన్స్ క్యాపిటల్, ఐనాక్స్ విండ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► టాటా మోటార్స్‌కు చెందిన చైనా ప్లాంట్లలో 70 శాతం మేర ఉత్పత్తి మొదలైందని, రిటైల్ షోరూమ్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయన్న వార్తలతో టాటా మోటార్స్ షేర్ 19 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు ఇతర వాహన షేర్లు కూడా మంచి లాభాలు సాధించాయి. 4 రోజులు...రూ.7.68 లక్షల కోట్లు గత 4 రోజుల లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.7 లక్షల కోట్ల మేర ఎగసింది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 7,68,168 కోట్లు ఎగసి రూ.129.41 లక్షల కోట్లకు చేరింది. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ జరగదు. -
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
ప్రపంచ మార్కెట్లు పతనమైనా, మన మార్కెట్ మాత్రం గురువారం లాభపడింది. దీంతో మూడు రోజుల సెన్సెక్స్, నాలుగు రోజుల నిఫ్టీ నష్టాలకు బ్రేక్ పడింది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు లాభపడటం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల (ఇంట్రాడేలో)మేర పతనమైనా, ముడి చమురు ధరలు 1 శాతం మేర(ఏడు వారాల కనిష్ట స్థాయికి) పతనం కావడం, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్‌ల క్యూ3 ఫలితాలు బాగా ఉండటం.... సానుకూల ప్రభావం చూపించాయి. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు కారణంగా స్టాక్ సూచీల్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో 299 పాయింట్ల మేర లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 271 పాయింట్లు పెరిగి 41,386 పాయింట్ల వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 12,180 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆసియా మార్కెట్లకు ‘కరోనా’ దెబ్బ.. కరోనా వైరస్ చైనాలో మరింత ప్రబలడం, ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ సంబంధిత కేసులు వెలుగులోకి రావడంతో ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ సూచీలు 2.75% నష్టపోయాయి. నేటి నుంచి ఐటీఐ ఎఫ్‌పీఓ ►ప్రభుత్వ రంగ ఐటీఐ కంపెనీ ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28న పూర్తయ్యే ఈ ఎఫ్‌పీఓ ద్వారా రూ.1,400 కోట్లు సమీకరించనున్నది. ఈ ఇష్యూకు ప్రైస్‌బాండ్‌గా రూ.72–77ను కంపెనీ నిర్ణయించింది. ►ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లలో (డెట్) విదేశీ పోర్టిఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)ల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రాబట్టడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. -
బడ్జెట్.. ముంచెన్!
విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను పోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 38,800 పాయింట్ల దిగువకు, నిఫ్టీ, 11,600 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 907 పాయింట్ల వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 793 పాయింట్ల నష్టంతో 38,721 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఇంట్రాడేలో 288 పాయింట్ల మేర క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 11,559 పాయింట్ల వద్దకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఈ ఏడాది బాగా నష్టపోయింది ఈ రోజే. సెన్సెక్స్, నిఫ్టీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, 2016, ఏప్రిల్ తర్వాత ఈ సూచీలు అత్యధికంగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక, వాహన, చమురు షేర్లు బాగా నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. అంచనాలు తల్లకిందులు... మందగమనంలో ఉన్న వినియోగ రంగానికి జోష్‌నివ్వడానికి కేంద్రం బడ్జెట్లో తాయిలాలు ఇవ్వగలదని అందరూ అంచనా వేశారని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. ఈ అంచనాలన్నీ తల్లకిందులు కావడం, మరోవైపు రానున్న ఆర్థిక ఫలితాలు మరింత అధ్వానంగా ఉండబోతున్నాయన్న ఆందోళనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని వివరించారు. సెన్సెక్స్ భారీ నష్టాల్లో ఆరంభమైంది. రోజు గడుస్తున్న కొద్దీ ఎలాంటి ఊరటలేకపోగా, ఈ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► ఇటీవల ప్రతిరోజూ ఆల్‌టైమ్ హైలను తాకుతున్న బజాజ్ ఫైనాన్స్ షేర్ 8 శాతం నష్టంతో రూ.3,415 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► అమ్మకాలు తగ్గుతుండటంతో వాహన కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయన్న వార్తలు వాహన షేర్లను పడగొట్టాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతీ సుజుకీ 5.2 శాతం, టాటా మోటార్స్ 3.4 శాతం, బజాజ్ ఆటోలు 2 శాతం చొప్పున నష్టపోయాయి. ► ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఓఎన్జీసీ 5.4 శాతం, ఎల్ అండ్ టీ 4.3 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.85 శాతం చొప్పున కుదేలయ్యాయి. ► పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్ భారీగా పతనమైంది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించిన ఖాతాలో రూ.3,800 కోట్ల మోసం జరిగిందన్న విషయం వెలుగులోకి రావడంతో బీఎస్ఈలో పీఎన్బీ షేర్ 11 శాతం నష్టంతో రూ.72.80 వద్ద ముగిసింది. ► ఎల్ అండ్ టీ కంపెనీ ఇటీవలనే బలవంతంగా చేజిక్కించుకున్న మైండ్‌ట్రీ షేర్ 10 శాతం నష్టంతో రూ.774 వద్ద ముగిసింది. మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు కృష్ణకుమార్ నటరాజన్, ఎన్ఎస్. పార్థసార«థి, రోస్టో రావణన్‌లు తమ తమ డైరెక్టర్ల పదవులకు, కంపెనీ పదవులకు రాజీనామా చేయడం దీనికి కారణం. ► దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్; హీరో మోటోకార్ప్, ఈరోస్ మీడియా, ఎస్కార్ట్స్, సన్ టీవీ, కాక్స్ అండ్ కింగ్స్, గోవా కార్బన్, గ్రాఫైట్ ఇండియా తదితర షేర్లు ఈ పతన జాబితాలో ఉన్నాయి. ► ఎల్ అండ్ టీ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా డౌన్‌గ్రేడ్ చేయడంతో ఎల్ అండ్ టీ షేర్ 4% నష్టంతో రూ.1,490 వద్ద ముగిసింది. ఎందుకు పడిందంటే... ఎఫ్‌పీఐలపై పన్ను సంపన్న వర్గాలపై మరింత పన్ను విధించాలన్న ప్రతిపాదన.. భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న 2,000కు పైగా విదేశీ ఫండ్స్‌పై తీవ్రంగానే ప్రభావం చూపగలదని నిపుణులంటున్నారు. ట్రస్ట్‌ల మార్గంలో భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న ఎఫ్‌పీఐలపై తాజా సర్‌చార్జీ భారం మరింతగా పెరుగుతుందని, ఫలితంగా పన్ను పరంగా భారత్‌కు ఉన్న ఆకర్షణ తొలగుతుందని, విదేశీ పెట్టుబడులు నీరసిస్తాయని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ప్రతిపాదన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) భారం మరింతగా పెరుగుతుంది. ఈ పన్ను విషయమై త్వరలోనే వివరణ ఇస్తామని సీబీడీటీ చైర్మన్ పేర్కొనగా, ఇక ఎలాంటి వివరణ అవసరం లేదని, అంతా స్పష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెగేసి చెప్పారు. దీంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు... లిస్టెడ్ కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఫలితంగా స్టాక్ మార్కెట్లో షేర్ల సప్లై పెరిగి లిక్విడిటీ ఆవిరైపోతుంది. ఐటీ, పీఎస్‌యూ షేర్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఇక ఎమ్ఎన్సీలు మన మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తాయి. ఇక సంపన్నులపై అధిక పన్నులు విధించడం, షేర్ల బైబ్యాక్‌పై 20 శాతం పన్ను తదితర ప్రతిపాదనలు కూడా మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం... అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతకు సిద్ధమవుతోంది. అయితే గత శుక్రవారం వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాలను మించాయి. ఆర్థిక వ్యవస్థ బానే ఉందన్న సంకేతాలు ఈ గణాంకాలు ఇవ్వడంతో ఫెడరల్ రిజర్వ్ రేట్లకోత విషయంలో పునరాలోచించే అవకాశాలున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మోర్గాన్ స్టాన్లీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లను డౌన్‌గ్రేడ్ చేయడమే కాకుండా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తన పెట్టుబడులను తగ్గించుకోవాలని(ఇది దాదాపు ఐదేళ్ల కనిష్ట స్థాయి) నిర్ణయించుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ 2.5 శాతం, హాంగ్‌సెంగ్ సూచీ 1.5 శాతం, జపాన్ నికాయ్ సూచీ 1 శాతం, దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఇక యూరప్సూచీలు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. జూన్ క్వార్టర్ ఫలితాలు.. ఎలా ఉంటాయో ? వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బ్యాంక్‌లు మినహా ఇతర రంగాల కంపెనీల ఆర్థిక ఫలితాల్లో పెద్దగా మెరుపులు ఉండకపోవచ్చని, అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళన నెలకొన్నది. 2 రోజులు..రూ. 5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా సోమవారం ఇన్వెస్టర్ల సంపద రూ.3.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.3,39,193 కోట్లు ఆవిరై రూ.1,47,96,303 కోట్లకు పడిపోయింది. బడ్జెట్ రోజు సంపద నష్టాన్ని కూడా కలుపుకుంటే మొత్తం రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5,61,773 కోట్లు హరించుకుపోయింది. ఎదురీదిన యస్ బ్యాంక్ అన్ని షేర్లు క్షీణించినా, యస్ బ్యాంక్ మాత్రం ఎదురీదింది. ఆరంభంలోనే ఐదేళ్ల కనిష్ట స్థాయి, రూ.85.70కు పడిపోయిన ఈ షేర్ తర్వాత పుంజుకొని 5.5 శాతం లాభంతో రూ.93 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు భేషుగ్గా ఉన్నాయని యాజమాన్యం స్పష్టతనివ్వడంతో పాటు ఉన్నత స్థాయిల్లోని నిర్వహణ పదవులను భర్తీ చేయడం కూడా కలిసి వచ్చింది. సెన్సెక్స్‌లో ఈ షేర్‌తో పాటు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభపడ్డాయి. మొత్తం మీద 31 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు నష్టపోయాయి. -
సెన్సెక్స్ తక్షణ మద్దతు 33,750
ఫిబ్రవరి తొలివారంలో ప్రపంచ మార్కెట్లో కరెక్షన్ మొదలైన తర్వాత జరిగిన రికవరీల్లో ప్రపంచ ప్రధాన మార్కెట్లతో పోలిస్తే ఎంతగానో వెనుకబడిన భారత్ మార్కెట్ ప్రస్తుతం అవుట్ ఫెర్ఫార్మ్ చేస్తున్నది. వాస్తవానికి ఫిబ్రవరి కరెక్షన్ తర్వాత అమెరికా, లాటిన్ అమెరికా, కొన్ని ఆసియా సూచీలు వాటి పతనంలో 61.8 శాతం వరకూ కోలుకున్న తర్వాత.. క్షీణబాట పట్టాయి. కానీ ఆయా మార్కెట్లు కోలుకున్న సమయంలో మరింత దిగజారిన భారత్ సూచీలు ఇప్పుడు కీలకమైన ఫిబోనకీ గోల్డెన్ రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 61.8 శాతం కోలుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తున్నది. ఈ క్రమంలో... అంతర్జాతీయ పరిణామాలపరంగా ఎదురయ్యే క్షీణత ఈ వారం పరిమితంగా వుంటే.. కొద్దిరోజుల్లో భారత్ సూచీలు మరో 2 శాతం పెరిగే అవకాశం ఉందని మధ్యకాలిక టెక్నికల్ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రధాన సూచీల సాంకేతిక అంశాలు ఇలా ఉన్నాయి. సెన్సెక్స్ సాంకేతికాలు... ఏప్రిల్ 13తో ముగిసిన వారంలో స్థిరంగా ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో సూచించిన 34,280 పాయింట్ల లక్ష్యం సమీపస్థాయి అయిన 34,313 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 404 పాయింట్ల లాభంతో 34,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడోవారం. తద్వారా ఫిబ్రవరి తొలివారంలో కరెక్షన్ మొదలైన తర్వాత వివిధ కనిష్టస్థాయిల వద్ద నుంచి జరిగిన పలు ర్యాలీలతో పోలిస్తే ఇదే అతిపెద్ద ర్యాలీగా నమోదయ్యింది. దీంతో మార్చి 23నాటి 32,484 పాయింట్లస్థాయిని స్వల్ప, మధ్యకాలాలకు బాటమ్‌గా పరిగణించవచ్చు. అంటే రానున్న రోజుల్లో ఆ స్థాయిని పరిరక్షించుకున్నంతవరకూ ప్రతీ తగ్గుదల తర్వాతా మార్కెట్ మరింత పెరిగే అవకాశాలుంటాయి. ఇక సిరియాపై దాడులు జరిగిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా వుంటే ఈ వారం సెన్సెక్స్‌కు 33,750 పాయింట్ల సమీపంలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ మద్దతును కోల్పోతే క్షీణత 33,500 పాయింట్ల వరకూ కొనసాగవచ్చు. ఈ లోపున ముగిస్తే 32,920 పాయింట్ల వరకూ పడిపోయే ప్రమాదం వుంటుంది. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 34,465 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ కీలకమైన నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమిస్తే 34,610 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. తొలి నిరోధాన్ని దాటితే కొద్ది రోజుల్లో 34,930 పాయింట్లస్థాయిని కూడా సెన్సెక్స్ అందుకునే వీలుంటుంది. కీలక తక్షణ మద్దతు 10,355 ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ గతవారం క్రమేపీ ర్యాలీ జరుపుతూ చివరిరోజున 10,519 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 149 పాయింట్ల లాభంతో 10,481 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ తగ్గితే 10,355 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో గనుక కోల్పోతే 10,290 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ కొద్దిరోజుల్లో 10,097 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 10,560 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన గనుక ముగిస్తే 10,630 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. అటుతర్వాత కొద్దిరోజుల్లో 10,705 పాయింట్లస్థాయిని అందుకునే అవకాశం ఉంటుంది. -
రూ. 500 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం
తండ్రీకొడుకుల అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆలయాల నుంచి రూ. 500 కోట్ల విలువైన విగ్రహాలను దొంగలించిన కేసులో నిందితులైన వల్లభ ప్రకాశ్, ఆదిత్య ప్రకాశ్ అనే తండ్రీకొడుకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల్లోని విగ్రహాలు చోరీకి గురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు లు అందుతున్నారుు. 50 ఏళ్లలో తమిళనాడుకు చెందిన సుమారు వెయ్యికిపైగా విలువైన విగ్రహాలు విదేశాలకు తరలిపోయినట్లు తెలుసు కున్నారు. ఈ నేపథ్యంలో చోరీ నిరోధక ఐజీ పొన్ మాణిక్యం విగ్రహా ల అన్వేషణలో భాగంగా ముంబైకి చేరుకుని అక్కడి ఇండో-నేపాల్ ఆర్ట్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ప్రదర్శి తమై ఉన్న కొన్ని విగ్రహాలు తమిళనాడుకు చెందినవిగా గుర్తించారు. ప్రత్యేక దళాలను రప్పించి మంగళవారం ఆర్ట్ సెంటర్‌ను ముట్టడించారు. నిర్వాహకులు వల్లభ ప్రకాశ్, ఆదిత్య ప్రకా్‌శ్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఆర్ట్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ ప్రపంచ మార్కెట్లో రూ.500 కోట్లని అధికారులు చెబుతున్నారు. -
సెన్సెక్స్ 241 పాయింట్లు జూమ్
* ఎఫ్‌డీఐ సంస్కరణలు, ప్రపంచ మార్కెట్ల ప్రభావం * రెగ్జిట్ ప్రభావాన్ని తొలగించిన బ్రెగ్జిట్ ముంబై: రిజర్వుబ్యాంక్ గవర్నర్ పదవికి ఈ సెప్టెంబర్ నుంచి గుడ్‌బై చెప్పనున్నట్లు రఘురామ్ రాజన్ ప్రకటించడంతో (రాజన్ ఎగ్జిట్-రెగ్జిట్) సోమవారం ఉదయం మార్కెట్ క్షీణించినప్పటికీ, వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లతో కలసికట్టుగా ర్యాలీ జరిపాయి. 26,438 పాయింట్ల కనిష్టస్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్, ఆ స్థాయి నుంచి 400 పాయింట్లకుపైగా ఎగిసింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 241 పాయింట్ల పెరుగుదలతో 26,867 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 8,107 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి జోరుగా పెరిగి 8,238 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 68 పాయింట్లు లాభపడింది. బ్రిటన్‌పై అనుకూల సర్వేల ఎఫెక్ట్..: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రిటన్ ఎగ్జిట్-బ్రెగ్జిట్)ై అవకాశాలు సన్నగిల్లినట్లు తాజా సర్వేలు వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు జరిపిన రిలీఫ్ ర్యాలీ ప్రభావం మన మార్కెట్లపై పడిందని, దాంతో రాజన్ ఎగ్జిట్ ఆందోళనను ఇన్వెస్టర్లు తాత్కాలికంగా పక్కనపెట్టారని విశ్లేషకులు చెప్పారు. ఆసియాలో జపాన్,హాంకాంగ్, కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 1-2% మధ్య పెరగ్గా, యూరప్‌లోని బ్రిటన్,జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు 3%పెగా ఎగిసాయి. రేటింగ్ ఏజెన్సీల అభయం..: కొన్ని ప్రధాన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని సడలించడంతో మన మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు వివరించారు. ట్రేడింగ్ ప్రారంభంలో కనిష్టస్థాయి వద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. రాజన్ ఎగ్జిట్ కారణంగా ఇండియా సార్వభౌమ రేటింగ్‌కు ఇబ్బంది ఏదీ లేదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లను స్వాంతనపర్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏవియేషన్ రంగంలో నూరుశాతం ఎఫ్‌డీఐకి అనుమతించడంతో జెట్ ఎయిర్వేస్, ఇంటర్‌గ్లోబ్ షేర్లు 7.36% వరకూ పెరిగాయి. -
పసిడికి ‘డాలర్’ బూస్ట్
లాభాల స్వీకరణ ఉంటుందంటున్న నిపుణులు ముంబై: డాలరు బలహీనత, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా అట్టిపెట్డడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు... వెరసి పసిడికి బలం చేకూర్చుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలరు విలువ దిగజారడం గతవారం ప్రపంచ మార్కెట్లో పసిడి ర్యాలీకి కారణమయ్యింది. డాలరు బలపడితే పసిడిని విక్రయించడం, డాలరు క్షీణిస్తే బంగారాన్ని కొనడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమీపకాలంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా... పసిడి మెరుపులు కొనసాగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ఇప్పటికే రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో సమీప కాలంలో లాభాల స్వీకరణ జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రా)కు 1,200 డాలర్ల దిగువకు పడిపోయే పరిస్థితి లేదని వారి అంచనా. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ నెమైక్స్‌లో గడచిన శుక్రవారం నాటికి పసిడి వారం వారీగా చురుగ్గా ట్రేడవుతున్న జూన్ డెలివరీ ఔన్స్ ధర 70 డాలర్లు ఎగసి 1,290.50 డాలర్లకు చేరింది. దేశీయంగానూ పరుగు.. అంతర్జాతీయ పటిష్ట ధోరణితోపాటు దేశీయంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ పసిడికి డిమాండ్ పెంచింది. వరుసగా నాల్గవవారమూ లాభపడింది. ధరలు రెండేళ్ల గరిష్ట స్థాయికి ఎగశాయి. ప్రధాన స్పాట్ మార్కెట్- ముంబైలో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర వారం వారీగా రూ.465 పెరిగి రూ.29,820కి చేరింది. ఇక 99.9 ప్యూరిటీ ధర సైతం అంతే స్థాయిలో ఎగసి 29,970కి ఎగసింది. ఒక దశలో ధర రూ.30,000 దాటడం గమనార్హం. వెండి కేజీ ధర రూ.1,075 పెరిగి రూ.41,875కు చేరింది. -
అందరి చూపూ కొత్త ఐఫోన్ మీదే!
వాషింగ్టన్: ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు అందరి చూపూ.. యాపిల్ సంస్థ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ మీదే ఉంది. కొన్ని నెలలుగా యాపిల్ అమ్మకాలు ఆశించిన మేర వృద్ధి సాధించకపోవడంతో ఈ కొత్త ఐఫోన్ యాపిల్ అమ్మకాలకు పునరుత్తేజాన్నిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొంత కాలంగా యాపిల్ ఐఫోన్ అమ్మకాలు క్రమంగా క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో యాపిల్ స్టాక్స్ విలువ ఐబీఎమ్‌కు దగ్గరగా రావడం వాల్‌స్ట్రీట్ మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. అయితే గత రెండు వారాలుగా యాపిల్ యాపిల్ షేర్ల విలువ 5 శాతం మేర పెరిగింది. యాపిల్ ఈ నెలలో లాంచ్ చేయనున్న కొత్త ఐఫోన్‌ను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్‌ను ఆకర్షించేలా తక్కువ కాస్ట్‌కు అందించనుందన్న వార్తలు ఈ షేర్ల విలువ పెరగటానికి దోహదం చేశాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రజల అంచనాలకు అందనంత ఉత్తమమైన ఉత్పత్తులను యాపిల్ సంస్థ తీసుకొచ్చిన సందర్భాలున్నాయని, ఈ సారి కూడా అలాంటి ఆశ్చర్యం తప్పదని ఆపిల్ సంస్థలో 1 మిలియన్‌కు పైగా షేర్లు ఉన్న సైనోవాస్ ట్రస్ట్ కంపెనీ సీనియర్ పోర్ట్ ఫోలియో మేనేజర్ డేనియల్ మోర్గాన్ అన్నారు. మరి మార్కెట్ వర్గాల అంచనాలను యాపిల్ తన కొత్త ఐఫోన్‌తో అందుకుంటుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
ప్రపంచ మార్కెట్టే లక్ష్యం కాకూడదు
‘మేక్ ఇన్ ఇండియా’పై రాజన్ అభిప్రాయం శ్రీనగర్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యం కాకూడదని అన్నారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన జరుపుతున్న రాజన్, ఇక్కడ ఒక బిజినెస్ స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ తయారీ పరిశ్రమకు భారత్ కేంద్రం కావాలని, పెరుగుతున్న జనాభాకు తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రధాన లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై రాజన్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే... ⇒ భారత్‌లో తయారీ రంగం పురోభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో విలువైనది అనడంలో సందేహం లేదు. అయితే ప్రపంచ మార్కెట్ మాత్రమే ఈ కార్యక్రమానికి లక్ష్యం కాకూడదు. ⇒ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటడానికి మనం తగిన ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. భారీ డిమాండ్ లేదు. ఈ అంశాలన్నింటినీ భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యంగా ఉంటే కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ⇒ తయారీ, సేవల రంగం వృద్ధికి మౌలిక అలాగే నియంత్రణాపరమైన తగిన వాతావరణాన్ని దేశం లో ఏర్పాటు చేయాలి. ఆయా అంశాలూ ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడతాయి. ⇒ ఎవరికోసం ఉత్పత్తి జరుగుతోందన్న అంశాన్ని మనం నిర్ణయించుకోకూడదు. ఇక్కడ ప్రధానంగా మనం తయారీ రంగం వృద్ధికి అవసరమైన మౌలిక పరిస్థితులు రూపకల్పన, వ్యాపారాలు తేలిగ్గా చేసుకునేలా నియమ నిబంధనల్లో సవరణలు, సుశిక్షుతులైన మానవ వనరుల అభివృద్ధి కీలకం.